Saturday, November 22, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 11 - 08-10-1987

 


 

Click here for - రష్యా 10 - 05 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 11

8-10-87

ఈరోజు ఉదయం breakfast తర్వాత బస్సులో ఛుంకెట్అనే ఊరు వచ్చాం. జంబుల్ నుంచి యిక్కడికి మూడు గంటల ప్రయాణం. చౌరాసియా బృందం కూడా మాతోటే వచ్చేరు. రాగానే భోజనం లేదు. ఆఖరికి bread, పళ్లు, cakes, తిన్నాం. ఆరు గంటలకి lunch. ఇప్పుడే పూర్తిచేసి రాస్తున్నాను. రాత్రి మళ్లా తొమ్మిదికో, పదికో డిన్నరుట. సూర్యారావుగారు, రత్తయ్యగారూ shoppingకి బయల్దేరేరు. సూర్యారావుగారి దగ్గర రూబుల్స్ అయిపోయాయి. పది రూబుల్స్ పుచ్చుకున్నారు, మాలా గణపతి తనకి యివ్వాలని తిరిగి యిచ్చేస్తానని.

ఇవాళ దారిలో జంబుల్ నుంచి చుంకెంట్ వస్తున్నప్పుడు దారిలో మంచు బాగా పడింది. మంచు బంతులు చేసి విసురుకున్నారు చరుకైనవాళ్లు. అక్కడా యిక్కడా కూడా చలి బాగా ఉంది. చిత్రం, చుంకెంట్ లో మంచి ఎండ ఉంటూ మంచి చలిగా ఉంది. రేపూ, ఎల్లుండీ యిక్కడ. తరవాత నూకూన్ వెళ్లాలిట. అక్కడికి వెళ్లాలంటే తాష్కెంట్ వెళ్లి మరో flightలో వెళ్లాలి.

బట్టలు మార్చుకొని కాస్త విశ్రాంతి తీసుకొందామనుకొన్న సమయంలో తలుపు కొడితే వినపడి వెళ్లేను. చౌరాసియా బృందం interpreter. లోపలికి రమ్మాన్నాను. అతనికి ఇండియన్ శాస్త్రీయ సంగీతం యిష్టంట. మొత్తానికి వీణ బురఖా తీసి నఖశిఖ పర్యంతం పరిక్షచేసి తన్మయుడయిపోయేడు. తరవాత దానిని శృతి చేసే పద్ధతి, వాయించే పద్ధతి ఆ వాద్యంలోని విశిష్టత తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలు ప్రకటించేడు. అతనికి వీణ మీద ప్రారంభ శిక్షణ ఎలా యిచ్చేదీ చెప్పేను, వీణ మీటు దగ్గరనుంచి. వీణ పట్టుకొని ఒక రెండు గంటలు వదలలేదు. చిత్రం, అతనికి వీణ అమరింది. సరళీస్వరాలు ఒక మూడు ఖచ్చితంగా సునాదంగా వాయించడం వచ్చింది. వీలు చూసుకొని వచ్చి మళ్లీ సాధన చేస్తానన్నాడు. ఇంతకీ అతని పేరు అడగడం మర్చిపోయేను. ఎనటోవ్ అని అంటున్నారు సూర్యారావుగారు. అతడు తన గదికి వెళ్లిపోయిన తర్వాత సూర్యారావుగారు చంపాగ్నితెచ్చేరు. ఆ అగ్నిని అర్చించేం, కొంతసేపు. దక్షిణ – మనిషికి నాలుగు రూబుల్సు.

9-10-87

యథాప్రకారం స్థానిక దృశ్యపర్యవేక్షణ జరిగింది. సరే, ఒకాయన వచ్చేడు, మాకు విషయాలు వివరించడానికి. ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. దాని మీదకి పోవడానికి మెట్లు. అక్కడ ఒక ఫైటరు విమానం ఉంచేరు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వీరుల స్మృత్యర్థంగా. సరే, మా వ్యాఖ్యాత స్థానిక చరిత్ర అంటే చుంకెంట్ పుట్టిన దగ్గర నుంచి చెప్పేడు. 1218లో ఛెంగిస్ ఖాన్ ఈ ఊరిని జయించేడట. తర్వాత అలా అలా చెప్తూ 1923 కావోలు అప్పటికి రష్యా యూనియన్ లో చేరినంత వరకు ఒక గంట సేపు హిస్టరీ పాఠం చెప్పి వదిలేడు. రామరామ, నీనా ముఖం ఎర్రపడిపోయింది అనువాదం చెయ్యలేక. పాఠం ఎగవేసిన కుర్రాళ్లలా మేం తిరుగుడు ప్రారంభించేం. తర్వాత హిస్టరీ మాస్టారు ఏది కనబడితే దాన్నివిశదపరిచేరు. ఇది రైలు స్టేషన్, ఇది పోస్టాఫీసు, ఇది మార్కెట్, ఇది ఫలానా, ఇది ఫలానా అంటూ. ఆఖరికి విమానంలా ఉన్న రెస్టేరంట్ కి వెళ్లేం. విమానంలాంటిది కాదు. విమానమే. దానిలోకి ఎక్కి విమానయంత్రం అంతా పరిశీలించవచ్చును. సరదా ఉన్నవాళ్లు విమానం నడుపుతున్నట్టు ఫోటోతీయించుకున్నారు కూడా. తర్వాత ఒక ఆడ shopping centre అనగా అన్ని ఆడవాళ్లకి ఉపయోగపడే వస్తువులున్న మాట. అప్పటికే టైము అయిపోయింది. షాపింగ్ మీద దృష్టిపడలేదు. శ్రీ BVS మణిగారి అమ్మాయి, లక్ష్మి మాత్రం మంచి బొమ్మ, ఈ దేశం అలంకారంతో ఉన్న ఆడపిల్ల బొమ్మ కొంది. కొంచెం పెద్దది. తీసుకొని వెళ్లడం శ్రమ. బొమ్మ చాలా బాగుంది. కల్పలత కొంది బొమ్మ బొచ్చుకుక్క. దానికి మొహం, కళ్లు కనిపించలేదు. అంతా బొచ్చే.

రాత్రి చండాలిక సార్థకమయింది. ఎందుకలా అయింది? _______ అన్నట్టుగా అయింది. మైక్సు సరిగా లేకపోవడం. ఒకరికొకరు సంబంధం లేకుండా దూరంగా కూర్చోడం. పాడేపాటకి వాయించే వాద్యానికి పొంతన లేకపోవడం, యింకా ఎన్నో.

నిన్న రాత్రి లేలా పుట్టినరోజు. 20 నిండి 21 వచ్చిందిట. హోటేలులో రాత్రి భోజన సమయంలో ఆ అమ్మాయి cake cut చేయడం, హరిప్రసాద్ చౌరాసియా, గురు వెంపటి చిన్న సత్యంగార్ల ఆ ఆశీస్సులు పొందడం, తక్కుంగల కళాకారుల శుభాకాంక్షలు కూడా తోడై రావడం ఆ అమ్మాయి సంతోషాన్ని యినుమడించాయి.

10-10-87

ఈవాళ రాత్రి రుక్మిణీకల్యాణం అన్నారు. కాదు, items అంటున్నారు. ఏదో అది అయేక తిండి, నిద్ర పూర్తి చేసి తెల్లవారు జామున ఐదు గంటలకు బస్సు మీద తాష్కెంట్. అక్కడి నుంచి నూమస్. అదీ కార్యక్రమం. లేదు, రుక్మిణీకల్యాణం లేదు, గిరిజాకల్యాణం లేదు, ఏ కార్యక్రమం లేదు. రోజంతా రెస్టే.

మధ్యాహ్నం lunch తర్వాత మోటారు కారుతో acrobats చూసే కార్యక్రమం ఉందన్నారు. నేను వెళ్లలేదు. మళ్లా నిద్రలేచీసరికి మధ్యాహ్నం నాలుగు దాటింది. చౌరాసియాగారి interpreter వచ్చేడు. మరో రెండు గంటలు వీణ సాధన చేసి వెళ్లేడు. ఈ రష్యా సంచారం పూర్తి అయేసరికి అధమం అలంకారాల వరకైనా వస్తుందేమో అతనికి. సూర్యారావుగారు తిరిగి వచ్చేరు. కారు ఫీట్సు బాగున్నాయిట. మగవాళ్లు motorcycle తో చేయడం తప్ప కారు feats చేయడం అలవాటులేదు. తెల్లవారు జామున నాలుగు గంటలకి లేచి తాష్కెంట్ వెళ్లి అక్కడ నుంచి నూమాస్ వెళ్లాలి.