Saturday, April 25, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 1

 

 Click here for - అమెరికా - ముక్తాయింపు

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 1

ప్రాగ్

25-4-1989

మద్రాసులో 21 వ తేదీనే బయలుదేరేం. ప్రయాణంలో విశేషం ఏమీ లేదు. అనేక సార్లు విమానయానం చేయడంచేత విమానాశ్రయంలోని కార్యకలాపాలు, ప్రయాణీకుల ఉత్సాహాతిశయాలు, అంపకాలు పెట్టుకోడంలోని కరుణ, విమానంలో యథావిధిగా జరిగే సత్కారాలు, ఉపదేశాలు అన్నీ మాములుగా జరిగిపోయాయి. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో నా సూట్ కేస్ చివర కొంచెం నోరు వెళ్ళబెట్టింది. దాన్ని బాగుచేయించుకోవాలన్న చీదర ప్రారంభం అయింది. న్యాయంగా ICCR వాళ్లు మా అందరికీ యాత్రిక్ నివాస్ లో  బస ఏర్పాటు చేసేరు. ఆ మర్నాడు, అంటే 22 తేదీని ఆంధ్రప్రదేశ్ భవనంలో మా కార్యక్రమం ఉండడంచేత వాళ్లు rooms  ఏర్పాటు చేసేరు. అయితే ఆడపిల్లలు, మాస్టారుగారు అక్కడ ఉన్నారు మేం యాత్రిక్ నివాస్ లో ఉన్నాం, యాత్రిక్ నివాస్ ప్రక్కనే ఒక మంచి జోళ్లుకుట్టే కుర్రాడు నా సూటుకేసు బాగుచేసేడు, పుచ్చుకుంటే పుచ్చకున్నాడు 15 రూపాయలు. మా అందరి భోజనం ఆంధ్రప్రదేశం భవనంలోనే. ఆ సాయంత్రం ఆంధ్రప్రదేశ్ భవనం ఆడిటోరియంలోనే రిహార్సల్సు. శ్రీ శ్రీనవాసన్ యథాప్రకారం వచ్చేరు. మాస్టారుగారికి ఇవ్వవలసిన సలహాలు యిచ్చేరు.   

మర్నాడు అంటే 22 ఏప్రిల్, ఉదయం ఆంధ్రప్రదేశ్ భవనంలో కాఫీ, ఫలహారాలు పూర్తిచేసేం. మొత్తానికి ఏమైనా శ్రీ NTR ఢిల్లీలో కొంత తెలుగుతనం నిలబెట్టేరు. తెలుగు భోజనం తినిపించేరు దేశీయులందరికీ. కందిపొడి, ఆవకాయ, గోంగూర. మిగిలిన దాక్షిణాత్య భోజనానికి భిన్నమైన రుచి తెలియజేసేరు. పదార్ధాలు రమారమి అవే. అయితే రుచి వేరు. భరతనాట్యానికి, కూచిపూడికి ఉన్న తేడా అదే. సరీ, ఆ ఉదయం ICCR కి వెళ్లాం. అక్కడ మా కార్యక్రమపు తీరు దానికి అవసరమయే వెలుగునీడల దోహదం ఎలా ఉండాలో చూసుకోవడం అయింది.

మారు దుస్తుల ఖర్చుకోసం 500 యివ్వాలని తేలింది. ఆడేవాళ్ల కాస్ట్యూమ్స్ కోసం ప్రత్యేకం యివ్వడంలేదని తెలిసింది, యిక, ఎవరికైనా డాలర్లు కావాలా, కావలిస్తే రూపాయలకి బదులు డాలర్లు తీసుకోవచ్చును అన్నారు. ఎవరి దగ్గరా ఏమీ లేదనీ, డాలర్లు తీసుకొనే అంత డబ్బులేదనీ, ఊరికే యిస్తే  పుచ్చుకొంటామనీ ఆయనకి తెలియదా... ఆఖరికి దుస్తుల కోసం యిచ్చే 5 వందలకి సరిపడే డాలర్లు తీసుకోమన్నారు. 20 డాలర్లు యిచ్చేరు. మిగిలిన 135 రూపాయాలు చూసుకొందాం తర్వాత అనుకొన్నాం. అప్పటికే భోజనం వేళ అయింది.

సాయంత్రం మా కార్యక్రమం బాగా జరిగింది. అందరికీ పూలకుండీలు జ్ఞాపికలు యిచ్చేరు. వీణ కవరు వేస్తూండగా ఒక యివకుడు వచ్చేడు. తాను బాబ్జీ కొడుకునని పరిచయం చేసుకొన్నాడు. అప్పుడే బాబ్జీ పోయి 20 ఏళ్లు దాటి ఉంటుంది. ఈ అబ్బాయిని తెలియదు. వీళ్ల అన్నని చూసేను. యీ అబ్బాయి Air Force లో పనిచేస్తున్నాడట. నిజానికి బాబ్జీ పిల్లలతో అంత పరిచయం ఉండడానికి అవకాశం లేదు. అయినా ఆ పిల్లలు అంత ఆత్మీయంగా పలకరించడానికి నా పేరు, బాబ్జీకి నాకు మధ్యగల బాల్యస్నేహం యింట్లో అందరికీ అంత సన్నిహితుణ్ణి చేసేయనుకొంటాను. పెద్దమ్మాయిని చూసేను లోగడ. ప్రస్తుతం రాజమండ్రిలో ఉందట. ఆ అబ్బాయితో మాట్లాడడం ఎన్నో బాల్య స్మృతులను రేపింది.

శ్రీ సుబ్బుడు కచేరీకి వచ్చేరు. నా యడల ఆయనకి కొంత సద్భావం ఉంది. మాతోనే ఆయన అక్కడ భోజనం చేసేరు. ఏవో సంగీత చర్చలు జరిగేయి. ఆయన కంపోస్ చేసిన తిల్లానా గురించి చెప్పేరు. విమర్శలో కరుకుదనం, రసజ్ఞతలో నిండుతనం రెండూ ఉన్నాయి ఆయనలో.

తెల్లవారు జామున 5 గంటలకి యాత్రిక్ నివాస్ లో ground floor కి వచ్చేయాలని సూచనలు యిచ్చేరు. 


No comments: