Saturday, May 9, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 3

 

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 3

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 3

ప్రాగ్

26-4-1989

ప్రాగ్ చాలా పరిశుభ్రంగా, హుందాగా ఉంది. అన్ని గొప్ప నగరాల లక్షణాలతోనే కనిపిస్తోంది. మా అందరికీ ఉత్సవ కార్యక్రమం, జెకోస్లోవేకియా దేశపు పరిచయం చేస్తొన్న typed matter యిచ్చేరు. ఈ దేశంలో 60% ప్రజలు gypsy లుట. వాళ్లంతా వివిధ ప్రాంతాలనుంచి వచ్చేరట. ఇండియా నుంచి వచ్చినవారూ ఉన్నారు. బహుశః మన జక్కులవాళ్లకీ, జెకొస్లోవేకియా జక్కులకి సంబంధం ఉందేమో. ఇక్కడి కరెన్సీ క్రౌన్ పేరుతో ఉంది. ఇక్కడి క్రౌన్ మన రూపాయి కంటే విలువ తక్కువ. 65 పైసలేనట యిక్కడి క్రౌన్.

Hotel Intercontinental, Prague

ఈ హోటేలులో నాకు single room యిచ్చేరు. అంటే ఈ గది అంతా నా స్వంతం అన్నమాట. 25వ తేదీని ఇక్కడ కల్చరల్ పేలస్ లో వేసవి పండుగ ప్రారంభం అయింది. Indian Ambassador, BM ఓఝా, ఈ దేశం అధ్యక్షుడు, గుస్తావ్ హుసేన్, యిద్దరూ ప్రారంభోత్సవం చేసేరు.  ఓఝాగారు హిందీలో మాట్లాడేరు, ఈ రెండు దేశాల మధ్య సుహృద్భావ ప్రకటన చేస్తూ, జవహర్ లాల్, ఇందిరాగాంధి, రాజీవ్ గాంధీలను ప్రస్తుతిస్తూ, గంగా, ఓల్గా నదుల ప్రాధాన్యం ఉగ్గడిస్తూ. ఆఖరికి యజుర్వేదంలో శాంతి మంత్రం పఠించి శాంతి శాంతి శాంతిః అని చెప్పేరు.    

మొదటి కార్యక్రమం శరన్ రాణి అనే ఆవిడ. వృద్ధాప్యంలోకి యికా రాలేదు. కమలాదేవి ఛటోపాధ్యాయ పోలికలు. ఈవిడను దూరదర్శన్ లో చూసేం. కాపీ రాగం ఆలాపన చేసింది. మొత్తానికి యిక్కడ ప్రజలు రసికులే. అంటే బాగా చప్పట్లు కొట్టగలరు. తర్వాత మణిపురి బృందం, ఆ తర్వాత మాది. అందరికీ 20 నిమిషాలే టైం. మా కార్యక్రమం చాలా హుషారుగా నడిచింది. శృతులు కలవకపోయినా. పిల్లలు బాగా చేసేరు. అయినా తప్పులుంటాయి కదా! మాస్టారు కొంతసేపు అలిగి కూర్చున్నారు. ఉదయానికి శశికళ ఆయన్ని మామూలుగా, శాంతంగా మార్చగలిగింది. వినయవిధేయతలతో.

ఈవాళ, అప్పుడే 26 ఏప్రిల్. సాయంకాలం పూర్తి కూచిపూడి కార్యక్రమం. ఉదయం యథావిధిగా రిహార్సల్స్ చేసేం. నిన్నటి ఆడిటోరియంలోనే మరో ప్రదేశంలో మా కార్యక్రమం. థియేటరు చిన్నది. మైక్స్ మూడే ఉన్నాయి. లైటింగ్ ఏర్పాటు అనుకూలంగా లేదు. అయినా యథావిధిగా మా కార్యక్రమం ముగిసింది. ప్రేక్షకులు చప్పట్లు కొడుతునే ఉన్నారు. ఆటకత్తెలు రెండు మూడుసార్లు దర్శనం యిస్తేకానీ కరతాళములు ఆగేవికావు.