Saturday, March 21, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - అమెరికా - 9

 

 Click here for - అమెరికా 8

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 9

3-4-86

ఉదయం 11.40. ఇంత వరకూ ఏ విశేషం లేదు. టిఫిన్, కాఫీ అయేక యింత వరకు వీణ వాయిస్తూ కూర్చున్నాను.

మార్తా మమ్మల్నందరినీ సముద్ర స్నానికి తీసుకొని వెళతానంది. ఎవరకీ సముద్ర స్నానంచేసే ఉత్సాహం లేదు. మార్తాకి, జానెట్ కి సముద్రస్నానం చేయకపోతే హవాయ్ వచ్చి ప్రయోజనమేమిటి అన్నట్టుంది. కాశీ వెళ్లి గంగాస్నానం చేయకపోతే మనకి ఎలా ఉంటుంది అలాగే వాళ్లకీ ఉంది అనుకొంటాను. అధమం మోకాళ్ల వరకేనా సముద్రంలో దిగమని అడుగుతూ ఉంది మార్తా.

ఏదో సందర్భంలో తన వయసు 54 అంది. తరవాత నాకంటే మూడేళ్లు మాత్రం చిన్న అంది. కానీ కాదు. భారతదేశం, అక్కడి ప్రజలు, అక్కడ జీవితం, అక్కడ పురాణాలు అన్నిటితో బాగా సంబంధమూ, భారతీయత యడల ఆకర్షణ, సానుభూతి ఉంది ఆమెకు. ఏదో మాటలలో మీరు మీ దేవతల అందచందాలు వర్ణిస్తారు. మా దేవతలను మేము ఎప్పుడూ యిద యివ్వు, అది యివ్వు అని అడుగుతాం. అంతేకాదు మా చర్చి వాతావరణం అంతా దుఃఖమయంగానూ. మృత్యువుతో సంబంధించి ఉంటుందని అంది. ఏమైనా క్రయిస్తవం ప్రేమను, అహింసను ప్రచారం చేసింది కదా అన్నాను నేను.

యిప్పుడు బహుశః సముద్రస్నానికి వెళతామేమో!

వెళ్లేము.

మొదట హవాయిన్ వస్తువులు, ముత్యాల దండలు, పగడాల దండలు, 14 కారట్ల బంగారపు వస్తువులు, హవాయిన్ చెప్పులు, T షర్టులు మొదలైన షావులు చుసేం. ఏవి కొనడానికి చాలా ఖరీదు. నాలుగు రోజులలో మన దేశానికి వెళ్లబోతూ ఉన్నవాళ్లకి డాలర్లలో వస్తువులు బేరము చేయలనిపించదు. ఏమీ లేదు, మన దేశంలో పది రూపాయలకి వచ్చే వస్తువు యిక్కడ పది డాలర్లు యివ్వవలసి వస్తుంది. ఎలక్ట్రానికి వస్తువులు అయితే దాని విలువ యిండియాలానే ఉంటుంది. అదీకాక హొనాలూలూ tourist ప్రదేశం అవడం చేత అమెరికాలో కన్నా యిక్కడ ఎక్కువ ధర. అందుచేత అలా చూసేం అంతే.

మరో చిత్రం, ముత్యపు చిప్పలలోంచి ముత్యాలు కొనుక్కోవడం చూసేం. ఒక ముత్యపు చిప్ప 5 డాలర్లు. అదృష్టం ఉంటే ఒక ముత్యపు చిప్పలో రెడు ముత్యాలు ఉండవచ్చును. ముత్యపు చిప్పలోంచి ముత్యాలు వస్తాయన్నది ప్రత్యక్షంగా చూసేం. తరవాత సముద్రపు ఒడ్డున కొన్ని వేలమంది ఆడమగ నామమాత్రపు ఆచ్ఛాదనతో ధరించి బీచిలో పడుకొన్నారు. ఆతప స్నానానికి కొత్తగా మన దేశస్థులు  చూస్తే సిగ్గుతో చచ్చిపోతారన్నమాట. కానీ గొప్ప దృశ్యం. ఎంత అందమైన శరీరాలు, ఎందుకు సిగ్గు?

తరవాత పసిఫిక్ సముద్రంలో షికారు చేసేం. చాలా బాగుంది. మాతో చాలా మంది విదేశీయులు విదేశీయ యువతీయువకులు శరీర సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ నిర్లిప్తంగా, సంతోషంగా ఉన్నారు. హవాయిన్ మర్యాదగా ఒకడు మా మెడలో రంగురంగుల దండలు వేసి ఫోటోలు తీసి, మేం తిరిగి వచ్చేసరికి ఫోటోలు సిద్ధంచేసి డాలరుకి మూడు ఫోటోలు కాపీలు అమ్మేడు. ఒక ఫోటో నాకూ యిచ్చేరు.



ప్రస్తుతం యిక్కడి కాలమానం – 3-4-86 సాయంకాలం ఏడుగంటల 43 నిమిషాలు. 8 గంటలకి పోర్టులాండు వెళ్లడానికి బయలుదేరుతాం. రేపు ఉదయం ఎనిమిదిన్నరకి అక్కడకి చేరతాం. బహుశః ఇక్కడి flight 11 గంటలకి. మధ్యలో Los Angeles లో మళ్లీ మారాలనుకొంటాను flight.