Saturday, April 4, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - అమెరికా - 11

 

 Click here for - అమెరికా 10

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 11

6-4-86

అనుకొన్న విధంగా పోర్టులాండ్ నుంచి తిరిగి న్యూయార్క్ బయలుదేరేం. పోర్ట్ లాండ్ సంగీతశాఖా అధ్యక్షుడు మరో అబ్బాయి రెండు van లలో మమ్మల్ని airport కి తీసుకొని వచ్చేరు. తిన్నగా పోర్ట్ లాండ్ నుంచి న్యూయార్క్ రావలసిన flight మధ్యలో మినియాపోలీస్ లో మారవలసి వచ్చింది. ఏవో కారణాలవల్ల. అయితే వెంటనే మరో flight ఉంది న్యూయార్క్ కి. రావలసిన టైము కన్నా మరో గంట లేటుగా న్యూయార్క్ చేరేం. చి. బాలా, గోపి, చి.సౌ. రమణమ్మ, చి. రామచంద్రరావు రాసిన ఉత్తరాలు అందుకొన్నాను.

న్యూయార్క్ లో శ్రీ KV రావుగారు, రఘునాథ్ గారు కలిసారు. Flight లో మాకు ఏదో శాఖాహార భోజనం పేరుతో యిచ్చేరు. కానీ మళ్లా ఏదో తినాలని అనిపిస్తునే ఉంది. అయితే ఆ రాత్రికి మరేమీ తినే యోగ్యత లేకపోయింది. అయితే అదృష్టవశాత్తు మేము తెచ్చుకొన్న bread పాలు ఉండడం చేత ఆకలి బాధ లేకుండా గడిచింది.

మళ్లా న్యూయార్క్ లో మొదట మేము బసచేసిన హోటేలు ఎస్ప్లనేడ్ లోనే దిగేం. మర్నాడు ఉదయం న్యూయార్క్ లో కొనవలసిన వస్తువులు కొనాల్సి ఉంది. ముఖ్యంగా చి.రామచంద్రరావు అడిగిన calculator.

ఉదయం మళ్లా కాఫీ, bread తీసుకొన్నాం. శ్రీ వేదాంతం సత్యనారాయమశర్మగారి బంధువు ఒకాయన ఉదయాన్నే వచ్చి ఏవో వస్తువులు ఆయనకి యిచ్చేరు. మార్తా స్నేహితుడు ఒక అబ్బాయి వచ్చేడు. మేం అంతా subway లో Queens’ అనే ప్రదేశానికి shopping కి వెళ్లేం. మాస్టారుగారు, కనకదుర్గా మాత్రం శ్రీ చలికొండ రామక్రిష్ణగారి కోసం వేచి ఆయన కారులో వెళ్లాలని ఉండిపోయేరు. కనకదుర్గ చలికొండ రామక్రిష్ణ, ఆయన భార్య సహాయంతో బంగారు గాజులు కొనే ప్రయత్నంలో ఉంది. తన వెంట 600 డాలర్లు మాస్టారుగారి సహాయంతో తెచ్చుకొని మొత్తానికి గాజులు కొంది. క్వీన్స్ లో నేను calculator, ఒక Walkman, బట్టలు, perfumes కొన్నాను. కొన్ని cassettes కూడా కొన్నాను. బాగా ఆకలి వేస్తోంది. అక్కడే ఉన్న ఒక ఇండియన్ హోటేలులో భోజనం చేసేం. మాస్టారుగారు, చలికొండవారు, కార్లో వస్తే మేం కొన్న సామగ్రి ఆ కారు డిక్కీలో పడవేసి తిరిగి subway లో మా హోటేలుకు చేరేం. కొన్న సామగ్రి అంతా పెట్టిలో పెట్టడానికి అనుమానం. అందుచేత handbag లో పెట్టుకొన్నాను. చాలా కిక్కిరిసి ఉంది. సూట్ కేస్ కూడా చాలా బరువెక్కింది. రఘునాథ్ గారు, రమణయ్య రాజాగారికి పంపిన చాలా బరువు అయిన వస్తువులు అందరికీ మాస్టరుగారు పంచియిచ్చేరు జాగ్రత్త చేయమని. అందుచేత అందరి పెట్టెలూ చాలా బరువు అయేయి.

ఇటీవల సంభవించిన విమాన ప్రమాదాల వల్ల న్యూయార్క్ airport లో కూడా తణిఖీ చేస్తారని భయపట్టేరు. మరేంలేదు. పెట్టె తెరిస్తే మళ్లా సర్దుకోవడం కష్టం. అయితే ఏ విధమైన శ్రమ కలగలేదు. మా పెట్టెలు తెరవలేదు. సామాను అందా లగేజీలో పంపిచిన తర్వాత Air India Lounge లో 3వ అంతస్థుకి పంపించేరు.  Air India వారు అక్కడ ఉన్నత తరగతి ప్రయాణీకులకు మధుపానం ఏర్పాటు చేసేరు. నేను, మాస్టరుగారు, నాగరాజు ఆ అవకాశాన్ని వినియోగించుకొన్నాం.

ఇక నా వీణ నాతో దగ్గర పెట్టుకొందికి ఏ అభ్యంతరం వస్తుందేమోనని నా భయం. అయితే Air India captain మొదటే ఏ అభ్యంతరం లేదని హామీ యిచ్చేరు. Flight లో మాది ఎక్సిక్యూటివ్ క్లాస్ అవడం చేత చాలా ఉన్నత తరగతి ప్రయాణికుల సౌకర్యాలు పొందేం.   


No comments: