Saturday, September 13, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 04-09-1987


 



కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 
- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 
 
  
రష్యా

తాష్కెంట్ పర్యటన – ప్రయాణం 04-09-1987 న మొదలైంది. రచన ప్రారంభం 11-09-1987

రష్యా పర్యటన ప్రారంభం నుంచి రాయాలంటే ఏ రోజుకారోజు, నిజానికి 04వ తేదీ తెల్లవారుఝామునుంచి రాయాలి.

రోజులన్నీ మామూలుగానే నడుస్తాయి. మనసులో నిలిచే అనుభవాలు చాలా తక్కువ వుంటాయి. చాలా అనుభవాలు పాతబడిపోయిన తరవాత వాటిని గుర్తుపెట్టుకుందామనే సరదా పోతుంది.  మొదటిసారిగా విమానం ఎక్కడం. అక్కడ నిత్యకృత్యంగా జరిగే air hostess ల కార్యకలాపాలు మొదలైనవి. అలాగే ఏ కొత్త వూరు వెళ్ళినా అక్కడి ప్రతి దృశ్యం, వస్తువు, వ్యక్తి మనని ఆకర్షిస్తారు. మద్రాసు నుంచి ఢిల్లీ చేరుకొనే వరకూ జరిగిన సంఘటనలు మామూలు సంగతులే.

మేము మద్రాసు విమానాశ్రయంలో పొందిన గాభరా జ్ఞాపకం ఉంది. మేమంతా చేరుకునేసరికి శ్రీ మాస్టారుగారి పెద్దబ్బాయి రాలేదు. మేము విమానం చేరుకునే సమయం మించిపోతూవుంది. ఆ అబ్బాయి స్కూటరు మీద వస్తానన్నాడు రాలేదు. ఆఖరికి, అతను వచ్చిన వెంటనే హైదరాబాదు విమానాశ్రయంలో మాతోకూడా వస్తున్న కమలారెడ్డికి ఫోన్ చేసి చెప్పమని శ్రీ మాస్టారుగారు, నేను బయల్దేరాం. మమ్మల్ని దిగబెట్టడానికి చిll గోపి, శ్రీ మాస్టారుగారి కుటుంబం వచ్చారు. చిll గోపి రావడం సంతోషంగాను, ధైర్యంగాను అనిపించింది.

హైదరాబాదు విమానాశ్రయంలో మస్టారుగారు కమలారెడ్డిని తీసుకుని రావడానికి వెళ్ళారు. విమానంలో నేను, కల్పలత తల్లి మాత్రం కూర్చున్నాం. చాలామంది ప్రయాణీకులు హైదరాబాదులో ఎక్కారు. మాస్టారుగారు రాలేదు. మాకు లోపల ఏదో గాభరా. మరేంలేదు, ఏ దుర్వార్త మద్రాసునుంచి వచ్చిందేమో అని. ఎలాగైతేనేం మాస్టారుగారు, కమలారెడ్డి విమానంలోకి వచ్చేరు. మరేం విశేషంలేదు. మాస్టారుగారి అబ్బాయి కమలారెడ్డికి ఫోన్ చేసి చెప్పాడుట. Airport కి రావడం ఆలస్యం అయిందని.

ఢిల్లీ Airport లో ICCR వ్యక్తి వచ్చేరు. ఎవరో తెలుగు యువకుడు. మమ్మల్ని సుఖంగా లోడి హోటేలుకి చేర్చేడు. మద్రాసులో బయల్దేరిన మన కూచిపూడి బృందం యింకా ఢిల్లీ చేరలేదు. తమిళనాడు ఎక్స్ ప్రెస్ 4 గంటలు లేటు. లోడి హోటేలు తెలుసు. ఒకసారి హేమమాలిని కార్యక్రమానికి ఢిల్లీ వచ్చినప్పుడు అక్కడే దిగాం.  అశోకా గ్రూపు హోటేలు అది. పెద్ద హోటేలు. మా బృందం వచ్చేవరకు మాస్టారుగారికి, నాకూ చెరొక సింగిల్ రూం ఇచ్చేరు. తెల్లవారుజామున లేవడం వల్ల హోటేల్ లో చక్కగా నిద్రపట్టింది.

మా బృందం అంతా ఢిల్లీ చేరుకున్నాక భోజనపు ఏర్పాటు జరిగింది. లోడీ హోటేలులో అన్నీ చాలా ఖరీదు. కాఫీ తాగాలంటే 7 రూపాయలు. భోజనం 30 రూపాయలు. ICCR వాళ్ళు ఆ లెక్కనే మాకు ఖర్చులు యిస్తారు. ఆ మధ్యాహ్నం లోడీ హోటేలులోనే అందరం భోజనం చేసాం. ఎవరో తమిళం ఆయన సహృదయుడు, సంగీత ప్రియుడు, ఆయనే వేరే South Indian Hotel కి వెళ్లమని సలహా యిస్తే రాత్రికి అక్కడికి వెళ్లాం. Taxi మీద వెళ్లి భోజనం చేసి వచ్చినా మాకు మనిషికి 15 రూపాయలు కావోలు అయింది అక్కడ. మేము 4 రాత్రే బయల్దేరాలి కావోలనుకున్నాం. కాదు, 5 రాత్రి బయలుదేరేం.

05.09.87

5 తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో ICCR ఉద్యోగి మమ్మల్ని రష్యా ప్రయాణానికి అనుకూలమైన దుస్తులు యిచ్చే షాపుకి తీసుకొని వెళ్లారు. అందరికీ Shoes, Soaps, శాలువా, Sweaters, అన్నీ వాళ్ల వాళ్ల సైజు బట్టీ యిచ్చేరు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కరోల్ బాగులోని ఒక South Indian Hotel లో అతి చౌకగా సంతృప్తిగా భోజనం చేసి తిరిగి హోటేలు చేరుకొన్నాం. మాతోనే శ్రీ షేక్ చినమౌలానా, అతని బృందం కూడా ఉన్నారు. శ్రీ చినమౌలానాతో లోగడ పరిచయం లేదు. మనిషిని మాత్రం చూసేను. చాలా సాత్వికమైన అగ్రహారీక బ్రాహ్మణ మొహం ఆయనది. మంచి భోజనప్రియుడు. ఏ కూర ఎలా వండాలో, గోంగూర, ఆవకాయ ఎలా సద్వినియోగం చేయాలో మొదలైన సంగతులు అతి తన్మయంగా చెపుతారు. ఆయన యిద్దరు మనుమలు, డోలు వాయించే ఆయన, యింకా మరో యిద్దరు కూడా ఉన్నారు.

5 సాయంత్రం 6 గంటలకే ఢిల్లీ airport కి చేరుకొన్నాం. రాత్రి పదిన్నరకి flight. ఆరోజు flight యింకా లేటు. మాది Air India ticket అయినా రష్యా విమానంలో బయలుదేరేం. విమానంలో నిర్ణయమైన సీట్లంటూ ఏర్పాటు లేదు. కూర్చుందుకి స్థలం దొరికేసరికి చాలా శ్రమ అయింది. వీణతో అటు ఇటు తిరగడం, జాగ్రత్త చేసుకోవడం కొంచెం చికాకు పనే. రాత్రి flight లో ఒకంతట భోజనం యివ్వలేదు. ఏదైనా తాగడానికి యిచ్చినా బాగుండును అనిపించింది. అన్నీ యిచ్చేరు. అయినా మా ఆతృత మాది. రష్యా విమానం లోపల ఆకారం కొంచెం తేడాగా ఉంది. ఢిల్లీ నుంచి తాష్కెంట్ 2 గంటల 40 నిమిషాల ప్రయాణం. మేం తాష్కెంట్ చేరి customs నుంచి బయటపడేసరికి స్థానిక కాలమానం ప్రకారం 5.30 అయింది. ఢిల్లీకి తాష్కెంట్ కీ 1.30 కాలం తేడా ఉంది. ఢిల్లీ టైము 4 గంటలలోపే అప్పటికి. తాష్కెంట్ లో మాకు సహాయం కోసం వచ్చిన interpreters  వ్లాడిమర్ అనే రష్యన్, లైలా అనే అమ్మాయి. ఈ అమ్మాయి హిందీ మాట్లాడుతుంది. వ్లాడిమర్ ఇంగ్లీషు మాట్లాడతారు. రాగానే హోటెల్ ఉజ్బెకిస్థాన్ కి తీసుకొని వెళ్ళారు. చాలా పెద్ద హోటేలు. 17 అంతస్థులు. మా గదులలో మేం చేరేసరికి 7 గంటలు ఉదయం.

ఇక్కడ చిత్రం ఏమిటంటే, ఉదయం 8 గంటలు దాటితే కాని సూర్యోదయం కాదు. అలాగే రాత్రి 8 దాటితే కాని చీకటి పడదు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ breakfast సమయం. Dining hall చాలా పెద్దది. రెండు వందల మంది ఒకేసారి భోజనం చేయవచ్చును. ఏ బృందానికి ఆ బృందం భోజనం చేసే స్థలం కేటాయించబడింది. మాది 34 నంబరు టేబిల్సు. శాకాహారం, మాంసాహారం విడివిడిగా ఉన్నాయి.

