Saturday, December 13, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 14 - 16-10-1987

 


 

Click here for - రష్యా 13 - 13 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 14

16-0-87

పది గంటలకి యిక్కడికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద బజారుకి వెళ్లేం. ఆ బజారు ఒకే ఆవరణలో మూడు సింహద్వారాలు కలిగి ఉంది. అనేక రకాల వస్తువులు, బట్టలు, ఎలక్ట్రానిక్స్, కెమేరాలు, perfumes, చాలా రకాలు అనేక షాపులలో దొరుకుతాయి. ఎనిమిది అంతస్థులు. ఎవరు ఎక్కడికి వెళ్లినా 12.30 అయేసరికి మూడు ద్వారాలలో ఎక్కడయినా wait చేస్తూ ఉండాలి అనుకొన్నాం. ఏదైనా కొనాలి కదా. చిll చిట్టితల్లి సంగీతకి ఏదైనా బొమ్మ కొనాలి అనుకొన్నాను. పెద్దది కాకూడదు. తీసుకొనివెళ్లడానికి అనుకూలంగా ఉండాలి.

బొమ్మ కొన్నాను. ఆడపిల్ల బొమ్మ. తరవాత లేలా మెడలో ఉన్నలాటి గొలుసు కోసం చాలా ఊళ్లలో చాలా బజార్లలో చూసేను. దొరకలేదు ఇంతవరకు. ఇక్కడ సరీగా అలాంటిది దొరికింది. మొదట రెండు గొలుసులు తీసుకొన్నాను. ఒక గొలుసు 7.10 రూబుల్స్. రెండు చాలవని మరోటి తీసుకొన్నాను. తర్వాత ఏదో perfumes గోవిందరాజన్ కొంటూంటే, నేనూ కొన్నాను. మూడు సీసాలు 9 రూబుల్స్. తర్వాత ఏమి కొనాలి అన్నది తేలలేదు. ఏమి కొన్నా బరువు ఉండ కూడదు. చూదాం తాపీగా. ఇంకా ఉంటాం. మళ్లా 26 కి వస్తాం అని అనుకొన్నాను. అప్పటికే 12.15 అయింది. ఈలోగా bathroom అవసరం అయింది. Toilet ఎక్కడో తెలియలేదు. Gate దగ్గరకి వెళ్లేను. ఎవరూ యింకా రాలేదు. Toilet ఎక్కడా అని అడుగుతున్నాను ఎవరినో. ఇంతలో రత్తయ్యగారు వచ్చేరు. మరెవరో అమ్మాయి వచ్చేరు. నేను కొన్న గొలుసు వాళ్లకి నచ్చింది. రత్తయ్యగారు ఆ షాపు చూపించమన్నారు. నా toilet అవసరం ఆయనకి చెప్పేను. అదృష్టం. ఆ gate దగ్గరే ఉంది కిందుగా. సరే ఆ అవసరం తీర్చుకొని మొత్తానికి ఆ షాపు చూపించేను. తర్వాత ఆయనే కాదు వేలం వెర్రిగా ఆడపిల్లలు అందరూ కొన్నారు. నేను మళ్లా మరోటి కొన్నాను. మా పని అయిపోయింది. ఇంతలో మాస్టరుగారు, కమలారెడ్డి ఎక్కడికో వెళ్లి మేము తిరిగి వెళ్లిపోయే సమయానికి వచ్చేరు. సరే వాళ్లతో మళ్లా లోపలికి బయల్దేరారు పిల్లలు. నేనూ, రత్తయ్యగారు హరి హోటేలుకి వచ్చేశాం. తరవాత ఎవళమానానవాళ్లు వచ్చేరు. మొదట అనుకొన్నట్టుగా గేటు దగ్గర ఎవరూ నిలవలేదు. ఒకరికోసం ఒకరు ఎదురు చూడలేదు.

సరే. భోజన సమయం రెండు గంటలు దాటింది. అందరూ వచ్చేరు. ఐదుగురు ఆడపిల్లలు రాలేదు. మాస్టరుగారికి బ్లడ్ ప్రెషరు ఎక్కువయింది. వచ్చిన వాళ్ల మీద రాని వాళ్ల మీద వడగళ్లు ప్రారంభం అయింది. సూర్యారావుగారు, రాము తిరిగి పరిగెత్తేరు. రామరామ ఆడపిల్లలు అనుకొన్నట్టుగా ఆ గేటు దగ్గర ఏడుపు మొహాలు పెట్టుకొని కూర్చున్నారు. సరే వాళ్ల తప్పు ఏమిటో తెలియదు. అవన్నీ ఆయన ఆలోచించే స్థితిలో లేరు. ఏదో ఆందోళన, కోపం, యిష్టం వచ్చినట్టు తిట్లు. ఆ పిల్లలు తిండి కూడా తినలేకపోయేరు.

మధ్యాహ్నం, అంటే ఐదు గంటలకి బస్సు మీద మాస్కో నగరం అంతా చూపించేరు. ప్రధానమైన అన్ని స్థలాలు చూపించేరు. ఒకామె ఇంగ్లీషులో చారిత్రాత్మక సన్నివేశాలు, కట్టడాలు చాలా చక్కగా వివరించింది.

మాస్కో జనాభా తొమ్మిది మిలియన్లుట. మాస్కో నగరం విశాలంగానూ, గంభీరంగానూ ఉంది. క్రెమ్లిన్ ప్రదేశం అంతా Red Square. అంతా దిక్ భ్రమ గొల్పుతూ ఉంది. మేం ఉంటున్న రష్యా హోటేలు మాస్కా నడిబొడ్డున ఉంది. లెనిన్ భౌతికకాయాన్ని సందర్శించడానికి ఉదయం 10 గంటలనుంచి క్యూలో నిలబడతారు. అధమం 3 గంటలు క్యూలో ఉంటే ఆయన భౌతికకాయం దర్శించడం అవుతుంది. మా అందరికీ చూడాలనే ఆశ ఉంది. చలిలో 3 గంటలు నిలబడితే ఏమవుతుందో అని. మళ్లా మరో కార్యక్రమానికి అందుకోగలమా అని ఆ కార్యక్రమానికి యింతవరకూ ప్రయత్నం చేయలేదు. 26 న తిరిగి వచ్చేక యాత్ర పూర్తిచేదామని సంకల్పించి రాత్రి చక్కగా నిద్రపోయేం,

17-10-87

రాత్రి ట్రంక్ కాల్ వచ్చింది కమలారెడ్డికి. ఆ అమ్మాయి చివరి పరీక్షకి వెళ్లాలి అని, వెంటనే రమ్మని. ఆ అమ్మాయి ఈరోజు 3 గంటల flight లో ఢిల్లీ వెళుతూ ఉంది. సరే, మేం అందరం ఉత్తరాలు రాసి యిచ్చేం ఇండియాలో post చేయమని.

ఉదయం 11 గంటలకి ఒక గొప్ప మ్యూజియం* చూసేం. గ్రీకు శిల్పాలు, రోమన్ శిల్పాలు, సుప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలు చూసేం. అద్భుతం అనిపించింది. మైకేల్ ఏంజిలో రెంబ్రాంట్ సుప్రసిద్ధ చిత్రాలు. కొన్ని శిల్పాలు పాలరాతితో, కొన్ని కంచు లోహంతో చేసినవి. ఆ విగ్రాహాలు life size కి మూడు రెట్లు అయినా ఉంటాయి. కొన్ని శిల్పాలు కళాదృష్టితో చూడకుండా ఉంటే ఆడపిల్లలు మొహమాటపడేటట్టు ఉన్నాయి. స్త్రీల నగ్నశిల్పాల కన్నా పురుష శిల్పాలే ఎక్కువగా ఉన్నాయి. వర్తమాన చిత్రకారులు పికాసో మొదలైనవారి చిత్రాలు మూలరచనలు కూడా ఉన్నాయి. ఆ మ్యూజియం చూస్తున్నంతసేపూ మనం మాధ్యమిక యుగంలోనే ఉన్నాము అనే అనుభవం కలుగుతుంది. బాగుంది చాలా.   

PUSHKIN STATE MUSEUM

* The Pushkin State Museum of Fine Arts in Moscow is home to a significant collection of Greek and Roman sculptures, including both original works and casts of famous statues. While the museum houses original artworks from antiquity, it also features an extensive study collection of plaster casts of classical sculpture, which are displayed on the first floor alongside original Greek and Roman works on the ground floor. 

The Pushkin Museum in Moscow has an original painting by Rembrandt and a famous copy of a Michelangelo sculpture, but no original Michelangelo paintings. The majority of Michelangelo's and many of Rembrandt's key works are housed in other major world museums.