Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 1
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను.
ప్రాగ్
25-4-1989
ఈ పర్యటనలో మాతో 15 మంది
మణిపురి బృందం, 15 మంది కర్నాటక యక్షగాన బృందం కూడా ఉన్నారు. యక్షగాన బృందంలో
మగవాళ్లే ఎక్కువ. మణిపురిలో ఆడపిల్లలు ఎక్కువ. సరీ, కూచిపూడిలో సరిసమానం. మా అందరికీ
బస్సు ఏర్పాటు అయింది. Airportలో పెద్ద విశేషాలు లేవు.
నిజానికి ఏప్రిల్ 23
మా నాన్న ఆబ్దికం. అప్పుడే కొంతకాలం నుంచి తద్దినలు సక్రమంగా జరగలేదు. ఇలాగే ఏదో
సంచారంలో ఉండడంచేత. ఆయన పోయేనాటికి 58 ఏళ్లు. అంటే ఈనాడు ఆయనకంటే నేనే 11 ఏళ్లు
పెద్ద అన్నమాట. మనుషులు పుడతారు. ఏళ్ల ప్రత్యేక వ్యక్తిత్వం, అనుభవం పొందుతారు.
తరవాత పండిన ఆకులా రాలిపోతారు. అంటిపెట్టుకొన్న చెట్టుకొమ్మ మళ్లీ చిగురిస్తుంది.
చెట్టు యొక్క జీవశక్తి ఉన్నంత కాలం కొత్త ఆకులు చిగిర్చడం, పండుటాకులు రాలడం. అదే సహజం.
ప్రతీ ఆకూ పునర్జన్మ పొందుతుందా? అవసరం ఏముందీ? పునర్జన్మ లేకపోతే ప్రకృతి ధర్మానికి నష్టం ఏమీ లేదు కదా! అది అలాగే ఉంటుంది.
అమ్మయ్యో... పునర్జన్మ లేకపోతే ఈ వేదాంతాలు, మతాలు, వీటిగతి ఏమిటి?
ఢిల్లీ నుంచి
ఫ్రాంక్ ఫర్ట్ కి దగ్గరగా 7 గంటలు ప్రయాణం. ఈ విమానయానంలో నేను కూర్చుందికి, వీణ
పెట్టుకుందికి మంచి ఆనుకూల్యం కుదిరింది. చి.సౌ. పద్మతల్లి చి. చంద్రుగాణ్ణి ఎవరేనా
చూసుకొంటే పొందే స్వేచ్ఛ పొందేను. ఫ్రాంక్ ఫర్ట్, స్థానిక కాలమానం 5 గంటలకి చేరేం.
Airport లాంఛనాలన్నీ పూర్తిచేసుకొని హోటేలు 8.30కి చేరేం. అందరికీ అలసటగా ఉంది. మన టైము ప్రకారం 12 గంటలు రాత్రి అన్నమాట. అంటే 23 పూర్తి అయింది. భోజనం ఏర్పాట్లుచేసే Indian రాయబార కార్యాలయోద్యోగి ఒకంతట రాలేదు. ఆఖరికి భోజనం ఏం చేయోలా బోధపడక ఉడికించిన కూరలు, బ్రెడ్డు తిన్నాం. చాలా ఉన్నాయి అక్కడ. మాకు ఏవి తినాలో, తీసుకోవాలో తెలియదు. మర్నాడు ఉదయం బాగానే పట్టించేం. మధ్యాహ్నం 3 గంటలకి ప్రాగ్ వెళ్లే flight. 24 సాయంత్రానికి ప్రాగ్ చేరుకొన్నాం. Intercontinental – five star hotel లో మా బస ఏర్పాటు.
.jpg)

No comments:
Post a Comment