Saturday, June 6, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 7

 

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 6

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 7

ప్రాగ్

30-4-89

మేముండే Nove Zamky కొద్ది దూరంలోనే ఉంది Hurbanovo. అక్కడే మా కార్యక్రమం. 30వ తేదీని. చిన్న ఊరు. మొత్తం 8000 మంది జనాభా. చిత్రం ఏమిటంటే ఈ ప్రదేశం అంతా వ్యవసాయికమైన ప్రదేశం. మన పల్లెటూళ్లలా. దగ్గర దగ్గర గ్రామాలు. అయితే ఈ గ్రామాలు చాలా నీటుగా మంచి భవనాలతో సౌకర్యాలు, షాపింగ్ సెంటరు, రోడ్లు, హోటేలు, మంచి ఆడిటోరియం యివన్నీ ఉంటాయి.


మగవాళ్లంతా వ్యవసాయిక కార్యక్రమాల్లో ఉంటారు కాబోలు. ఆడవాళ్లే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తున్నారు. వేషభాషల్లో పట్టణాలకి పల్లెలలకి తేడా కనిపించదు. మా కార్యక్రమం బాగానే చూసేరు. వాళ్లు ఏమి ఆనందించేరో ఎలా చెప్పగలం? చివరవరకూ కూర్చున్నారు. ప్రతీ item కీ చప్పట్లు కొడుతునే ఉన్నారు. 



రాత్రి డిన్నరు హర్బనోవో లోనే. అది ఒక చిన్న హోటేలు. అయితే అక్కడ ఆర్కెస్ట్రా, డాన్సులు అన్నీ ఉన్నాయి. మా గౌరవార్ధం ఒక వయొలిన్ వాద్యగాడు, ఒక ఎకార్డియన్ వాద్యగాడు పాటలు పాడేరు. చాలా ప్రచారంలో ఉన్న పాటలు. మాతో ఉన్న ఆడవాళ్లూ ఆ పాటలు పాడేరు. ఆ పాటలు వింటూ పాడుతూ వాళ్లు ఎంతో సంతోషంగా కనిపించేరు.

1-5-89

ఈరోజు మే' డే.

ఇక్కడ యిదో పెద్ద పండగ. అందరూ జండాలు పట్టుకొని marching,  ఉపన్యాసాలు అన్నీ జరిగేయి. వర్షం అలాగే ఉంది. అంటే తుషారం మాత్రం చలి. నిన్న రాత్రి మరో గ్రామం. గ్రామం అంటే తక్కువ జనాభా ఉన్న ఊరని. వైభవంగానే ఉంది. ఈ ఊరి పేరు షెల్లా.

Castle in the town

అంతా మామూలే. మాతో ICCR నుంచి గౌతమ్ భట్టాచార్య అనే యువకుడు వచ్చేడు. అతను బెంగాలీ అయినా ఢిల్లీ పౌరుడు. అతడు  lighting ఏర్పాటు కోసం ప్రత్యేకంగా పంపబడ్డాడు. తెలివైనవాడే. 34 ఏళ్ల వయస్సు. సన్నటి మనిషి. తీర్చిదిద్దిన ముఖం. కన్నులు. ఈ పిల్లలు అతణ్ణి అవజ్ఞ చేసినట్టు కబుర్లు చెప్తున్నా అతని యడల ప్రత్యేక శ్రద్ధ ఉందని తర్వాత తర్వాత తెలిసింది. అతనితో అన్నాను ఓమారు, 45 దాటిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూరులా ఉంటావని. అతను సంతోషించేడు ఆ మాటకి. అతను ఈరోజు కార్యక్రమం పూర్తి అవగానే ఢిల్లీ వెళ్లిపోతాడు. మాతో బుడాపెస్ట్ రాడు.

2-5-89

11.30 కి lunch తీసుకొని Bratislava వెళతాం. ఈ festival ఆఖరి కార్యక్రమం అక్కడే. తిరిగి రాత్రికి వచ్చేస్తాం. Nove Zamky  3, 4 యిక్కడ. 5న బుడాపెస్టు. Hurbanovo లో అక్కడ మహిళామణులు Beer Bottles ఒక పెట్టి యిచ్చేరు. నిన్న ఉదయం కొంత ఏర్పాటు చేసేం. యిప్పుడు కొంత సేవించి భోజనం చేస్తాం.

Bratislavaలో మా కార్యక్రమం బాగా జరిగింది. సరోద్, మణిపురి కార్యక్రమాల కన్నా మా కార్యక్రమం అందరి మన్ననలు అందుకొంది. ఇండియా రాయబారి యీ సందర్భంలో ఒక Five Star Hotel లో విందు ఏర్పాటు చేసేరు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే ఈ  Nove Zamky  లో మాకు ఏర్పాట్లు చేస్తున్న మార్తా ఆవిడ దుబాసి, పేరు తెలియదు, మరో ఆవిడ, స్టేజీ మీద వ్యాఖ్యానం చసేది, ఆవిడా మా విజయాన్ని వాళ్ల విజయంగానే భావించి మహా మురిసిపోయేరు. అందులో కార్యక్రమం compere చేసే అమ్మాయి చాలా హుషారు, చిలిపితనం కలది. మార్తాలో హుందాతనం. మాకు ఇంగ్లీషులో చెప్పే ఆవిడ సహృదయత్వం, విశ్వాసపాత్రత, అమాయకపు వ్యక్తి.

 


No comments: