Click here for - రష్యా 9 - 03 -10-1987
5-10-1987
ఇవాళ breakfast తర్వాత పదకొండు గంటలకి sight seeing అని బయల్దేరేం. తీరా లెనిన్ మ్యూజియంకి వెళితే అది మూసేసి ఉంది. ఆఖరికి అక్కడి పార్క్ లో కొంతసేపు అటూ ఇటూ పచార్లు, కొన్ని ఫోటోలు తీసుకోవడాలు తర్వాత అక్కడనుంచి ఎక్కడికి వెళ్లడం అన్న విషయంలో వ్లాడిమరు ఏదో చెప్తే సరీ అని అనుకొన్నాం. మళ్లా నీనా ఏం చెయ్యడం అని అడిగీసరికి మాస్టారుగారికి కోపం వచ్చి తిన్నగా హోటేలుకి పోదాం అన్నారు. మళ్లా ఏదో రిహార్సలు చేయవలసి ఉందన్నారు. ఈ బాధలేమీ లేకుండా నాగరాజు, గోవిందరాజన్ ఈ వేళ రావడమే మానీశారు. ఏమంటే బట్టలు ఉతుక్కోవాలన్నారు.
ఈ సాయంత్రం ఐదు గంటలకి బయల్దేరాలిట. Makeupలు యిక్కడే హోటేలులో. కార్యక్రమం యిక్కడికి ముప్ఫై
కిలోమీటర్ల దూరంలోని సాముదాయక వ్యవసాయ క్షేత్రంలో. సాయంత్రం అయింది. కార్యక్రమం
రక్తిగానే వచ్చింది. చిన్న హాలు, చిన్న స్టేజీ. అయితే ప్రధానమైన విషయం కిర్గీజియా
సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మాతోటే ఉండి అన్ని ఏర్పాట్లు చేసేరు. అంతా మామూలే.
ప్రత్యేకంగా రాయడానికి లేదు.
6-10-1987
పది గంటలకి (కిర్గీజియా) సాంస్కృతిక శాఖ డైరెక్టరు వాళ్ల ఆఫీసు, అంటే, మొన్న చండాలిక వేసేమే అదే థియేటరు, ఆ భవనంలో ఈ auditorium రెండో అంతస్థులో ఉంది, అంతా మార్బులుతో కట్టారు, చాలా పెద్ద భవనంలో వీడ్కోలు కార్యక్రమం. సాంస్కృతిక శాఖా డైరెక్టరు గంభీరుడు, సరదా అయినవాడు, సహృదయుడు. మాకు ఆ భవనంలో ఉన్న వివిధ ప్రదేశాలు, వాటి ప్రాముఖ్యత వివరించేరు. ఒక ఆడిటోరియంలో మైక్స్ లేకుండా చక్కటి acoustics ఉన్న auditoriumకి తీసుకొని వెళ్లేరు. అక్కడ ఒకాయన ఒక ఎలక్ట్రిక్ ఆర్గన్ మీద కొన్ని రచనలు వాయించేరు. తరవాత మరో హాలులో టీ ఏర్పాటు. అదే సమయంలో డైరెక్టరు యథాలాపంగా అంటూ సీరియస్ గానే చెప్పేడు రష్యా, ఇండియా స్నేహ సంబంధాలు, వాటి ప్రత్యేకత. కళలు, కళాకారుల సాంఘిక బాధ్యత వీటి గురించి చక్కగా చెప్పేడు రష్యన్ భాషలో. నీనా చెప్పింది ఇంగ్లీషులో. చివర మా అందరికీ జ్ఞాపికలు యిచ్చేరు. మాస్టరుగారికి చదరంగ బలం, ఆడపిల్లలకి మంచి రంగుల రుమాళ్లు పెద్దవి, మిగిలిన వాళ్లకి కిర్గీజియాలో చేసిన జాతీయ దుస్తులతో ఉన్న కర్ర బొమ్మలు యిచ్చేరు.
కిర్గీజియా చీనా సరిహద్దులలో ఉంది. ఈ సాంస్కృతిక డైరెక్టరు యిచ్చిన వీడ్కోలు ఉపన్యాసంలో ఏదో రాజకీయపు వాసన వచ్చింది. ట్రైన్ బయల్దేరినప్పుడు చెప్పిన మాటలు కాస్త కవిత్వంగా ఉన్నాయి. మానవుల మధ్య యోగ వియోగాలగురించి కాస్త ఆర్ద్రంగా మాట్లాడేడు.
సాయంత్రం నాలుగు గంటలకి బయల్దేరేం. జంబుల్ (Dzhambul)* అనే పట్టణానికి ట్రైను మీద. ట్రైను బాగానే ఉంది. Toilet ట్రైనులో కూడా అధ్వాన్నంగానే ఉంది. Frunze నుంచి జంబుల్ వెళ్లడానికి రాత్రి ఒంటిగంట అనుకొన్నాం. కాదు, రాత్రి 10.30కి చేరుకొన్నాం. హోటేలులో ప్రవేశించాం. సంసారపక్షంగా అన్ని సదుపాయాలతో ఉంది మా గది. ఉదయాన్ని నూతన గృహంలో పాలు పొంగించి కాఫీ తాగేం. 7.10కి breakfast కూడా అయింది. శ్రీ హరిప్రసాద్ చౌరాసియా మళ్లా ఇక్కడ కలిసేరు. Breakfast సమయంలో ఆయన పరివారంతో ఉన్నాడు అక్కడ.
ఈ సాయంత్రం ఏదో collective farmలో ప్రోగ్రాం. యిక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంట. నగర
పర్యవేక్షణకి వెళ్లాం. ఈ ఊళ్లో ఉదయం అంటే పగలు కూడా చలిగానే ఉంది. ఊరికి కొంత
దూరంలో ఒక 12వ శతాబ్ది సమాధి అంటే మసీదు అంత ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో దాని మీద
విమానం పడి కొంత శిధిలమయింది. ఈ శిధిలాలను కాపాడుతూ దాని చట్టూ గాజు గోడలు ఏర్పాటు
చేసి యాత్రికులకు దర్శనయోగ్యంగా చేసేరు. ఆ సమాధి – ప్రియురాలు పాము కాటుతో
మరణించింది. ప్రియుడు ఆమె స్మృతి చిహ్నంగా కట్టించేడట. *
తర్వాత ఏదో మ్యూజియం సందర్శనం. అన్ని మ్యూజియంలు ఒకటే. మానవ చరిత్రలో పరిణామం అన్ని ప్రాంతాలలోను ఒకే విధంగా వచ్చినట్టు అనిపిస్తుంది, ఏ మ్యూజియం చూసినా. తర్వాత ఒక, మన సంతలాంటి, బజారు. అంటే, మార్కెట్ లాంటిది. పళ్లు, కూరగాయలు, జోళ్లు, రెడీమేడ్ బట్టలు ప్లాట్ ఫారం మీద అమ్మినట్టు, కిస్ మిస్, లవంగాలు, ఈ రకపు మసాలా సామాను, ఇవన్నీ అమ్ముతున్నారు. కాలక్షేపానికి నేను అక్రూట్ పప్పు కొన్నాను. చాలామంది మనవాళ్లు కూడా కొన్నారు. ఒక గాజుగ్లాసు 1.50 రూబుల్సు. తర్వాత మరో మ్యూజియం చూసి యిక ఓపిక లేక బుద్ధిగా హోటేలుకి వచ్చేశాం.
