Saturday, May 23, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 3 - యూరప్ - 5

 

Click here for నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 4

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

నా విదేశపర్యటనలు – 3 – యూరప్ – 5

ప్రాగ్

28-4-89

రోజూ breakfast కి నేను ఆలస్యం అయేవాణ్ణి. ఈరోజు నేను ముందు తెమిలిపోయేను. ఇప్పుడే అయింది breakfast. బాగానే ఉంది. పదకొండు గంటలకి అంటే మన 2.30 గంటలకి ఊళ్ళోకి తిరగడానికి వెళతాం. ఈ crowns ఎలా వదుల్చుకోవాలో చూడాలి.

అనుకొన్న విధంగా బస్సు వచ్చింది. ప్రాగ్ నగరం అంతా తిరిగేం. ఇక్కడి పార్లమెంట్ భవనం, కొండ మీద స్టేడియం ఏవో ఏవో చూసాం. పాతకాలపు భవనాలు అన్నీ. అందంలో గానీ, వైశాల్యంలో గానీ తక్కువ లేదు. చాలా హుందాగా ఉంటాయి. దక్షిణ హిందూ దేశపు దేవాలయాలు చూస్తే ఎలా ఉంటుందో పాత కట్టడాలు చూసినా అలాగే ఉంటుంది. గంభీరం విషయంలో. ఈ జకోస్లోవేకియా అంతా పేరు మార్పుతో కొంత హంగేరీ, కొంత జర్మనీ, ఆస్ట్రియా ప్రాంతలలోదే కదా!

రాత్రి మా కార్యక్రమం బాగా రక్తి కట్టింది. రేపు ఇక్కడ నుంచి flight లో Haresnovo (?) అనే ఊరు వెళతాం. ఉదయం 11.30 కి flight. నిన్న రాత్రి programme అయిన తర్వాత ఒక తమిళ యువకుడు, ఇక్కడి రిసెర్చ్ స్కాలరు మమ్మల్ని అంటిపెట్టకొని తిరిగాడు. రేపు ఉదయం తొమ్మిది గంటలకి వస్తానన్నాడు. మమ్మల్ని shopping కి తీసుకువెళతానని.

29-4-89

ఉదయం ఆరు గంటలకే లేచేను. దంతధావనం అయింది. స్నానంచేసి రెడి అయితే, breakfast అయిన తర్వాత shopping. అదీ కార్యక్రమం.

అప్పుడే రెండు రోజులనుంచి మబ్బు మూసుకొంది. చిన్న తుషారం, చలి. అనుకొన్నట్టుగా ఆ తమిళ యువకుడు వచ్చేడు. మా interpreter ‘ఏవా. ఆ అమ్మాయీ వచ్చింది. దగ్గరలోనే నడిచి వెళ్లవచ్చునని తీసుకొని వెళ్లేరు. మీదనుంచి తుషారం. చలి. ఒక మైలు పేనే నడిచి ఉంటాం. జలుబుచేసి ఆరోగ్యం చెడుతుందేమోనని భయం. మొత్తానికి ఒక పెద్ద departmental store కి తీసుకొని వచ్చేరు. అయితే చాలా వెచ్చగా ఉంది. ఇక్కడ గాజు వస్తువులు, crystals, గాజు పూసలకి ప్రసిద్ధిట.




ఏది చూచినా వందల క్రౌనులు ఖరీదు. మా దగ్గర ఉన్నవి ఐదువందల చిల్లర. బట్టలు కూడా అంతే. ఆఖరికి 150 క్రౌనులు ఒక గొడుగు. చి.బాలతల్లికి, అందరూ కొంటున్నారని ఒక bag కొన్నాను. Bag ఖరీదు 170 క్రౌనులు, చి.గోపికి టీ shirts కొందామనుకొన్నాను, కుదరలేదు. అప్పుడే బయలుదేరాలి airport కి.  Departmental Store లో చాలా వెచ్చగా ఉంది. మా తడిసిన బట్టలు ఆరిపోయాయి.

వచ్చేటప్పుడు Metro లో వచ్చేం. New York లో కన్నా, లండన్ లో కన్నా కూడా ఇక్కడ ఈ మెట్రో విశాలంగా ఉంది. బాగుంది. చాలా పెద్ద, ఎత్తైన elevators. మొత్తానికి ఉదయం కార్యక్రమం బాగానే ఉందని అనిపించింది.





 


No comments: