Saturday, December 27, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 16 - 19 -10 -1987

 

 Click here for - రష్యా 15 - 18 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 
రష్యా - 16
19-10-87

మేం మొదట చూసిన పెద్ద సూపరు మార్కెట్ పేరుగుమ్’.


The GUM facade faces Red Square


మరో చుగ్’* అనే మార్కెట్ ఉందనీ, అక్కడ మంచి రకాల వస్తువులు దొరుకుతాయని ఆశ పెట్టేరు. ఆఖరికి ఈరోజు ఉదయం అక్కడికి వెళ్లేం. ఉన్నాయి అన్నిరకాల fancy సామానులు. అయితే గుంపులు గుంపులుగా జనం. ఎక్కడా శాంతంగా కావలసిన వస్తువులు కొనబడదు. ఒంటరిగా వెళితే దారి తప్పిపోతామేమో అనే భయం. ఏవో రెండు వాచీలు కొన్నాను. తాళం చెవి ఆకారంలో ఉన్నాయి.

రాత్రి పదకొండు గంటలకి మాస్కో నుంచి బయలుదేరి ట్రెయిన్ లో Smolensk#స్మొలెన్స్క్ – అనే ఊరు వచ్చేం. ట్రెయిన్ లో నిద్రపోయేం. ఉదయం 6.50కి ఈ ఊరు చేరేం. హోటేలు బాగుంది. గదులు బాగున్నాయి. వేడినీరు వస్తూంది. మంచాలు, పక్కలు కొత్తగా ఉన్నాయి. 12 గంటలకి sight seeing అన్నారు. ఓపిక లేక వెళ్లలేదు. ఈ ఊరు రష్యా ప్రాచీన నగరాలలో ఒకటిట. ఏదో పాత కోట ఒకటి, ఒక పాత కెథిడ్రల్ ఉన్నాయిట. ఊరు పశ్చిమ యూరపు పద్ధతిలో ఉన్నాయిట. ఊరునిండా చెట్లు ఎక్కువ. ఊరు మరీ చిన్నది ఏమీ కాదు. ట్రాంలు, బస్సులు కూడా ఉన్నాయి. మంచి marketing places కూడా ఉన్నాయిట. రెండవ ప్రపంచ సంగ్రామంలో చెప్పుకోవలసిన ఊరుట.

21-10-87

ఎక్కడికో వెళ్లాలన్నారు. వెళ్లడం ఏమీ జరగలేదు. సాయంత్రం ప్రోగ్రాం ఉంది. హాలు మరీ చిన్నదేం కాదు. Lighting ఏర్పాటు బాగానే ఉంది. అయితే నృత్యనాటకం వేయడానికి కమలారెడ్డి హైదరాబాదు వెళ్లిపోయింది కదా, ఇహ వేస్తే చండాలిక వేయాలి. ఆఖరికి items చేదామన్నారు.

చౌరాసియా శిష్యులు వాయించేరు మొదట. శ్లోతలలో పెద్ద కదలిక లేదు. తర్వాత నాట్యకార్యక్రమం. ఉన్న మైకులు మూడే. అయినా యిటీవల ఏ ప్రోగ్రామూ యింతగా రక్తి కట్టలేదు. ముఖ్యంగా సంగీతం బాగా వినపడిందన్నారు.

22-10-87

ఈవాళా, 24నా దీపావళీ? అని చర్చ. ఆఖరికి 24 అనే అనుకొన్నాం. Breakfast కి నాగరాజు రాలేదు. ఏమంటే, రాత్రి అతనికి ఏదో గాభరాగా ఉందిట. చెమటలు పట్టేసాయిట. కొంపదీసి heart attack ఏమో అని భార్యకి ఉత్తరం రాసిపెట్టి చక్కగా flute వాయిస్తూ కూర్చున్నాడు తెల్లార్లూ. మొత్తానికి అదంతా gastric చమత్కారం అని చప్పరించేశారు అంతా. సూర్యారావుగారు బయటికి వెళ్లేరు. వచ్చినరోజునే తిన్నగా ఉండలేక ఒక ఎలక్ట్రిక్ ప్లాస్టిక్ పాత్ర కొన్నారు. 4 రూబుల్సుకి. అయితే అది ఎందుకు పనికివస్తుందో తెలియదు. దానిమీద చిన్నపిల్లల పాలబుడ్డి బొమ్మ ఉంది. పాలుకాచుకొందికి బాగుంటుందని అనుకొన్నారు. తీరా యింటి దగ్గర చూస్తే దానిలో వేసిన పాలు కాని నీరు కాని ఏదీ వేడెక్కలేదు. వెచ్చగా మాత్రం ఉంది. ఆఖరికి అనుకొన్నదేమిటంటే పసిపిల్లలకి పాలుపడుతూ మధ్య విరామంలో పాలు చల్లారిపోకుండా వెచ్చగా ఉంచడానికి మాత్రం పనికివస్తుందని అనుకొన్నారు. ఆఖరికి ఈరోజున దానిని return చేసి మరేదైనా వస్తువు తీసుకొందామని వెళ్లేరు. వాళ్లు తిరిగి తీసుకొంటే మంచిదే. లేకపోతే బారిస్టరు పార్వతీశం hat లా ఎలా వదుల్చుకోవాలో తెలియక బాధపడాలి. ఆయన ఇలాంటి సందర్భాలలో sportive గానే ఉంటారు.

మొదట ఫెర్గానాలో ఒక కాఫీ percolator కొన్నారు. ఆయనని చూసి మేమంతా కొన్నాం. ఈ మధ్య నూకుస్ లో కాబోలు నీళ్లు మరిగించుకొనే పాత్రలో డికాక్షన్ వడగట్టే కన్నాలగిన్నె దాని కాడ మరిచిపోయేరు ఎక్కడో. ఈ ఊళ్లో మళ్లీ మరొకటి కొని ఈ పాతది ఎలా వదుల్చుకోవాలో తెలియక దానిని మోయడానికి స్థలంలేక నాకు బహుమతిగా యిస్తానన్నారు, మా యిద్దరి ఈ రెండు నెలల సఖ్యతకి జ్ఞాపక చిహ్నంగా. ఆఖరికి నేను ఉచితంగా తీసుకొనడం యిష్టం లేక 3 రూబుల్సు యిచ్చి తీసుకొన్నాను.

ఈరోజు యిక్కడికి 40 కిలోమీటర్ల దూరం ఉన్న ఊళ్లోట మా కార్యక్రమం. రాత్రి 8.30 అంటున్నారు. ఒక సంగతి రాదామని మర్చిపోతున్నాను. తాష్కెంట్ లోనూ యింకా చాలా ప్రాంతాలలో మేము సంచారం చేసిన స్థలాలో చాలా ఆలస్యంగా తెల్లవారడం చాలా ఆలస్యంగా చీకటిపడడం ఉండేది కాదా, క్రమంగా ఎప్పుడు మళ్లా మారిందో గమనించలేదు. మాస్కో వెళ్లిన దగ్గరనుంచి మళ్లా మామూలుగా యిండియాలోలాగే ఉదయం, సాయంత్రం 6 గంటలకే సూర్యోదయం, సూర్యాస్తమయం అటూ, ఇటూ అరగంట తేడాగా అవుతూ ఉంది. న్యాయంగా 5 గంటలకి బయలుదేరాలన్నారు. తీరా బయలుదేరితే యింకా టైము ఉంది, 6 గంటలకి అన్నారు. ఊసుపోక, కాలక్షేపానికి రాస్తున్నాను. సూర్యారావుగారూ రాస్తున్నారు. ఆయన రాతకి కొంత సాంఘిక ప్రయోజనం కొంత సామాజిక స్పృహ ఉంది. ఆంధ్రజ్యోతిలో ప్రకటించే ఒప్పందం ఉందిట. ప్రస్తుతం 5.35 అయింది. సూర్యాస్తమయం అయింది. చీకటి పడుతూ ఉంది.

*"Chizhik" in Moscow refers to a hard discount supermarket chain, part of the X5 Group, known for its low prices and limited selection of products, typically featuring one well-known brand and one in-house or second-tier brand for each item. The stores are designed with a one-way path, similar to a path through an IKEA store, and operate with a limited number of employees to keep costs down. "Chizhik" can also refer to the "Chizhik-II," a three-decker vessel for events on the Moscow River, or the "Chizhik-Pyzhik" statue and folk song, which is a popular attraction in St. Petersburg.