సాయంత్రం నాలుగు గంటలకి బస్సుమీద ఒక వ్యవసాయ క్షేత్రంా ఆడిటోరియంకి తీసుకొని వెళ్లేరు. స్టేజీ, హాలు బాగున్నాయి. మన ప్రదర్శనకి అనుకూలమయిన లైట్లు, spotlights యిత్యాదులు లేవు. దానికోసం ప్రయత్నం. చివరికి ఎలాగైతేనేం ఒక రెండు spots తెచ్చేరు.
మరో విశేషం ఏమిటంటే మళ్లా ఈరోజున మా ప్రోగ్రాం ముందు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా కచేరీ. చౌరసియా, ఆయన కొడుకు పక్క వాద్యం, ఒకాయన తబలా, మరో యిద్దరు భక్తులు తంబురా. మొత్తం ఒక ముప్పావుగంట ఆయన కచేరీ. మొత్తం ఒక ముప్పావు గంట ఆయన కచేరీ. ప్రధానంగా మన హంసధ్వని ఆలాపన. దానిలో flute పద్ధతిలో తానం అనుకోవచ్చును. తరవాత మన ‘వాతాపి’ పల్లవి ఆధారంగా మనోధర్మంగా రాగ, స్వరసంచారములు. మంచి నాదం, పట్టువిరుపులు, రసదృష్టి, భావుకత, లోకజ్ఞత అన్నీ ఉన్నాయి ఆయనలో. ప్రధాన శ్రోతలం మేమే. తర్వాత మిశ్ర ఖమాస్ లో ఏదో భజన్ అనుకొంటాను, మన్నాడే కూడా పాడాడు, ఆపాటరికార్డ్. కచేరీ బాగుంది. ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం విని ఆనందించాలంటే రాగభావం తెలియాలి. ఆ రాగస్వరూపాన్ని అందివ్వడంలో ఆ ప్రత్యేక కళాకారుని ప్రతిభ గ్రహించడానికి తులనాత్మక పరిశీలన కావాలి. ఇవన్నీ ఉజ్బెకిస్థాన్ లోనూ, కజక్ స్థాన్ లోనూ ఎలా కుదురుతాయి. అయితే ఒకటి, పసిపిల్లలు జోలపాట ఆనందించినట్టు సుశ్రావ్యమయిన మురళీనాదం చక్కటి తబలా అనుసరణ ఆనందిచబడతాయి.
తర్వాత మా కార్యక్రమం ప్రోత్సాహకరంగా నడిచింది. చాలామంది ప్రేక్షకులు, కళాకారులకి పుష్పగుచ్ఛాలందించేరు. ఈ జంబుల్ తో రుణానుబంధం ఈరోజుతో సరి.
* జంబుల్ (Dzhambul) కజకిస్థాన్ లోఉన్న 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పురాతన నగరం. తరాజ్ పేరుతో నిర్మించబడిన ఈ నగరం అనేక పేర్లు మార్చుకొని 1993లో తిరిగి Taraz అనే పేరుతోనే ఇప్పుడు పిలువబడుతోంది. https://central-asia.guide/kazakhstan/destinations-kz/taraz/
* Aisha bibi Mouseleum
Aisha Bibi Mausoleum is an exquisite architectural gem located in Taraz, Kazakhstan, and attributed with romantic legends. The mausoleum was constructed in the 11th or 12th century and is dedicated to a young woman named Aisha, the beloved of Karakhan, a local ruler. According to lore, Aisha died after being bitten by a snake, and the mausoleum was built as a monument to their love. Its facade is adorned with intricately carved terracotta tiles, featuring floral and geometric designs that showcase the sophistication of Karakhanid-era architecture. It has been preserved over the centuries and stands as an important cultural and historical heritage site. Enclosed by a small park, it offers a serene atmosphere for visitors. This monument is also significant for its contribution to Islamic architecture in Central Asia and is a revered place for locals and tourists alike. It was listed as a UNESCO World Heritage Tentative list since 1996 reflecting its importance. Its preservation and restoration efforts continue to maintain its historical integrity and beauty.
.jpg)

