Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 9
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను.
బుడాపెస్ట్
5 -5-89
ఉదయం సక్రమంగా 8 గంటలకి బయలుదేరేం. బుడాపెస్ట్ దారిలో borders దగ్గర మా passports తనిఖీ జరిగింది. అక్కడికి దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో బుడాపెస్ట్. 11 గంటలకి బుడాపెస్ట్ చేరుకొన్నాం. కాలమానం జెకొస్లోవేకియా, హంగేరీ ఒక్కలాగే ఉంది. బుడాపెస్ట్ లో మాకు గదులు ఏర్పాటు చేయబడిన హోటేలు ముందు బస్సు ఆగింది. ఇక్కడ సామానులు గదిలో పెట్టే porters లేరు. మేమే హోటేలు రిసెప్షన్ దాకా తెచ్చుకొన్నాం. అయితే ఇండియన్ రాయబార కార్యాలయం నుంచి గాని హంగేరీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి గానీ ఎవరూ మాకు స్వాగతం చెప్పలేదు. తర్వాత తెలిసింది మేము జకొస్లోవేకియా Bratislava నుంచి విమానంలో వస్తామని ఆ విమానం మధ్యాహ్నం 2 గంటలకి వస్తుందని వాళ్లు రాలేదుట. ఏదో జరిగింది పొరపాటు. మాతో అంపకం పెట్టడానికి వచ్చినది మార్తా, లోచికా, డ్రయివరు – ఈ డ్రయివరు ఆ యిద్దరు ఆడవాళ్లకి సలహా, సహాయం చేస్తూ పెద్ద మనిషి తరహాగానే ఉంటూ వచ్చేడు. బస్సులో వాళ్ల భాషలో ఆ ఆడవాళ్లతో ఏవో ఎడతెగని కబుర్లు చెప్పేవాడు. అతడు నిండైన మనిషి. చిరునవ్వు. సహాయపడే లక్షణం. యివీ.
ఆ ముగ్గురూ మమ్మల్ని గదులలోకి సాగనంపే వరకూ ఉన్నారు. అయితే వాళ్లు తిరిగి పోడానికి బస్సు ఉంది, కానీ భోజనం మాతోటో చేసి వెళ్లాలంటే హంగేరీ డబ్బు లేదే. మాస్టారు ఏమైనా వాళ్లని మాతోటే భోజనం చేయాలనీ, అవసరం అయితే అమెరికన్ డాలర్లు ఉన్నాయని, ఫరవాలేదని అన్నారు. ఈ మాటలకి మార్తా కన్నీళ్లు పెట్టుకొంది. ఇలాంటి సందర్భాలలో మాస్టరుగారు అసాధారణమైన ఔదార్యం చూపించడం ఉంది. తర్వాత మా భోజనం సమయంలో Indian Embassy నుంచి మనుషులు వచ్చేరు. కార్యక్రమం వివరించేరు. మార్తా, లోచికా, డ్రయివరు వెళ్లిపోయారు.
రాత్రి యిండియా రాయబార కార్యాలయంలో
డిన్నరు. రాయబారి పేరు శ్రీవాత్సవ. కుర్రవాడే. స్పష్టంగా, హితవుగా మాట్లాడేడు. మీర
హోటెలులో comfortable గా ఉన్నారా అని అడిగేడు. అతను అన్నది ఈయన వినిపించుకొంటేనా... వెంటనే no అన్నారు. అతను బిత్తరపోయేడు. వెంటనే మాస్టరుగారిని మేలుకొలిపేరు
అమ్మాయిలు. తర్వాత ఏదో సర్దుకొన్నారు. ఇక్కడ రాయబారికి ఉండే ప్రాధాన్యం ఎటువంటిదో
తెలియదు. ఎవరో హంగేరీ దేశస్థులు భార్యలతో వచ్చేరు. ఒకామె, మరియా అని, ఆమె అక్కడ
యూనివర్సిటీలో హిందీ చెపుదింట. సంస్కృత శాఖ కూడా ఉందిట. ఆమె సంస్కృతం కూడా
చదువుకొన్నా ప్రస్తుతం మరొక హంగేరీ సంస్కృత పండితుడు ఆ శాఖ తీసుకొన్నాడుట.
మేము మొదట రాగానే భారతీయ సంప్రదాయం ప్రకారం జోళ్లు విప్పి ప్రవేశించేం. మాస్టరుగారి అడుగుజాడలలో తర్వాత తర్వాత క్రమంగా వచ్చేరు అందరూ. వాళ్లంతా అభిరుచిని బట్టి విస్కీ, వైను తీసుకొన్నారు. మేము భారతీయ సంప్రదాయం ప్రకారం మంచి తీర్థం పుచ్చుకొన్నాం. లేకపోతే మేమంతా తాగి పడిపోతే మాస్టరుగారు ఒక్కరూమోసకొని తీసుకొని వెళ్లడం కష్టం కదా. అలా అని వారి రసికతకి లోపం లేదు. అది వేరే విషయం. ఇక భోజనం అంత చాలా వరకు మాంసాహారం. ఏదో మాకోసం అన్నం పెరుగు కూడా ఉంది. బాబూ అదీ సంగతి.
ఒక హంగేరీ ఆయన ఇండియా వచ్చేడట. కొన్ని రాష్ట్రాలు ఉత్తరాదిని చూసేడట. దక్షిణాదిని మద్రాసు, మహాబలిపురం, ట్రివేండ్రం అవీ చూసేడట. ఈ మాటలు మాకు చెప్పేసి మరొకరితో మాట్లాడడానికి పార్టీ మర్యాద ప్రకారం వెళ్లిపోయేడు. ఆఖరున బయల్దేరే ముందు ఆ హిందీ సంస్కృత పండితురాలితో రెండు మాటలు ముచ్చటించేను. అబ్బే మాకు వచ్చిన సంస్కృతం అంతా ఇంగ్లీషు వ్యాఖ్యానం మీద ఆధారపడి ఉంది అని అందామె. అయితే కాళిదాసు, జయదేవుడు, వాల్మీకి, భవభూతి, బాణుడు వీళ్ల పేర్లన్నీ ఆవడకి తెలుసును. అంతే కాదు ఉచ్చారణ బాగుంది. ఇంటికి అంటే హోటెలుకి చేరుకొని పడుకొన్నాం.
ఈ హోటెలు గదులలో attached bathrooms లేవు. సాముదాయకంగా ఉన్నాయి. స్నానాల గదులకు తలుపులు లేవు. అలా స్నానం చేయడం ఇక్కడ అలవాటా!
6-5-89
ఇవాళ ఉదయం ఊరు తిరగడం, వాళ్లిచ్చిన హంగేరీ డబ్బుతో ఏవైనా కొనుక్కోడమూను. వాళ్ళవ్వవలసినదేదో నిన్ననే యిచ్చేశారు. తగిన చిల్లర లేక మాస్టారుగారు ఈ ఉదయం షాపింగ్ సమయం దాకా యివ్వలేదు. మా అందరికీ తల ఒక 300 Forints యిచ్చేరు.
బుడాపెస్ట్ ప్రాగ్ కన్నా పెద్దది. అంతకన్నా చరిత్ర కలది. డాన్యూబ్ నది ఒడ్డునే ఉంది. యూరోపు నగరాలలో కనబడే కట్టడాలు, రోడ్లు, బజార్లు అన్నిటి మాదిరిగానే గంభీరంగా ఉంది. ఇక్కడికి రాగానే చెడిపోయిన పెద్ద కుటుంబానికి చెందినట్టున్నారు ప్రజ. వీలైన చోటల్లా పేకాట. కేకలు, మాట్లాడుకోవడం, యివన్నీ కాస్త భారతీయ ధోరణి స్ఫురింపచేస్తాయి.
డాన్యూబ్ నది ఒడ్డున ఒక చర్చి ఉంది.
చర్చి లోపలికి పోలేదు.
Beautiful view of the Matthias Church
The church
బయట అంతా మన దేవాలయల పరిసరాలలోలాగే దుకాణాలు, పటాలు, దావళాలు, ఏవో బట్టలు, ఇత్యాది. యిక యూరపులో ఏముంది చూడడానికి.
ఇక్కడ రోడ్డుమీద ఎంతో మంది ఆర్టిస్టులు కూచుని కావలసిన వాళ్లకి వాళ్ళ రూపచిత్రం వేసి డబ్బు తీసుకొంటారు. ఇక్కడ అడుగడునా వయొలిన్, గిటార్, బేంజో, ఫ్లూటు వాయించేవాళ్లు, ఒంటరిగాగాని యిద్దరు ముగ్గురు కలిసి రోడ్డు మీద సంగీత కాలక్షేపం చేస్తారు. ఒకచోట గిటారు, ఫ్లూటు బాగా వాయించేరు.
కొన్ని చోట్ల వాద్య బృందంతో పాటలు
పాడేరు. ఈ బృందాలు బుడాపెస్ట్ లో చాలా అడుగడుగునా కనిపించేయి.
ఈ వృత్తి భిక్షాటనంలాటిదో అంతకన్నా
గౌరవమయినదో తెలియదు. ఒకడు mouthorgan వాయించేడు. ఈ హంగేరీ అంతా జానపద సంగీతానికి, నాట్యానికి నృత్యనాటకానికి
ప్రసిద్ధిట. అంతా నవ్వులు, కేకలు, హుషారు. కానీ, ఒక్క
మొహంలోనూ ఆలోచన, జిజ్ఞాస, అవగాహన కనిపించలేదు. ఈమాట ఒక హంగేరీ పెద్దమనిషితో
అన్నాను. ఆయన కొంచెం నొచ్చుకున్నట్టు అన్నాడు, “లేదు, మొదట
మీకు అలా అనిపించవచ్చును, కానీ చాలా సున్నితమయినవాళ్లు, సీరియస్ గా జీవితాన్ని
చూసేవాళ్లూ చాలా మంది ఉన్నారు” అని.
ఇక మాకు యిచ్చిన డబ్బులతో ఏమి వస్తుందో తెలియదు. ఆఖరికి ఈ మూడు వందల Forints తో రెండు సబ్బులు, ఒక after shave lotion వచ్చేయి. ఇక్కడ Forints మన పావలా విలువట. నాణేలు మాత్రం బాగున్నాయి.
7-5-89
ఈరోజు ఒక ప్రోగ్రాం ఉంది. బుడాపెస్ట్
కి 100 కిలోమీటర్ల దూరంలో నిన్న మా కార్యక్రమం బాగా నడిచింది. మూడుసార్లు తెర
మూసివేసినా ప్రేక్షకులు కరతాళద్వనులు చేయడం మానలేదు, కళాకారుల సందర్శనం కోసం. ఇలా
జరగడం ఆ కార్యక్రమ విజయానికి నిదర్శనంట. సాధారణంగా లాంఛనంగా చప్పట్లు కొడతారట. ఇలా
వదలకుండా కొట్టడం వాళ్ల రసికతకూ, కళాకారుల విజయానికి తార్కాణం అన్నమాట. అలా
జరిగింది నిన్న.
ఈ రోజు కార్యక్రమంతో ఈ సంచార కార్యక్రమం ముగుస్తుంది. రేపు అంటే 8, మధ్యాహ్నం Paris. 9 తేదీని ఢిల్లీ. 10 తేదీ మద్రాసు.
-+-
.jpg)





