16.9.87
అనుకొన్నట్టుగా ఒంటి గంటకి భోజనం చేసి ఫెర్గానా వెళ్లడానికి airport కి బయల్దేరాం. సరీగా 3.10 కి flight.
ఆ విమానం మా కోసమే ఏర్పాటుచేయబడింది. మేము 23 మంది.
మా interpreters ముగ్గురు. మరొకరు ఉన్నారు. అంతే. విమానం నిండిపోయింది. తాష్కెంట్ నుంచి
ఫెర్గానా సరీగా 45 నిమిషాలు ప్రయాణం. విమానంలోంచి భూమి, పట్టణాలు, నదులు అన్నీ
కనిపిస్తునే ఉన్నాయి. మధ్య ఆసియాలో చాలా భాగం ఎడారి. బాబరు, చెంగీశ్ ఖాన్, తైమూరు
ఈ ప్రాంతాలనుంచి వచ్చినవాళ్ళే. మా
యింటర్పెటర్సు ముగ్గురు. వ్లాడిమరు, లేలా, నీనా. వ్లాడిమరు, నీనా మాస్కో నంచి
వచ్చేరు. మా సహాయంకోసం వాళ్లద్దరూ ఇంగ్లీషు మాట్లాతారు. లేలా కొంత కాలం ఇండియాలో
ఉంది ట. ఆ అమ్మాయి హిందీ మాట్లాడుతుంది. చిన్నప్పుడు సీతా, అనసూయలలోని అనసూయ ఈ
లేలా లాగే ఉన్నట్టు జ్ఞాపకం. వ్లాడిమరు గడ్డం యువకుడు. ఈ లేలా మాత్రం
ఉజ్బెకిస్థాన్ కి సంబంధించినది. నీనా నూతన యవ్వనంలో ఉన్న అమ్మాయి. వ్లాడిమర్ ని,
నీనాని ఏదో అనుమానంతోనూ, దెబ్బతిన్నట్టుగానూ చూస్తుంటుంది లేలా. మా కార్యక్రమం
వివరించడానికి మరొక అమ్మాయి కూడా ఉంది. పేరు లీనా.
ఫెర్గానాలో మాకు ఉజ్బెకిస్థాన్ సంప్రదాయ సిద్ధమైన స్పాగతం యిచ్చేరు. Airport లో “Welcome to Indian Guests” అనే మాటలు ఎర్రటి గుడ్డమీద రాసి ఉంచేరు. మన తాషామరపా, తుత్తురీలు లాంటి 3
పెద్ద తాషామర్పాలు లయబద్ధంగా ఒకటే స్వరం వాయిస్తుంటే మరో క్లారినెట్ లాంటి వాద్యం
మీద ఏదో ట్యూన్ వాయించేరు. ఒక రెండు వందలమంది యువతులు, యువకులు, పిల్లలు, పెద్దలూ
అందరూ మాకు స్వాగతం చెప్పేరు. వాళ్ళందరిదీ ఉజ్బెకిస్థాన్ జాతీయ వస్త్రధారణే. అంటే
ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు మొదలైన రంగు చారలు గల పట్టుబట్ట గౌన్లు, మొదలైన రకాల దుస్తులు. యువతులు అందరూ ఆరోగ్యంగా,
బలంగా, అమాయకంగా ఉన్నారు. వాళ్లు స్వాగతం చెప్తూ నాట్యం చేసారు. మేముగూడా వాళ్లతో
అడుగులు వేయాలి కాబోలనుకొని అడుగులు వేసాం.
ఉజ్బెకిస్థాన్ లో రష్యా పౌరులు అనేకులు ఉన్నా, ఉజ్బెకిస్థానం మనుషుల ఆకారంలో కొంత మంగోలియన్
రూపురేఖలు కనబడతాయి. వాళ్ల టోపీలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. చాలామంది బంగారపు
పళ్లు కట్టించుకొని ఉన్నారు.
ఫెర్గనా హోటేలులో మేం ఉంటున్నాం. తిరిగి 21 తేదీని మరో చోటికి వెళ్లాలిట. రేపు వాళ్ల కార్యక్రమం మేము చూడాలిట. 18, 19 తేదీలలో మా కార్యక్రమం ఉంది. 19 తేదీ మరో ఊరు. బస్సుమీద వెళ్లి తిరిగి ప్రోగ్రాం అయిన వెంటనే ఫెర్గానా వచ్చేస్తాంట.
అలా ఊరు తిరిగి వస్తామని శ్రీ సూర్యారావుగారు మిగిలిన మన వాళ్లంతా వెళ్లేరు. నేను
రూములోనే ఉండిపోయేను. Airport కి బయలుదేరే ముందు వీణకి దెబ్బ తగిలింది ఇతరుల అజాగ్రత్త వల్ల. దానిని మరమ్మత్తు
చేసుకోవాలి. ఫరవాలేదు పని జరుగుతుంది.
17.0.87
ఉదయం 7 గంటలకే లేచాం. అంటే మద్రాసులో 4 గంటలకి లేచినట్టు, చీకటి ఉంటుంది. మాకు ఈ హొటేలులో నీళ్లు మరగబెట్టుకొందికి ఒక కెటిలు లాంటిది, ‘సమోవార్’ అని కాబోలు అంటారు, ఉంది. మన కెటిల్ కంటే తమాషాగా ఉంటుంది. Plug తగిలించి నీళ్లు మరగబెట్టుకొని కాఫీ తాగేం. ఉదయం 9 గంటలకి breakfast తృప్తిగానే ఉంది, కాఫీ బాగులేదు, వాళ్లిచ్చినది. కాఫీకి మనం అలవాటు పడిన వాసన, రుచీ కంటే భిన్నంగా ఉంది. ఒహో కాఫీ యిలా కూడా ఉంటుందన్నమాట అనుకొన్నాం. రొట్టి అనగా bread, butter, jam, fruit juice, omelette, యింకా ఏవో ఏవో యిచ్చారు. తరవాత మమ్మల్నందరినీ లెనిన్ విగ్రహం దగ్గరకి తిసుకొని వెళ్లారు. చాలా పెద్ద విగ్రహం.
మధ్యాహ్నం భోజనం అయిన వెంటనే ఒక shoe
factory కి తీసుకొని వెళ్లారు. అక్కడ జోళ్ల యొక్క వివిధ
భాగాలు తయారు చేసి, అన్నీ కలిపి కుట్టి జోడు పూర్తి అయే వరకూ వివిధ దశలు చూసేం.
రోజుకి కొన్ని వేలో లక్షలో జోళ్లు తయారవుతాయిట. అక్కడ కార్మికులు చాలామంది
స్త్రీలు. వాళ్లంతా మమ్మల్ని వింతగానూ, ఆప్యాయంగానూ హావభావాలతో పలకరించేరు. ముఖ్యంగా
మన రంగు, వస్త్రధారణ, స్త్రీల చీరకట్టు, బొట్టు కూడా వాళ్లకి వింతే అనుకొంటాను.
కొందరు ఆశ్చర్యపోతూ కూడా ఉన్నారు. కొందరు వెర్రినవ్వుతో తమ కుతూహలాన్ని
ప్రదర్శించేరు. ఎవరూ అపహాస్యం చేస్తున్నట్టు అనిపించలేదు. తిరిగి మేము బస్సు
ఎక్కబోయే సరికి కొన్ని వందల మంది మూగేరు. ఆ Factoryకి చెందిన జ్ఞాపికలు, ఏవో బిళ్లలు, చొక్కాలకి తగిలించుకొనేవి యిచ్చేరు.
తిరిగి సాయంకాలం 7 గంటలకి మా కోసం స్థానిక కళాకారుల బృందం సంగీత నాట్య
ప్రదర్శనలు చేసేరు. పాటలు మన పాటలతో పోలిక కలిగి ఉంటాయి. కొంత అరేబిక్ సంగీత
ధోరణిలో ఉన్నాయి. వాద్యాలు కూడా అరేబిక్ వాద్యాలే. డప్పు మాదిరి తాళవాద్యం, బాంజో,
మేండొలిన్ పూర్వరూపంలా ఉన్న తంత్రీవాద్యం రుబబ్ ప్రధానంగా ఉన్నాయి.
కార్యక్రమం మధ్యలో మేము కూడా ఒక రెండు అంశాలు ప్రదర్శించాము. మామూలు లౌక్యం కోసం అన్నట్టుగా లేదు వాళ్ల రసికత. నిజంగా వాళ్ళు మన నాట్య సంగీతాల్ని అనుభవించగలిగేరు. కారణం వాళ్ల నాట్య సంగీతాలకి మన నాట్య సంగీతాలకీ చాలా పోలికలున్నాయి. సంగీతంలో melody ప్రధానం రెండింటికి.
మా అందరి దగ్గరా autograph లు తీసుకొన్నారు చాలామంది. మామూలుగా రోడ్డుమీద పోతున్నవాళ్లు కూడా సంతోషంగా
చేతులు ఊపుతూ కనిపించేరు. ఇది ఏవిధమైన రాజకీయపు వత్తిడితో చేసినట్టుగా కనపడలేదు.
రేపు ఉదయం breakfast అయిన తర్వాత యిక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు వెళ్లాలి. కార్యక్రమం
అయిన వెంటనే బయలుదేరి తిరిగి ఫెర్గాన చేరుకొంటాం. 19 తేదీని ఫెర్గానాలో ప్రధాన
కార్యక్రమం ఉంది.
18.9.77
అనుకొన్నట్టుగా ఫెర్గానా నుంచి ఉదయ బయలుదేరి కోకండ్ వెళ్లాం. రెండు గంటల లోపు ప్రయాణం బస్సు మీద. కోకండ్ కూడా పెద్ద ఊరే. మొట్టమొదట ఒక ప్రాచీన కట్టడం దగ్గర మాకు స్వాగతం యిచ్చేరు. స్వాగతం అంతా మామూలే. తుత్తురీలు ఒక మూడు, ఏదో డప్పులాంటిది వాయిస్తారు.
కొన్ని వందల మంది పోగయేరు అక్కడ. బహుశః చాలామంది స్కూలు పిల్లలు కూడా ఉన్నట్టుంది. ఇక అక్కడ స్థానిక సంగీతజ్ఞులు, డాన్స్ చేసే పిల్లలు ఉన్నారు. తార్ అనే వాద్యం, రుబబ్ అనే వాద్యం – రెండూ తంత్రీవాద్యాలు. ఒక ఎకార్డియన్, flute, tape. దానిమీద తార్ వాయిస్తూ పాడతారు. పాటలు చాలా మన సినిమా పాటలు గుర్తుకువస్తాయి. రమారమి అన్ని పాటలు తిశ్రంలో ఉన్నాయి. రాగాలు సింధుభైరవి, శంకరాభరణం మొదలైనవి వినిపిస్తాయి. పదేళ్ళ పిల్లలు దగ్గర నుంచి వయోభేదం లేకుండా అలా డాన్సు చేస్తునే ఉంటారు. అంతేకాదు మనని కూడా వాళ్లతో చేయమంటారు. వాళ్లు చేసేది చాలా simple dance అనిపిస్తుంది. కానీ చాలా grace ఉంది. పిల్లలు ఆరోగ్యంగా అందంగా ఉంటారు.
అక్కడనుంచి మరోచోటికి తీసుకొని వెళ్లారు. అక్కడ భోజనం. ఎక్కడికి వెళ్లినా
చుట్టూ వందల కొద్దీ మనుషులు. భోజనం బాగానే ఉంది. అందరూ వింతగా మన చుట్టూ చూస్తుంటే వేగం ఏకాంతంగా
ఎక్కడికైనా పోవలనిపిస్తుంది. విశ్రాంతి లేదు.
అక్కడనుంచి ఒక మ్యూజియంకి తీసుకొని వెళ్లారు. 16వ శతాబ్దంలో పరిపాలించిన ఎవరో
ఖాన్ కట్టించిన భవనం అది. ముస్లిం సంప్రదాయంగా ఉంది Dome తో. లోపల చాలా ఆనాటి
రాజరికంవారు ఉపయోగించిన సామగ్రి అంతా ఉంది. చివరికి ఆ ముస్లిం రాజు రష్యన్ సేనలను
ఎదుర్కోలేక ఆఫ్ఘనిస్థాన్ పరారి అయేడట.
ఈనాడు ఉజ్బెకిస్థాన్ లో జాతీయదుస్తులుగా ఉపయోగపడుతున్న పట్టుబట్ట ఆ రాజు
పేరుగా ఉంది. Khan Atlas* అంటారుట.
*Khan-atlas is not a national dress, but a colorful traditional silk faric used to make Uzbekistan's clothing, such as the women's dress and the men's chapan (a quilted coat). The vibrant, iridescent, and intricate designs of Khan-atlas have become a distinct symbol of Uzbek culture, woven with techniques passed down through generations.
.jpg)












