Saturday, March 7, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - 2 - అమెరికా - 7

 

 Click here for - అమెరికా 6

కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

అమెరికా - 7

1-4-86

అనుకొన్న విధంగా నిన్న రాత్రి dinner కి వెళ్లేం. ఆ యింటివారు ఈనాటి పాకిస్తానులోని సింధీలు. ఏనాడో హొనలులూ వచ్చి స్థిరపడ్డారు. ఆ యింటి పెద్దాయన 101 సంవత్సరాల వయసువాడు. చిత్రం ఏమిటంటే అతని పళ్లు ఊడలేదు. ఇప్పటికీ సరదా పుడితే ఒక నాలుగు గంటలు ఆఫీసులో ఉంటాడట. ప్రస్తుతపు యింటి యజమానులు ఆయన కొడుకు, కోడలూను. పెద్ద కొడుకు పోయాడట. పెద్ద కోడలు మాత్రం ఉంది. ఆ యింటి సభ్యులు ఒకరు లండనులో, మరొకరు మద్రాసులో, మరొకలు వాషింగ్టన్ లో. వాళ్లు సింధీలట. మద్రాసులో ప్రముఖ వ్యాపారి చెల్లారం యింకా ఎవరో వాళ్ల బంధువులు. వాళ్లు ప్రపంచం అంతా ప్రతి చిన్నపని మీదా తిరుగుతూ ఉంటారు. ఇండియా ఫెస్టివల్ నిర్వహణలో ఆ యింటి యజమానురాలుకి ఏదో సంబంధం ఉందిట కొంత. మా నాట్య కార్యక్రమం చూసి మమ్మల్ని విందుకి పిలిచేరు. 

ఇంటి యజమానురాలికి మంచి అభిరుచికల వ్యక్తిగా రసికులచేత భావింజబడడం యిష్టం. ప్రపంచం మొత్తం మీద చాలా ప్రాచీన కళాఖండాలు ఆమె పదిలపరిచింది. ఏదో కళకి సంబంధించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇంటి యజమానికి (ప్రస్తుతం, ముసలాయన wheel chair మీదే) తనెమో తన వ్యాపారమో, అంతే. ఆవిడ అభిరుచి మీద ఆయనకి మంచి నమ్మకం ఉంది. మాకు విందు ముందు ఎవరికేమి యిష్టమో ఆయా పానీయాలన్నీ offer చేసేరు. అయితే మన భారతీయ సంస్కృతికి భంగం లేకుండా ఫలరసాలు సేవించేం. వాళ్లు చాలా నీరసపడ్డారు మా ప్రవర్తనకి. అయితే ముందు రాత్రి మాస్టరుగారు మాకు మంచి బ్రాందీ విందు చేసేరు. అయితే మాంసం తింటామని ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతామా – అదీ మన సంస్కృతి. ఇంకా ఎవరో వచ్చేరు. మనకి ఎవరితోనూ మాట్లాడాలనీ, వాళ్లతో సంతోషంగా గడపాలని ఉండదు కదా. ఉన్నా మాట కలవదు. భాష చిక్కు ఎంతో ఉంది కదా.

గంభీరంగా కూర్చుని పుస్తకపఠనం చేస్తూ కూర్చొంటే వాళ్లు మాత్రం ఎంతకని భరించగలరు? ఆఖరికి ఆ యింటి ఆయన వచ్చిన అతిథులని అతిథులతో సంతోషంగా మాట్లాడమని సూచించేడు. అయినా మన సంస్కృతి మనదే. ఆఖరికి ఎలాగో అలాగ బయటపడ్డాం. వాళ్లకి ఏ విధమయిన నిరుత్సాహం కలగకుండా మార్తా, ఆమె సహాయకురాలు ప్రయత్నించి రెండు మూడు రౌండ్లు వైను సేవించేరు. బాబూ! అదీ నిన్నటి సంగతి. మరచిపోతానేమో రాదామనుకుంటూ... అసలు మాట రాయలేదు, ఇదంతా రాసుకొన్నాను. అసలు ఆ మాట ఏమిటంటే, ఇక్కడ హవాయిన్లు ఒక మాట అంటూంటారు. అది ఏమిటీ... ఆలోహా. అంటే Hello అనడానికి. Good bye, Good morning, యింకా చాలా వాటికి ఉపయోగిస్తారు, ఆలోవా.

నిన్నరాత్రి అతిథులలో ఒకామె ఢిల్లీ నుంచి, ఒకాయన శ్రీలంక నుంచి వచ్చిన వాళ్లు. ఆ ఢిల్లీ ఆవిడ మొన్న హైదరాబాదు ఫిలిం festivals కి వచ్చిందట. శ్రీ NTR చేసిన ఏర్పాట్లకి ఎంతో ముచ్చటపడింది. ఏమైతేనేమి తెలుగువాళ్లం అని తెలిసి మమ్మల్ని సంతోషపెట్టదలుచుకొందేమో? ఎవరు చెప్పగలరు?



No comments: