Saturday, July 18, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 4 - USA - 2

 

Click here for నా విదేశపర్యటనలు – 4 – USA – 1

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 4 – USA – 2

Philadelphia

State of Pensilvania

అమెరికన్ వాతావరణం గురించి ఒకలా అనిపిస్తుంది నాకు. ఇండియా వాతావరణం మాసిన బట్టలా ఉంటే, అమెరికన్ వాతావరణం ఇస్త్రీ మడతలా ఉంటుంది. ప్రకృతి అంతా కన్నుల పండువుగా ఉంటుంది. అందులోనూ పెన్సిల్వేనియాలో. అమెరికాలో చూడవలసినవి అన్నీ చాలా సార్లు చూసేం. అయితే అమెరికన్ జీవితం యింకా అనుభవించడానికి ఎంతో ఉంది. వెళ్లిన 32 మంది 5 కుటుంబాలలో స్థిరపడ్డాం. పిట్స్ బర్గ్ దేవాలయానికి అందరి యిళ్లూ కారు మీద గంట ప్రయాణానికి తక్కువలేదు. యిళ్ల నుంచి గంట ప్రయాణానికి తక్కువ పట్టదు.

మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, కాఫీలు మొదలగు మధ్య మధ్య పానీయాలతో రిహార్సల్స్ పూర్తి చేసుకొని రాత్రికి ఆయా గృహస్థులు మమ్మల్ని, వాళ్లని తీసుకొని వెళతారు. వారం, పదిరోజులయింది. పిట్స్ బర్గ్ జీవితం. శ్రీ గర్తి వరప్రసాదరావుగారింట్లో నేను, శ్రీ మాస్టారుగారు, శశికళ, కల్పలత యింకా మరో నలుగురు అమ్మాయిలు ఉన్నాం. శ్రీ వరప్రసాదరావుగారు పిట్స్ బర్గ్ దేవాలయ నిర్మాతలలో, నిర్వాహకులలో ప్రధానులు. వారిల్లు అమెరికాలో ఉన్న మనవాళ్లకే beautiful house. ఆయన భార్య శ్రీమతి పార్వతిగారూ బహుసౌమ్యురాలు. వాళ్ల అమ్మాయి బిందు, అబ్బాయి వాసు. బిందు నాట్యంలో నిలబడగలదు. వాసుకు మంచి అవగాహన ఉంది. సరీ – నిజానికి నాకు లోగడ అమెరికా వచ్చినప్పుడు శ్రీ నున్న నాగభూషణంగారు, వారి సతీమణి సీతగార్లతో సాన్నిహిత్యం, ఆదరణ లభించింది. ఈసారి వారిని శివదనుర్భంగం, అర్ధనారీశ్వర ప్రదర్శనలలో మాత్రం చూసేను. ఏదో తెలీమధ్యను ఉందనిపించింది.

అర్ధనారీశ్వరం 6 తేదీని ప్రారంభ పూజా సందర్భంలో ప్రదర్శించబడింది మొదటిసారిగా. చిll రవి బాగా చేసేడని అనుకొన్నారు. రక్తి కట్టింది. 8 తేదీ శివదనుర్భంగం గర్వకారణంగా ప్రదర్శంచబడింది. Norfolk*1  లో కూడా రామాయణమే (శివదనుర్భంగం). అందరూ ఎంతో ఆసక్తిగా, సంతృప్తిగా ప్రదర్శనం చూసేరు. ఆ రాత్రికాదు మర్నాటి రాత్రి ఎవరో గుజరాతీ ప్రముఖుని యింట్లో get together. అందరూ పాడేరు. నేనూ పాడేను. న్యాయంగా అక్కడనుంచి Yogaville*వెళ్లవలసి ఉండెను. యోగావిల్’ భారత సంస్కృతీ కేంద్రంట. అక్కడ వాళ్ల వాళ్ల విద్యలు ప్రదర్శించగలగడం గొప్పట. అయితే మా అందరికీ తగిన వసతులు ఏర్పాటు చేయడం వాళ్లకి కుదరట. ఏమయితేనేమి, మళ్లా మేము పిట్స్ బర్గు వెంకటేశ్వరస్వామి అండ చేరేం. మధ్య ఒకరోజు రామాయణం cassette ముందు title music ‘బాల కనకమయ చేల’ పల్లవి రికార్డింగు జరిగింది. మధ్యాహ్నం హరవిలాసం రిహార్సల్సు. నిన్న మధ్యాహ్నం భోజనం చేసి సొంత బస్సులో మళ్లా బయలుదేరేం. సాయంత్రం అంటే 18-8-94 6 గంటలకి ఫిలడెల్ఫియా చేరేం. ఈరోజు మళ్లా శివదనుర్భంగం. రేపు న్యాజెర్సీ, ఎల్లుండి న్యూయార్కు. అక్కడనుంచి కెనడా.   


Yogaville - Virginia



Norfolk - Virginia

*1 Norfolk, Virginia, is a historic, majority-minority independent city of about 235,000 residents, located at the mouth of the Chesapeake Bay in the Hampton Roads metropolitan area. Known as the cultural and urban heart of Coastal Virginia, it is uniquely famous for housing the world's largest naval base and the USS Wisconsin battleship.

 *2 Yogaville, or Satchidananda Ashram, is the Buckingham County, Virginia headquarters of Satchidananda Saraswati's organization.

The ashram was founded in 1980 by Satchidananda Saraswati, whose western notability stems from his opening of the Woodstock festival. The ashram is the international organizational headquarters of Swami Satchidananda's documented teachings. It is located in Buckingham County, Virginia. The primary goal of guru Yogiraj Sri Swami Satchidananda (1914-2002) was interfaith understanding as a vehicle to world peace. To this end, the LOTUS (Light Of Truth Universal Shrine) was constructed and inaugurated in 1986. Swami Satchidananda had been living in Yogaville, though he was visiting Madras, in South India at the time of his death.