Saturday, April 11, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - అమెరికా - 12

 

 Click here for - అమెరికా 11

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 12

7-4-86

మర్నాడు ఉదయం లండన్ airport లో దిగేం. అక్కడ ఒక గంట తర్వాత విమానం బయలుదేరుతుంది. లండన్ airport మాకు బాగా పరిచయమే. నేను యింకా మగవాళ్లు ఉపయోగించే perfumes కొందామనుకొన్నాను. చాలా ఖరీదుగా ఉండడంచేత కొనలేదు. Fight లో Dunhill సిగరెట్లు మాత్రం కొన్నాను ఎవరికైనా యివ్వడానికి.

మనస్సులో ఆరాటం. మేము కొన్న వస్తువుల మీద duty ఎంత వేస్తాడో అని. అదృష్టం, ఏ బాధాలేకుండా బయటపడ్డాం.

ఢిల్లీ 8 తేదీ రాత్రి 11 గంటలకి చేరుకొన్నాం. మమ్మల్ని receive చేసుకొందికి ICCR ఉద్యోగి ఎవరూ రాలేదు. ఆఖరు సామానంతా ఒక van లోకి ఎక్కించిన తర్వాత ఆయన వచ్చేడు. సవ్యంగా మళ్లా అశోక యాత్రి నివాస్ చేరుకొన్నాం. 9 తారీఖు అంతా ఢిల్లీలో గడిచింది.

9-4-86

9 తేదీ ఏప్రిల్, ఢిల్లీలో చాలా వేడిగా ఉంది. అశోకా యాత్రి నివాస్ కి దగ్గరగా ఒక South Indian భౌజన ఫలహారాలు దొరికే ఒక హోటేలు ఉంది. చుట్టూ పక్కల పనిచేసే దక్షిణాది ఉద్యోగులు అక్కడే ఆకలి తీర్చుకొంటారు. పదార్ధాలు రుచిగా, శుచిగా ఉంటాయి నిరాడంబరంగా. ఏది తీసుకొన్నా 1.50. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం అక్కడే. అయితే యింకా తినలానే అనిపిస్తుంది. రాత్రి 7.30కి ఆ హోటేలు మూసేస్తారు. ఆ సంగతి జ్ఞపకం లేక 8 గంటలకి బయలుదేరి తిండికోసం తిరిగి తిరిగి చివరకి కన్నాట్ ప్లేస్ లో ఒక సామాన్య హోటేలులో ఆకలి తీర్చుకొన్నాం. అయితే వాడు యిచ్చిన అన్నం, పెరుగు, రొట్టి, వాటి ఆధరవులకి నలుగురికి 65 రూపాయాలు యిచ్చేం. ఢిల్లీలో మా అఫిషియల్ passports తిరిగి యివ్వడం అయింది. మొదట మా దస్తుల విషయంలో యివ్వవలసిన 500 రూపాయలు చెక్కు రూపంగా యిచ్చేరు.

10-4-86

మర్నాడు 10 తేదీ ఉదయం 6 గంటలకి flight. మేము 3 గంటలకి నిద్రలేచి బయలుదేరేం. యాత్రీ నివాస్ లో మేము 18 అంతస్థులో ఉన్నాం. అక్కడ lift ఒకంతట రాదు. అందుకు. Flight లో మళ్లా నా వీణ పెట్టుకోడానికి ఏం చిక్కో అని ఆరాటం. అదృష్టం, నా పక్క సీటు ఖాళీగా ఉంది. Airhostess చాలా గౌరంగా ఆ సీటులో నా వీణ పెట్టుకోమంది. ఎంత మనశ్శాంతి. హైదరాబాదులో ఒక అరగంట విమానం ఆగుతుంది. శ్రీ శంకరరెడ్డిగారు వస్తారని, డాలర్లు అక్కడే యివ్వాలని అన్నారు మస్టారుగారు. కాని ఆయన రాలేదు. అంతేకాదు, విమానంలోవారు బయటకి, బయటవారు transit లోకలియడానికి వీలులేదన్నారు. ఆ రోజు Indian Airlines వారు యిచ్చిన ఫలహారం, పానీయాలు చాలా సంతృప్తిగాను, సుఖంగాను ఉన్నాయి. అనుకొన్న సమయానికి మద్రాసు చేరుకొన్నాం. Airport కి కూచిపూడి ఆర్ట్ ఎకాడమి మిత్రులు వచ్చేరు. చక్కటి ఏర్పాట్లు చేసేరు. సుఖంగా యిళ్లకి చేరేం.

అయితే ఒక్క విషయం – ఈ పర్యటనలో ఎంతో మందిని కలిసేం. వాళ్ల అందరి పేర్లూ రాయలేదు. అంతేకాదు, జ్ఞాపకం లేవు. కారణం, వాళ్లందరికీ పార్ట్ నాయకునితోటే ఎక్కువ సంబంధం. వాళ్లు మాకు అందరికీ సమానమైన సౌకర్యాలు కలిగించినా, హోటేలులో supplier కి యితరులకి ఉన్న సంబంధంలాటిది. అయితే కొంతమంది అందరికీ చాలా దగ్గరగా వస్తారు. అలాంటి వ్యక్తుల పేర్లను మరవలేదనే అనుకొంటున్నాను.


(p.s.: మా దగ్గర ఉన్న డాలర్లు మాస్టారుగారు తనకి యిమ్మని శంకరరెడ్డిగారి ద్వారా తాను మారుస్తానని మొదటినుంచి అడుగుతున్నారు. మద్రాసు వచ్చేక మాస్టారుగారికి నా దగ్గర ఉన్న 946 డాలర్లు యిచ్చేను. 15న వాటికి రావలసిన రూపాయలు మాస్టారుగారు హైదరబాదు వెళ్లి తీసుకొని రావలసి ఉంది. ఆయన 15 మధ్యాహ్నం హైదరాబాదు వెళతారు.)