పెరుగు, పాలు, టొమేటో, ఆపిలు, ఆరంజి మొదలైన పానీయాలు, బ్రెడ్, cakes, అనేక రకాల మాంసాహారాలు, పళ్లు, అనేక రకాలు కాయకూరలు, ముఖ్యంగా బియ్యపు అన్నం టేబిల్సు మీద అమర్చబడి ఉన్నాయి. అనేక రకాలు sweets కూడా. అన్నీ చూసిన తర్వాత ధైర్యం వచ్చింది. లోగడ మేం చాలా అపోహ పడ్డాం కదూ. మన ఆవకాయ, గోంగూరా, కందిపొడి లేకపోతే ఏమైపోతామేమొ అనుకున్నాం. ఇప్పుడు వాటిని బయటికి తీసి ఉపయోగించడానికి ఉత్సాహం కలగలేదు. నేనూ, శ్రీ సూర్యారావుగారు ఒక గదిలో ఉంటున్నాం. మా యిద్దరి సంగ్రహనామం P.S.R. ఆయన పెమ్మరాజు సూర్యారావు, నేను పట్రాయని సంగీతరావు. ఆయన మంచి ఉత్సాహి, సహృదయుడు, లోకం తెలిసినవాడు. మందులు, వక్కపొడి, ఊరగాయలు, ఎప్పుడు ఏది అవసరమో అన్నీ జాగ్రత తీసుకొన్నారు. ముఖ్యంగా కాఫీ సమస్య. Breakfast లో కానీ కాఫీ దొరకదు. ఆ సమస్యనూ సూర్యారావుగారు సులువుగా పరిష్కరించేరు. ఆయన Bru instant coffee powder, పాలపొడి, పంచదార తీసుకొని వచ్చేరు. ఉదయాన్నే అంటే 7 గంటలకి తెల్లవారక ముందే ఆయన కిచెన్ లోకి పోయి వేడి  మరుగుతున్న నీళ్లు తెచ్చి కాఫీ కలిపి యిస్తున్నారు. ఈ పుణ్యం ఆయనకి వట్టినే పోదు. కాఫీ తాగడానికి శ్రీ మాస్టారుగారు కూడా మా రూముకి ఉదయాన్నే వస్తున్నారు.

6 తేదీ మాకు కార్యక్రమం లేదు. ఆ సాయంకాలం లెనిన్ స్క్వేరుకి తీసుకొని వెళ్లారు. ఈ ఇండియా ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు రెండు విధాలు. Outdoor కార్యక్రమాలు కొన్ని, మరికొన్ని auditorium లో.  సంగీత కార్యక్రమాలు, శాస్త్రీయ నాట్యాలు auditorium లో పెట్టేరు.

ఆరోజు లెనిన్ స్క్వేరులో చాలామంది భిన్న ప్రాంతల భారతీయ జానపద కళాకారుల ప్రదర్శన జరిగింది. గుజరాత్, నాగాలాండు, లంబాడీలు చాలామంది వచ్చేరు. ఈ ఉత్సవాలకి ఈ ప్రదేశం అంతా చిత్రమైన అలంకరణలు చేసేరు. Iron pipes తో చాలాఎత్తుగా నలుచదరపు గోపురాలు నిర్మించేరు. ఆ పైప్సు మీద వివిధ రంగులతో కుట్టిన అనేక డిజైన్లతో దూరానికి అవికూడా ఎత్తైన భవనాలలా అతి ఎత్తుగా కట్టేరు. అనేక భాషలలో, భారతీయ, రష్యన్ భాషలలో రాసి ఉన్నాయి. ఒక చోట తెలుగులో పండుగ అన్న  అక్షరాలు ఉన్నాయి. ఆ ప్రదేశం అంతా ఎక్కువ ఫౌన్ టెన్ లు ఉన్నాయి. అక్కడ లెనిన్ విగ్రహం చాలా పెద్దది ఉంది. రాత్రి 11 గంటల వరకు అక్కడ కార్యక్రమాలు నడిచేయి.  

మా కార్యక్రమాలు 7, 8, 9, 10, 12 తేదలలో జరిగేయి. ICCR ఉద్యోగులు మా కార్యక్రమాలకు యిక్కడ ప్రజలు ప్రకటించిన ఉత్సహానికీ, సంతోషానికి చాలా సంతృప్తిని పొందేరు. ఉషా మాలిక్ అనే ఆవిడ ICCR ప్రముఖ ఉద్యోగి. ఆమె రష్యాలో జరుగుతున్న ఇండియా ఫెస్టివల్స్’ అన్ని ప్రాంతాలు చూస్తూ ఇక్కడికి వచ్చింది. ఆమె మా కార్యక్రమాలను చూసి ఎంతో సంతోషించింది. 

మా కార్యక్రమాలే కాకుండా హరిప్రసాద్ చౌరాసియా flute, సారంగి రామ్ నారాయణ్, సంతూర్ వాద్యనిపుణుడు శివకుమార్ శర్మ,   ఇవన్నీ వినడం జరిగింది. సంగీత కార్యక్రమాలకన్నా నాట్యప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది. మా ప్రదర్శన ముందు శ్రీ చినమౌలానా కచేరి ఒక అరగంట జరిగేది.

ఉన్న పది రోజులు మా నిత్యకృత్యం ఒకే మాదిరిగా జరిగింది. హోటేలులో భోజనం మూడు పూటలు ఒకే మాదిరి. పెరుగు, పాలు, టొమేటో, ఏపిల్, ఆరంజ్ మొదలైన పానీయాలు. బ్రెడ్, కేకులు వివిధ తరహాలవి. బట్టరు, చీజు ఉంటాయి. మన వంకాయ వేపుడు ముక్కలు కూడా. బెగుళూరు మిరపకాయలు అన్నం పూర్ణం పెట్టి వేచినవి. టొమేటో ముక్కలు, దోసకాయయ ముక్కలు, బియ్యం అన్నం. అలాగే మైదాపిండి పూరీలలాటివి కరకరలాడే టైపు. తర్వాత ద్రాక్ష, ఏపిలు, పియర్స్, ఇవన్నీ అనేక టేబుల్స్ మీద ఉంటాయి. మూడు పూటలు ఒకే విధమైన ఆహారం.

మనవాళ్లు చాలామంది ఆవకాయలు, గోంగూర పచ్చడి, కొబ్బరిపొడి, కందిపొడి తెచ్చుకొన్నారు. శ్రీ సూర్యారావుగారు నెయ్యి, నూని కూడా తెచ్చేరు. నా ఆవకాయ సీసా తీసుకొని ఒకే పూటలో అందరం పూర్తిచేసేసాం.

ఈ వాతావరణంలో అంటే మన ఉష్ణమండలంలో కన్నా చెట్లు చాలా ఎత్తుగానూ, పచ్చగానూ పెరుగుతాయి. తాష్కెంట్ లో ఇటీవల నిర్మించిన అతి ఎత్తైన భవనాలతోపాటు, పాత కట్టడాలు, మసీదులు మొదలైనవి చాలా ఉన్నాయి.        

రోడ్లు చాలా విశాలంగానే ఉన్నాయి. అక్కడక్కడ అడవుల మాదిరి దట్టంగా ఉన్న పార్కులు చాలా ఉన్నాయి. 15 తేదీని యిక్కడ ఒక నాట్య పాఠశాలకి వెళ్లాం. అక్కడ నాట్యమే కాకుండా మామూలు విద్యాబోధన, సంగీతము మొదలైనవి చెప్తారు. 400 మంది విద్యార్థులు. వాళ్లు ఉండడానికి తగిన వసతులు అక్కడే.

చాలా చిన్నపిల్లలు, యువకులు, యువతులు వాళ్ల నాట్య పాఠ్యక్రమం వ్రదర్శించేరు. అందరూ ఆరోగ్యంగా, బలంగా అమాయకంగా. వాళ్ల సాధన చూస్తే ఎంతో సంతోషం కలిగింది. ఒక పియానో మీద ఏదో ట్యూను లయబద్ధంగా మైనది వాయిస్తుంది ఒకామె. ఈ పిల్లలంతా దానికి అనుగుణ్యంగా నాట్యంచేస్తున్నారు. ముఖ్యంగా మంచి నాట్యభంగిమలు మనం చూడగలం. తరవాత ఉజ్బెకిస్థాన్ జాతీయ నాట్యరీతి గూడా ప్రదర్శించేరు. దీనిలో ఒక డప్పు వంటి వాద్యం ఇద్దరు బేంజో వంటి తంత్రివాద్యం వాయిస్తారు. ఎవరూ పాటపాడుతూ నాట్యం చెయ్యలేదు. ఎక్కువ లయబద్ధముగానే వాళ్ల నాట్యం కనిపించింది. అంతకన్నా భంగిమలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతి నాట్యం సామూహికమైన రీతిగానే ఉంది. ఇక్కడి లెనిన్ మ్యూజియం చూసేం.  తర్వాత జూ చూసేం.

నిన్న అంటే 15 తేదీ రాత్రి 8 గంటలకి P C సర్కారు  ఇంద్రజాలం ప్రదర్శన జరిగింది. చాలా హడావిడిగా ఉంది. నాట్యం, సంగీతం రికార్డ్ చేయబడిన వాద్య సంగీతం ఈ యింద్రజాలానికి చాలా దోహదంగా ఉన్నాయి. విదేశాలలో ఒక భారతీయుడి ఇంద్రజాలానికి యింత దిక్ భ్రమ కలిగించడం మనసుకి సంతోషంగా ఉంది. అతని పార్టీ అంతా అధమం ఆడామగా కలిపి 25 మందేనా ఉంటారు. శ్రీ సర్కారు చేసిన పనులు రాస్తూకూర్చోవాలని కాదు. బాగున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి మేము మరో ఊరు బయలుదేరుతాం. ఈవాళంటే, 16 తేదీ. నిన్న రాత్రి ఆహారంలో ఏదో జరిగింది. నాకే కాకుండా పార్టీలో చాలామందికి వాంతులు, విరేచనాలు. నాకు ఒకేసారి వాంతి మాత్రం అయింది. వెంటనే మందు వేసుకొన్నాను.

మేము ఈవాళ వెళ్లబోయే ప్రదేశం ఫెర్గానా’. అదీ ఉజ్బెకిస్థానం లోనిదే. చాలా సుందరమైన, ఫలవంతమయిన ప్రదేశం ట. ఉజ్బెకిస్థాన్ లో మణిపూస ట.  ఉజ్బెకిస్థాన్ లో ప్రజలు అనేక తరహావాళ్లు కనిపిస్తారు. ప్రధానంగా ఇక్కడి ప్రజల వేషభాషలు, సంగీతం అరేబిక్ లక్షణాలతో ఉంది. చలి లేనట్టే. ఎండ కూడా బాగా ఉన్నట్టే. వాళ్లు జాతీయ దుస్తులుగా ఆడవాళ్లు ధరించేది ఎరుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ చారల పట్టు గుడ్డ. కొందాంటే మీటరు 13 రూబుల్సు ట. మాకు వాళ్లు 40 రోజులకి యిచ్చినది 200 రూబుల్సు. అంచేత ఆ గుడ్డ కొనే ఉద్దేశం మానుకొన్నాను. ఒక సంగతి మరిచేను రాయడం. P C సర్కారు ఇంద్రజాల ప్రదర్శన తరువాత ఉజ్బెకిస్థాన్ లో నాట్యవేత్తగా గొప్ప ప్రసిద్ధి పొందిన ఒక వృద్ధవనిత. ఆవిడకి 82 ఏళ్లు ట. ఆవిడ పేరు చెప్పడం మర్చేను. టమారా ఖానుమ్. 

                                                                        

Born 20 March 1906 Died 30 June 1991

P.C.సర్కారు ఇంద్రజాలాన్ని ఎంతో మెచ్చుకొని అతనిని అభినందించడం కోసం నాట్యం కూడా చేసింది. వచ్చేస్తున్నప్పుడు మా interpreter  మమ్మల్ని ఆవిడకి పరిచయం చేసాడు. ఆమె మాతో ఫోటో దిగింది. మర్నాడు ఆవిడ వారింట్లోనే ఏర్పాటు చేసిన స్వంత మ్యూజియం కి మమ్మల్ని ఆహ్వానించింది. నేను వెళ్లలేదు. ఆ మ్యూజియం రాజ్ కపూర్ ఆవిష్కరించేడుట. ఇంతకీ ఆ మ్యూజియంలో ఉన్నవి ఆమె ఘనతను చాటే వివిధ దేశాల ప్రముఖుల అభిప్రాయాలు, ఫోటోలు మొదలైనవి.

రాయడం మరిచేను. తాష్కెంటులో రష్యన్ సర్కసు చూసేం. అన్ని సర్కసులలాగే ఉంది. అయితే జంతువులు చాలా దృఢంగా ఉన్నాయి. జాలి కొలిపేటట్టు లేవు. ముఖ్యంగా ఎలుగుబంటి మోటరు సైకిల్ స్వారీ జ్ఞాపకం ఉంది. సర్కస్ డేరా కాదు  permanent auditorium.

No comments: