Saturday, January 10, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 18 - 26-10 -1987

 


 Click here for - రష్యా 17 - 23-10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 18

26-10-87

ఈరోజు రాత్రే మా తిరుగు ప్రయాణం మాస్కో. మాస్కోలో 28న కార్యక్రమం ఉంది. 29 ఢిల్లీ బయలుదేరాలి. ఈరోజు కాలక్షేపం అంతవరకు. యిప్పుడు 11.30 కి ఏదో సినిమా మా హోటేలులో ఉన్న థియేటరులో. తర్వాత lunch. 3 గంటలకి ఏదో sightseeing. తర్వాత డిన్నరు. 11 గంటలకి ట్రైను. 

అనుకొన్నట్టుగా సకాలంలో బయల్దేరేం. సుఖంగానే జరిగింది ప్రయాణం. అయితే రెండు కంపార్ట్ మెంటులలో ఏర్పాటు అయేయి. Berths కూచిపూడి నాట్య బృందం, ఆర్కెస్ట్రా, నేను తప్ప, ఒకే కంపార్ట్ మెంటు. మిగిలిన ఆడపిల్లలు, ముసలాళ్లు  మరో కంపార్ట్ మెంటు. లోగడ రైలు ప్రయాణంలో సామాను సర్దుకోవడం తెలియలేదు. చక్కగా berth ల కింద, పై బెర్తులో ఎదురుగా సదుపాయంగా చాలా సామాను సర్దుకోవచ్చును. మొన్న ఆ సులువు చెప్పింది లేలా. చక్కగా తెల్లవారే సరికి మాస్కో చేరేం. అయితే రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా చాలా దూరం నడవవలసి వచ్చింది. నా వీణ, నాbag నేను భరించవలసింది.

మూడు రోజులనుంచి మాస్కోలో fog ఎక్కువగా ఉంది, flights cancel అయేయనిఅన్నారు. మేము మాస్కో చేరేసరికి ఎంతో freshగా ఉంది ఆకాశం, భూమీని. చక్కటి ఎండ వచ్చేటట్టు తూర్పు ఎర్రపడింది. తర్వాత వచ్చింది కూడా ఎండ.

27-10-87

ఈసారి హోటేలు రష్యా కాదు. హోటేలు యుక్రేన్. బయటనుండి చూడడానికి పెద్ద చర్చి ఆకారంలో ఉంది. చాలా బాగుంది హోటేలు. Rooms పెద్దవి. నిన్న ఏ పనీ లేదు. బయటకి వెళ్లి shopping కి కూడా వెళ్లక్కరలేదు. ఎవరి దగ్గరా రూబుల్సు లేవు. ఉంటే కోపెక్కులే. కోపెక్కులతో కొనే చిల్లర వస్తువులు హోటేలు lounge లోనే ఉన్నాయి. నిన్న సాయంత్రం 7.30కి బృజు మహరాజు వాళ్ల కార్యక్రమం. అందరం వెళ్లేం. ఇంతకు పూర్వం ఆయన నృత్యం చేయగా చూడలేదు. నిన్న ఆయన నృత్యం స్వయంగా చేయడం చూడడం అయింది. తగిన విగ్రహం లేదు ఆయనకు. మంచి ఊహపోహలు గల నాట్యవేత్త. మంచి లయ, మంచి సంగీతజ్ఞానం. తబల, డోల్కీ మొదలైన వాద్యాలను సమర్థంగా వాయించగలడు. మొత్తం కార్యక్రమం ఆకర్షణీయంగా ఉంది. రాత్రి సూర్యారావుగారు తెచ్చిన వోడ్కా sample bottle ఒక పెగ్గు ఉంటుందేమో. ఇద్దరం పంచుకొన్నాం. ఏమీలేదు. కక్కుర్తి తప్ప.

28-10-87

ఉదయం లేవగానే phone – మాస్టరుగారు 8.25 అయేసరికి కిందనుండాలన్నారు. విమలా రామచంద్రన్ breakfast కి పిలిచేరు. ఆమె నాట్యవేత్త, critic, మద్రాసు Music Academy లో lecture-demonstrations యిస్తూ ఉంటారు. ఆమె భర్త Air India officer. మేమున్న హోటేలు యుక్రేన్ దగ్గర వాళ్లిల్లు. నేనూ, మాస్టరుగారు, గోవిందరాజన్, శైలజ, లక్ష్మి మాత్రం వెళ్లేం. చాలా మంచి యిడ్లీలు, చట్నీ, కేసరి, పొంగలు చేసారు. కాఫీ. ఇటీవల రెండు నెలల దగ్గర్నుంచి మన యిడ్లీలకి దూరంగా ఉన్నాం కదా. మహా రుచిగా ఉన్నాయి ఇడ్లీలు. ఇండియా నుంచి వచ్చిన ఇంగ్లీషు పత్రికలు అక్కడ చూసేం. మద్రాసులో 17వ తేదీని చాలా పెద్ద వర్షం పడిందిట. ఇటీవల ఇండియా వెళ్లి వచ్చిన చౌరసియా మద్రాసులో నీటి ఎద్దడి ఇంకా తీవ్రంగానే ఉందని చెప్పేరు. పత్రికలో ఈ వార్త కొంత ధైర్యం కలిగించింది.

రాత్రి చండాలిక జరిగింది ఒక మంచి థియేటరులో. బాగానే వచ్చింది. ఇక్కడ స్థానికంగా ఉన్న తెలుగు ప్రముఖులను చూసేం. నిడమర్తి ఉమారాజేశ్వరరావుగారిని చూసేం. ఆయన అభ్యుదయ సాహిత్య అనువాద కర్త. టాల్ స్టాయ్ నవల అనుమానంఅన్న పేరుతో వచ్చింది. రాజేశ్వరరావుగారి అనువాదం అనే జ్ఞాపకం. ఆయనను లోగడే చూడవలసింది. అంటే స్మొలెన్స్క్ వెళ్లకపూర్వమే. ఊరికే, మాస్కాలో ఆరోజుల్లో కాలక్షేపం చేసినప్పుడు. ఎవరు తెలుగువారు మాస్కో వచ్చినా వారింటిలో మంచి తెలుగు భోజనం పెట్టి పంపించడం ఆయనకి సరదాట.

29-10-87

అయిపోయింది రష్యా పర్యటన. ఈరోజు రాత్రి తిరుగు ప్రయాణం ఇండియాకి. 

1987 సెప్టంబర్-అక్టోబర్ మధ్యకాలంలో 
రష్యాలో జరిగిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో పాల్గొన్న 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు బృంద సభ్యులు 



first row
Kamala Reddy, Kalpalathika , Sathyapriya,
Second row..
Nagarajangaru, Ramu Vedantham, 
  Sasikala penumarthi, Mala ganapathi, Indira Reddy, Jayapriya, Sailaja
Third row 
Surya Rao garu, M.S.Rao garu , Vempati Master garu, Anuradha, B.V.S.S.Lakshmi, Kanaka Durga,
Fourth row
Vedantham  Rathayya Sarma, M.V.N.Murthy, Udaya Kanth, Govindarajan garu, Nalini,  
Sangeetha Rao Master garu, Hari Rammurthy

No comments: