Saturday, November 1, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 8 - 01-10-1987

 

 

Click here for - రష్యా 7 - 29-09-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 
- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 8

1-10-87

నిన్నరాత్రి భోజనం చేయకుండా విశ్రాంతిగా పడుకొన్నాను. బాగా నిద్రపట్టింది. బాగా వేగం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానంచేసేం. ఉదయం 7.30కి breakfast, 8.15కి airportకి వెళ్లాలన్నారు. అనుకొన్నట్టుగా అన్నీ సక్రమంగానే అయేయి. బూటు వేసుకొంటే రెండుపాదాలకీ కాస్త చెక్కుకుపోయి నొప్పిచేసింది. తగ్గిపోయింది. కాని మళ్లా ఈరోజు flightలో వేసుకొందికి మళ్లా boots వేసుకొన్నాను. నడవడం సుఖంగా లేదు. తీరా Frunze వెళ్లేసరికి కుడిపాదం బొటనవేలు దగ్గర మళ్లీ పొక్కిపోయి చిన్నవాపు. Flighలో వస్తూంటే కిటికీలోంచి అనేక పర్వత పంక్తులు. ఇవన్నీ పామీరు పీఠభూమినుంచి అటు ఇటు వ్యాపించిన ప్రర్వతశ్రేణులు. కొండలన్నీ ఎత్తుగానే ఉన్నా రాయి పదార్థం కంటే మట్టి పదార్థమే ఎక్కువ అనిపిస్తుంది. చెట్లు చేమలు ఉండవు పర్వత సానువులలో మళ్లా వృక్షసంతతీ వ్యవసాయానికి అనుకూలమైన క్షేత్రాలు. ఇలాంటి దగ్గరే మొన్న మేము వెళ్లిన కిర్గీజియా వ్యవసాయ క్షేత్రం. ఈ ప్రాంతాలలో తిన్నగా సన్నంగా పెరిగే మన అశోక చెట్లవంటివి ఉన్నాయి. అయితే వాటి కొమ్మలు అశోక చెట్లలా కిందకి కాకుండా మీదకి ఉంటాయి.

 

 

కొన్ని సోగగా ఎత్తుగా ఉంటాయి. కొన్ని గుబురులుగా కూడా ఉంటాయి. ఈ చెట్లను Topel అని అంటారని Nina చెప్పింది. మన కుక్కలు, నక్కలు లా అక్కడక్కడ wild horses కనిపిస్తూంటాయి. గాడిద మీద స్వారీ చేయడం చూసేను యిక్కడ.

Frunze కిర్గియా ముఖ్యపట్నం. అన్ని పెద్ద పట్నాలలాగే ఉంది. అయితే airport నుంచి వస్తుంటే మన దేశంలో మద్రాసు airport నుంచి వస్తుంటే కనపడ్డట్టు చిన్న చిన్న యిళ్లు, బంగళా పెంకుల సాలలు ఇత్యాది కనిపిస్తాయి. తప్పుకాదు. మన దేశం కంటే ఎంతో సంపన్నమయిన ఈ దేశంలో కూడా యిలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయనే. అమెరికాలో యిలాంటి దృశ్యాలు కనపడవు. అతి బీద ప్రాంతం అని వాళ్లు చెప్పే ప్రాంతం కూడా మనకి అలా అనిపించదు.

నిన్న సాయంకాలం ఊసుపోక ఏదో షాపింగుకి తీసుకొని వెళ్లేరు. లైలా వేసుకొన్నలాంటి necklace తీసుకోవాలనీ నా కోరిక. అక్కడ దొరకలేదు. పోని నీనా వేసుకొన్నలాంటి స్కర్టు జాకెట్ లాంటివి శాలీకి తీసుకొందామన్నా దొరకలేదు. చూదాం, తొందరేమిటి. 15 రోజులు మాస్కోలో ఉండాలి. సూర్యారావుగారు మళ్లా వేడినీళ్లు మరిగించుకొనే plug తో కూడిన plastic తాడు తగిలించిన గ్లాసులు, చూడడానికి చిన్న flask లా ఉన్నది, 4.80 రూబుల్స్ ట, కొన్నారు. కొనిపించేరు. దాని ప్రాశస్త్యం వర్ణించేరు.  అవసరం విశదపరిచేరు. నాలో కదలిక పుట్టలేదు. మరేంలేదు, కాఫీ కోసం, వేడినీళ్ల కోసం ఒకటి ఉండనే ఉంది. మళ్లా ఒక గ్లాసు నీళ్లు వేడిక్కించడానకి మళ్లా ఎందుకూ, అదీకాక స్నానానికి నీళ్లు మరిగించుకొందికి వేరే పెద్దది కూడా ఉంది.

2-10-87

ఈవాళ రాత్రి 7.30కి యిక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో మా కార్యక్రమం ఉందిట. అయితే అక్కడ తగిన లైట్లు, మైకులు కావలసినవి ఉన్నట్టు లేదు. వేషాలు మేకప్పులు ఇక్కడనుంచే వేసుకొని వెళ్లాలిట. ఈ ఊళ్లో హోటేలు చాలా బాగుంది. మా గది విశాలంగా ఉంది. వేడినీళ్లు 24 గంటలూ వస్తున్నాయి. స్నానానికి పెద్ద టబ్బు. మనిషికి 3 తువ్వాళ్లు, 4 కుర్చీలు, టేబిలు, డ్రాయర్లు, అద్దాలు, బట్టలు తగిలించుకొనే hangers, బట్టలు ఆరవేసుకొందికి ఎండ తగిలే స్థలం, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. నేలమీద తివాసీలు. భోజనం ఏర్పాట్లు బాగున్నాయి. అన్నం వండడం వీళ్లకి తెలిసింది. అప్పుడే మద్రాసు వదిలి నెల అవుతూ ఉంది.

తాష్కెంట్ నుంచి ఆత్మీయులందరికీ కార్డులు రాసేను. అదీకాక మద్రాసు వెళుతున్న వాళ్ల ద్వారా మద్రాసులో పోస్టు చేయమని ఉత్తరం యిచ్చేను. అందే ఉండాలి అన్నీ. ఈవాళ గాంధీ జయింతి. అదీకాక విజయదశమి. సాయంకాలం 5 గంటలకి బయలుదేరి ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే దారిలో కనపడ్డ దృశ్యాలన్నీ ఎంతో పరిచితంగా కనపడ్డాయి. రోడ్డు విశాలంగా ఉంది. ఇళ్లు, చెట్లు, పొలాలు అవన్నీ చూస్తూ ఉంటే ఇండియాకి యెంతో దూరంలో ప్రస్తుతం ఉన్నామని జ్ఞాపకం చేసుకొంటే తప్పు అనుభవానికి మన పరిసరాలాలో ఉన్నట్టే అనిపించింది. దారిలో పొలాలు, పొలాలలో వేసిన గడ్డికుప్పలు కొన్ని గుండ్రంగా, మరికొన్ని ఓడకుప్పలని వేస్తారు పెద్దవి మన గ్రామాలలో, ఇవీ అలాగే కనిపించేయి. ముఖ్యంగా పల్లె ప్రాంతంలో ఇక్కడ యిళ్లు, వాకిళ్లూ అన్నీ మన పల్లె ప్రాంతాన్ని జ్ఞాపకం చేసేయి. కొన్ని ఆవుల మందలు. అయితే ఆవుల మందలు కాస్తున్నవాడు దొరటోపీ, టైటుప్యాంట్ వేసుకొని గుర్రంమీద వస్తూంటాడు. ఆవులన్నీదృఢంగా పెద్ద పొదుగులతో ఉన్నాయి. అలా వెళ్లి వెళ్లి మునసబుగారింటికో, కరణంగారింటికో వెళుతున్నట్టు అనిపించింది.  

ఆఖరికి సాముదాయక వ్యవసాయ క్షేత్రం సాంస్కృతిక భవనం చేరుకొన్నాం. వెంటనే toilet కి వెళ్లాలి కదా. ఆడా మగ తేడా లేదు కదా ఈ పనికి. ఇక్కడ అంటే రష్యాలో ఇంత వరకూ పెద్ద హోటేళ్లలో తప్ప toilets చాలా అన్యాయంగా ఇండియాతో పోటీ పడుతున్నాయి. Auditorium సంసార పక్షంగా అంటే రష్యా standardలో బాగానే ఉంది.  వచ్చిన రసికులు అంతా అమాయక ప్రజలు. అందరూ దృఢంగా చక్కటి సూట్లు వేసుకొన్నారు. ఒక ముగ్గురు కోటు నిండా మెడల్సు వేసుకొన్నారు. వాళ్లు రైతు ఘనాపాఠీలు అన్నమాట. మేం వచ్చిన దగ్గరనుంచీ స్కూలు పిల్లలు అలా నోట్లో వేలు వేసుకొని వింతగా చూస్తుండిపోయేరు. మరికొందరు మనవాళ్లు makeup వేసుకొంటూంటే కిటికీలు ఎక్కి లోపలకి చూడడం మొదలుపెట్టేరు. లోకం అంతా మానవ ప్రకృతి ఒకటే కదా. అందుచేత అమాయక ప్రజలంతా ఒకలాగే ఉంటారు. మా కార్యక్రమం వాళ్లకి నచ్చింది.

తిరిగి వచ్చిన తరవాత మా హోటేలులో రాత్రి భోజనం ఏర్పాటు చేసేరు. అయితే ఆ వ్యవాసాయ క్షేత్రంవాళ్లే వచ్చేటప్పుడు అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు. వాళ్లు కిర్గీస్ కారుట. మరేదో పేరు. జ్ఞాపకంలేదు. అయితే అలవాట్లు పోలికలు చైనీస్ లా ఉన్నారు. మా భోజనం బల్ల దగ్గర కూడా చైనావాళ్లు తినడానికి వాడే కర్ర పుల్లలు పెట్టేరు. మేం వాటిని ఉపయోగించలేదు. మన సంప్రదాయం మనకి ఉండనే ఉంది కదా. తిరిగి రాత్రి 12 గంటలకి హోటేలు చేరుకొన్నాం.