Saturday, May 30, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 6

 

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 5

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 6

ప్రాగ్

29-4-89

చెకొస్లోవేకియా రెండవ ముఖ్యపట్నం Bratislava. ఇది Slovakia ముఖ్యపట్నం అన్నమాట. Prague నుంచి యిప్పుడు అక్కడికి బయలుదేరేం. Prague  నుంచి అక్కడికి ఒక గంట ప్రయాణం విమానం మీద. ఉదయం breakfast తర్వాత ఈ రోజు lunch లేదు. Bratislava లో 2 తేదీ ఈ festival  ముగింపు రోజు. ఆ రోజు అన్ని పార్టీలు అక్కడ కలుస్తాయి. ప్రస్తుతం మాతో శరన్ రాణి పార్టీ వచ్చేరు. Bratislava లో విమానం దిగేం. ఇక్కడ వర్షం లేదు. చలి ఉంది. Baggage తీసుకొందికి నిలబడ్డాం. ఇక్కడ baggae తీసుకొనే ప్రదేశం ఆరు బయట. ఆఖరికి ఎలాగైతేనేం బస్సులో బయలుదేరేం. మమ్మల్ని receive చేసుకొందికి ఒక ముగ్గురు ఆడవాళ్లు వచ్చేరు. ఒకావిడ నాయకురాలు. ఆవిడకి ఇంగ్లీషు రాదు. ఆమె చెప్పింది ఆంగ్లీకరించడానికి మరొక ఆమె. సరే, Bratislava లోనే మేము ఉండి అక్కడ నుంచి Hurbanovo  వెళతాం అనుకొన్నాం. అదేం లేదు. బస్సు పోతునే ఉంది. ఊరు తరవాత ఊరు తగులుతునే ఉంది. బస్సు ఆగే సూచన లేదు. ఈలోగా bathroom అవసరం కలిగింది. నిజానికి విమానం దిగగానే వెళ్ళవలసింది. అక్కడ ఎక్కడ ఉన్నదీ బోధపడక బస్సు ఎక్కేసేం. అలా బస్సు పోతునే ఉంది. చుట్టూ పంట పొలాలు. ముఖ్యంగా ఆవాలు పంట పువ్వు పూచిందనుకొంటాను. మైళ్ల కొద్దీ పసుపు పచ్చగా తివాచీ పరిచినట్టుగా ఉంది.


Danube River - Bratislava



ప్రయాణం దృశ్యాలు బాగున్నాయి. అయితే ఒకటికి వెళ్ళాలే. ఆఖరికి శరన్ రాణి పార్టీలో తబలా వాయించే అతను, ఘోష్, అడిగేడు. ఆకలి వేస్తున్నదనీ ఎక్కడైనా ఆపమనీ. ఇంగ్లీషు మాట్లాడే ఆమె అంది, మీ దగ్గర డబ్బలుంటే మీరు lunch తీసుకోండి. తర్వాత మీ డబ్బులు మీకు యిచ్చేస్తాం అని. సరే అని దారిలో ఏదో ఊరు, అక్కడ రెస్టారెంట్ అక్కడ ఆగి తొందరగా toilet కి పోయి, తాపీగా కాఫీ bread తీసుకొన్నాం.

అక్కడనుంచి మరో 45 నిమిషాలు ప్రయాణం. ఆఖరికి ఒక ఊళ్లో ఆగేం. శరన్ రాణి పార్టీ మాత్రం ఇంకా మరో ఊళ్ళో దిగాలి. హోటేలు బాగానే ఉంది. అయితే హోటేలు సాధారణమైనది. టెలిఫోన్ గాని, TV గానీ లేవు. అసలు ఈ ఊరు పేరు ఏమిటో తెలియదు. ఆ సందేహంతోనే రాత్రల్లా నిద్రపోయేం. ఉదయానికి ఆ సందేహం తీర్చుకొన్నాం. ఈ ఊరు పేరు Nove Zamky.

ఈ హోటేలు ఊరి మధ్యనే ఉంది. చట్టూ shopping centres లాగే ఉంది. అయితే ఈరోజు ఆదివారం. మా దగ్గిర మిగిలిన crowns ఎలా వదుల్చుకోవాలో. ఈ రోజు మళ్లా మరొక వంద క్రౌనులు యిచ్చేరు. అసలు సంగతి – ఈ festival 2 తేదీతో పూర్తవుతుంది. తర్వాత 5 తేదీని గానీ మేం బుడాపెస్ట్ వెళ్లం. అంటే Bratislava ఆ రెండు రోజులు ఖాళీగా ఉండాలంటే హోటేలు ఖర్చు ఎక్కువ. అందుచేత ఈ చిన్న ఊళ్ళో చౌకగా ఈ రెండు రోజులూ గడపడానికి ఇక్కడ పెట్టేరు మమ్మల్ని. Festival ముగింపు రోజున Bratislava వెళ్లినా Nove Zamky కి తిరిగి వచ్చేయాలి. ఏమి కొనాలన్నా యిక్కడే. లేదా తర్వాత కొనాలి.

ఉండి ఉండి, వంటరిగా కదా ఉంటాం, హోటేలు గదిలో. మన యిల్లూ, పిల్లలు, మా చిన్నమ్మడు, ఆ పరిస్థితులూ, మా చి.సౌ. పద్మ తల్లీ, చి. చంద్రూ, వాళ్ల క్షేమం తెలిసిందో లేదో...

తరవాత, ఉండి ఉండి, చిన్నతనం, సాలూరు, ఆనాటి మనుషులు, ఏవో దృశ్యాలు, ఈ ప్రపంచ గమనం, మళ్లా నేనూ అనే ఆలోచన. ముసలివాళ్లం అయిపోయేం, యింక ఏముంది? ఇలాంటివి యింకా యౌవనపు స్మృతులు వీటితో భూత, భవిష్యత్తు, వర్తమానకాలలో సంచారం జరుగుతూ ఉంటుంది.     

 

*1The Danube is Europoe's second longest river (after the Volga) and the longest in the European Union.Stretching approximately 2,850 km 1,770 miles, it flows from the Black Forest in Germany to the Black Sea in Romania. The river connects 10 nations and passes through four European capitals: Vienna, Bratislava, Budapest, and Belgrade.



No comments: