Saturday, April 18, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - ముక్తాయింపు - 6-4-2000

 

 Click here for - అమెరికా 12

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 13

6-4-2000

నిన్ననే ఉగాది విక్రమ సంవత్సరం.

ఇటీవల ఈ పుస్తకం చదువుకోవడం జరిగింది. కొన్ని అక్షరాలు బోధపడక వాటిమీద తిరిగి రాయడం మంచిదనిపించి ఓపిగ్గా అప్పుడూ అప్పుడు రాస్తూ వచ్చేను.

అసలు 86లో జరిగిన ఈ పర్యటన గురించి రాయడం ఎందుకు జరిగిందీ? అప్పుడే ఆరుసార్లే ఏడుసార్లో అమెరికా పర్యటన జరిగింది. మొట్టమొదట 71లో శ్రీ ఘంటసాలగారితో. ఆ పర్యటనలో మొదట జర్మనీలో గొటింగన్ యూనివర్సిటీ. ఇది 1971 అక్టోబరు అని జ్ఞాపకం. తిరిగి నవంబరులో మొదటి వారం తిరిగి వచ్చేసాం. ఆనాడు న్యూయార్క్ తెలుగు సాంస్కృతిక సంఘం ఏర్పాటు. అప్పుడు శ్రీ పాలంకి రామమోహనరావుగారింట మా బస. శ్రీ ఘంటసాలగారు, నేను, మా మేనేజరు, క్రిష్ణమూర్తిగారు. రామమోహనరావుగారు, ఆయన ఆ సంఘానికి కార్యదర్శి. శ్రీ ఓలేటి రామారావుగారు వారింట్లో guest గా ఉండేవారు. ఆనాడు పరిచయమైన వ్యక్తులు, కాశి శాస్త్రి, గంటి సూర్యనారాయణ, దశిక రాధాక్రిష్ణమూర్తి, యింకా ఎవరో. పాలంకి రామమోహనరావుగారిని, దశిక రాధాక్రిష్ణమూర్తిగారిని తర్వాత మా పర్యటనలలో చూసేను చాలాసార్లు.

సరే, ఇవన్నీ ఎందుకు రాసేనయ్యా ... ఇన్నిసార్లు అమెరికా వెళ్లి వచ్చినా పర్యటన విశేషాలు రాయలేదు. 71 తర్వాత 82 నుంచి 96 వరకూ 6 సార్లు అనుకొంటాను వెళ్లివ్చేం. ఈ పర్యటనలో విశేషం ఏమిటంటే తెలుగు సంఘంతో  ఏ విధమైన సంబంధం లేదు. ఈ పర్యటన ఏర్పాటకి శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మగారు Performer మాత్రం. వెంపటి చిన సత్యంగారే నాయకుడు ఈ పర్యటనకి. Party leader సత్యంగారు కాకపోతే వాద్యసహకారానికి మేము వెళ్లి ఉండేవాళ్లం కాదు. ప్రేక్షకులంతా అమెరికన్లు. అన్ని ఏర్పాట్లు చేసిన ఆమె మార్తా ఏస్టన్. ఇండియా festival Ford Foundation ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఇవి. అమెరికాలో ఎప్పుడూ చూసే ప్రసిద్ధ పర్యాటక స్థలాలకి సంబంధం లేదు. అన్నీ విశ్వవిద్యాలయాలకి సంబంధించిన కార్యక్రమాలు యివి. లోగడ మేము అమెరికాలో పొందిన అనుభవాలకి భిన్నమయినవి. బహుశః ఈ పర్యటన గురించి ఇంత ఆసక్తిగా రాయడానికి కారణం అదేనేమో...