25-9-87
కొన్ని రష్యన్ మాటలు అత్యవసరమైనవి నేర్చుకొన్నాం అందరమూను. దబ్రా ఉత్రీ* అంటే good morning. స్పసీబా** అంటే (spasibo) thanks. దస్వదాన్య*** (దాస్వదానియ - Dasvidaniya) అంటే good bye. ఇంకా నిత్యకృత్యానికి అవసరమైనది – వద
– అంటే నీరు. గరీయబ్ వద – వేడినీరు. మలాకో అంటే పాలు. భాషామంజరి సమాప్తః.
నేటి ఉదయం sight seeing ఒక collective Farm. చిన్నమార్పు ఏమిటంటే కొన్ని వందల ఎకరాల పత్తి పొలాలు చూసేం. పత్తి పొలాలలో పండిన పత్తిని ఏ విధంగా ఏరాలో మాకు తెలీయజేసారు. ఒక పెద్ద గుడ్డ తాళ్లు కుట్టినవి నడిముకు మెడకు కట్టుకొంటే చిన్నసంచీలా తయారవుతుంది. దానిలోకి ఆ పత్తి ఏరాలి. మా అందరికీ ఆ గుడ్డలు కట్టేరు. ఒక పావుగంట మేమంతా పత్తి ఏరాం. అంతేకాదు ఆ గుడ్డలతో ఫోటో కూడా దిగేం పత్తి మూటలతో.
తర్వాత ఒక షాపింగ్ సెంటరుకి తీసుకొని వెళ్లేరు. అన్ని చోట్ల కనబడే
ఉజ్బెకిస్థాన్ సిల్కుదారాల గుడ్డలు, గిల్టు ఆభరాణాలు, చవకరకపు అనగా రష్యాలో
అంతకన్నా మంచివి దొరకవుట, అటువంటి cosmetics యివే. కొంతసేపు అక్కడ కాలక్షేపం చేసి మరో రెస్టారెంట్ లో భోజనం. రొట్టి,
పానీయాలు, కూరలు, పెరుగు అన్నీ యివే కావాలనుకొని భోజనం పూర్తిచేస్తే చిట్ట చివరకు
అన్నం తీసుకొని వచ్చేరు. తినే ఓపిక అప్పటికే పోయింది. ఎలాగో మా హోటేలుకి
చేరుకొన్నాం. రాత్రి భోజనం చేయవద్దనుకొని పడుక్కొన్నాం. 9 అయేసరికి మా ప్రతిజ్ఞ
చల్లగా నీళ్లు కార్చేసి బుద్ధిగా మళ్లా భోజనానికి సిద్ధమయేం. రాత్రి కావలసిన అన్నం
పెరుగు యింకేదో మసాలా అన్నం వీటితో ఏదో ఎంగిలి పడ్డాం.
26-9-87
ఈవాళా మామూలే. ఉదయం మరేవో collective
farmsకి తీసుకొని వెళ్లేరు. అక్కడ రివల్యూషన్ కి ముందు ఉన్న
వ్యవసాయ పనిముట్లు తరువాత వచ్చిన అభ్యదయం చూపించేరు. అక్కడ కోటు నిండా మెడల్సు
తగిలించుకొన్న ఒక ముసలతన్ని చూసేం. చాలా లావుగా అమాయకపు డాబుగా పెద్ద పెద్ద గొంతుకతో అక్కడి
విశేషాలు చెప్పేడు. అయితే ఆ ఉజ్బెక్ భాష నీనాకి తెలియదు. అతను చెప్పినవి మరొకాయన రష్యన్లో చెప్పే ఆ మాటలు నీనా మాకు ఇంగ్లీషులో చెప్పింది. తీరా మాకు బోధపడేది మేము చూసి
తెలుసుకొన్నదే. ఆ వృద్ధుడు వ్యవసాయాభివృద్ధిలో చాలా సాధించినందుకుట ఆ మెడల్సు.
చివర మాస్టరుగారు అతనికి ఫోటో తీస్తుంటే మహా గొప్ప ఫోజు యిచ్చేడు. ఎక్కడకి వెళ్లినా వందల కొద్దీ
ప్రజలూ, వాళ్ల ఉత్సాహం, వాళ్ల ఆదరం, ప్రేమ ప్రకటన. పళ్లు, పువ్వులు కుప్పలు,
తెప్పలు. ప్రతి చిన్నపిల్లవాడూ పూలగుత్తి అందిస్తాడు. లేకపోతే చొక్కాకి
తగిలించుకొనే ఏదో బిళ్లలు తగిలిస్తారు. లెనిన్ బొమ్మలో యింక యేవో – యివాళ ఒక
అమ్మాయి అలాంటిది నా చొక్కాకి తగిలించింది. తర్వాత మళ్లా ఏదో షాపింగ్. నేను ఏదీ
తీసుకోలేదు. అదీకాక డబ్బు తీసుకొని వెళ్లలేదు కూడా. తర్వాత ఏదో మంచి రెస్టరెంటులో
భోజనం. మొట్టమొదట పెట్టిన పదార్థాలు కాకుండా అలా తెస్తునే ఉంటారు. మాస్టరుగారు
ఆయనకి కావలసింది తిని లేచిపోయేరు. ఆయనతో సూర్యారావుగారు కూడా. తర్వాత వాళ్లు
తెలియజేసేరు యింకా రావలసినవి ఉన్నాయని. మాతో వస్తున్న రష్యనులు ఉన్నారు కదా. వాళ్ల
భోజనం కొంచెం నిదానం. అదికాక వాళ్లు మాలాగా చప్పిడి తిండి తినాలని ఎక్కడ ఉంది.
మాకు యిష్టపడదేమో అని వాళ్లు నలుగురు వేరే టేబిలు దగ్గర కూర్చుంటారు. ఈయన మానాన
ఈయన తినేసి లేచిపోయి ఒకంతట వాళ్లు రాలేదని కేకలు. మనం సాస్కృతిక రాయబారులుగా
వెళ్లినప్పుడు మన అలవాట్లకి వాళ్లు చాలా భరిస్తున్నట్టే వాళ్ల అలవాట్లను మనం
సర్దుకుపోవాలి. అందులోనూ బాధ్యత కలిగిన పార్టీ లీడరు హావభావ ప్రకటనలోను, సంభాషణలో
కొంత నిగ్రహం పాటించకపోతే, తన అనుయాయుల ఎడల క్రమశిక్షణతోబాటు సభ్యత పాటించకపోతే
సత్ఫలితాలు పొందలేం.
ఇక్కడ పాటలు పాడేవాళ్లలో ఒకాయన నిన్న హిందీ పాటలు బాగా పాడేడు. ముఖ్యంగా రాజకపూర్ సినిమా పాటలు యిక్కడ చాలా ప్రచారంలో ఉన్నాయి. రాజకపూర్ మీద వీళ్లకున్న మోజు ఏ భారతీయుడి ఎడలా లేదు. నిజానికి ఈ ప్రాంతంలో భారతీయ శాస్త్రీయ కళలకన్నా సినీమా సంగీతం ఎక్కువ ఆకర్షించింది. చాలా చోట్ల వాళ్ళ పాటలు డాన్సు అవుతుంటే మనవాళ్లనూ పాడమంటారు, ఆడమంటారు. అలాంటప్పుడు గోవిందరాజన్ వాళ్ల డప్పుమీద వాయిస్తూంటే కనకదుర్గ పాడుతారు. ఖర్మంచాలక అక్కడ వాద్యగాళ్లలో ఒకడు violin వాయిస్తున్నాడు. ఆ ఫిడేలు తీసుకొని M.S.Rao ని వాయించమన్నారు మాస్టరుగారు. ఆ వైలన్ ట్యూనింగ్ ఎలా ఉందో, అది ఈ కనకదుర్గ శృతికి వస్తుందో రాదో అని యితని బాధ. ఇతను వెళ్లలేదు. దాంతో ఆయనకి ఎవరూ co-operate చేయలేదని కోపం వచ్చింది. మొత్తం మీద తెలుసుకొన్నది, ఈ ప్రాంతం గురించి, ఏమిటంటే ఉజ్బెకిస్థాన్ రష్యా దక్షిణ రాష్ట్రం. ముఖ్యపట్టణం తాష్కెంట్. ఉజ్బెకిస్థాన్ లో చాలా regions ఉన్నాయి. వాటిలో Fergana Valley ఒకటి. అందులోదే యాండిజాన్ కూడా. ఇక్కడ పత్తి పంట, ద్రాక్ష, ఏపిల్, పియర్సు మొదలైన చాలా రకాల పళ్లు పండుతాయి.
ప్రజలు ఆరోగ్యంగా, మంచి రంగుతో ఉంటారు. మనుషులంతా మాంసలములుగా (పుష్టిగా) ఉంటారు. అయితే అందరూ అమాయకంగా
కనిపిస్తారు. మన పల్లెటూరు రైతు కూలీలకి మంచి బట్టలు, మంచి భోజనం ఉందనుకోండి వాళ్ల
హావభావ చేష్టలు యిలాగే ఉంటాయనిపించింది. అయితే దరిద్ర దేశంలో ఉండే వంచన, మోసం,
కపటంతో కూడిన తెలివితేటలు కలిగిన మొహాలు కనిపించవిక్కడ. ఆహారం, బట్ట సమృద్ధిగా ఉండి ఉన్నతమైన మానసిక స్థాయి
పొందవలసి ఉన్నట్టు అనిపిస్తారు. పసిపిల్లలలోని అమాయకత్వం, స్నేహధర్మం
కనిపిస్తుంది. మన దేశంలో కూడా తగిన తిండి, బట్ట సామాన్యుడు పొందగలగాలనీ,
అప్పటికిగాని వంచన, మోసం, అనుమానం వీటికి చెందిన తెలివి తేటలు పోవని అనిపిస్తుంది. మన
తెలివి, వ్యక్తిత్వం మన దరిద్రానికి సంబంధించినవే.
ఈ ప్రాంతం అంతా రష్యాలోని వ్యావసాయిక ప్రాంతం. పారిశ్రామిక ప్రాంతాలు
ముందుముందు చూస్తామనుకొంటాను. అయితే ఉజ్బెకిస్థాన్ మన భారతదేశానికి
సాంస్కృతికంగానూ, ఆవేశంగానూ
చాలా సన్నిహితమయినది. ఇక్కడి ప్రజలు అంతా మహ్మదీయులు, అంటే ప్రస్తుతం మతం లేని మహ్మదీయులు. మసీదుల స్థానంలో
మ్యూజియంలు, నమాజ్ లకి బదులు collective farms నిర్వహణ కనిపిస్తుంది. వేషభాషలు యింకా middle east కి చెందినవే.
చాలామంది గడ్డాలవాళ్లు కనిపిస్తారు. అంటే ముస్లిం గడ్డాలు. ఉమర్ ఖయం, సాకీ బొమ్మలు,
పానపాత్రల చిత్రాలు ప్రజల వేషభాషలలోనూ, డాన్సులలోను కనిపిస్తాయి. ప్రతి స్థలంలోనూ ఇండియాలో
మహాత్మాగాంధీకి గల గౌరవం యిక్కడ లెనిన్ కి ఉంది. అయితే వీళ్ల గౌరవంలో నటన లేదు.
గాంధీ పేరును కొంత మంది స్వార్ధానికి ఉపయోగించుకొంటున్న పరిస్థితి యిక్కడ లేదు.
కారణం లెనిన్ ఆశయాలు సామాన్యుడి హస్తగతం అయేయి. గాంధీ కన్న కలలు సామాన్యుడికి
యింకా అందలేదు.
రేపు యిక్కడనుంచి మరో ఊరు వెళ్లాలి. ఆ ఊరిపేరు జ్ఞాపకం లేదు. hill area ట. ప్రస్తుతం యాండిజాన్ శీతోష్ణం 26 డిగ్రీ లు. వెళ్లబోయే ఊరు 10 డిగ్రీల సెల్సియస్.
"Dobra utri" translates to "Доброе утро" (pronounced Dobroe utro) in Russian, meaning "Good morning" and is a common, versatile greeting suitable for both formal and informal settings. The phrase "Доброе" (Dobroe) translates to "kind," similar to the English concept of a "kind morning".
The Russian word Spasibo "спасибо" translates to "thank you" or "thanks" in English. It is the most common and versatile way to express gratitude in Russian and can be used in both formal and informal situations.
"Dasvidaniya" is a transliteration of the Russian phrase "do svidaniya" (До свидания), which means "goodbye" or "until we meet again". It is a polite and versatile farewell used in formal situations, similar to how "goodbye" is used in English.
.jpg)



