Saturday, January 3, 2026

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 17 - 23-10 -1987

 

 Click here for - రష్యా 16 - 19-10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 17

23-10-87

స్మొలెన్స్క్* చాలా చారిత్రాత్మక ప్రదేశం. శతాబ్దుల పర్యంతం యుద్ధ క్రీడకి ఆటపట్టు. మంగోలియన్లు, టార్టారులు దగ్గర నుంచి నిన్న మొన్నటి రెండవ ప్రపంచ సంగ్రామం వరకు అనేక యుద్ధాలలో స్మొలెన్స్క్ పాల్గొంది.

Assumption Cathedral, Slomensk

Monument to Defenders of Smolensk - Lopatinsky Garden

ప్రస్తుత వర్తమాన జీవితంలో చూడముచ్చటగా ఉంది. తీర్చిదిద్దిన్నట్టు ఉన్న వీధులతో, వృక్షజాలంతో. చక్కటి shopping centres ఉన్నాయి. ఈరోజు ఉదయాన్నే breakfast తర్వాత నేను, సూర్యారావుగారూ జేబులో ఉన్న రూబుల్సు వదిలించేసుకోవాలనే నిశ్చయానికి వచ్చీశేం. తర్వాత మంచు. ఎక్కడికీ వెళ్లపడదు. వెళ్లినా అక్కడ షాపులలో విపరీతమైన రద్దీ. నా దగ్గర మిగిలినవి 54 రూబుల్సు.

మంచి మార్కెటింగ్ సెంటరు ఉంది. అనేక రకాలున్నాయి. ఏ వస్తువైనా ఇంటికి అవసరమయినవీ, పిల్లలు అలంకరించుకొందికి, పసిపిల్లలు ఆడుకొనేవి, గృహాలంకరణకి పనికి వచ్చేవీ ఉన్నంతలో కొనీడం అయింది. మిగిలినవి చిల్లర సామానులు కొని బరువు పెంచుకోవాలనిపించలేదు. అందుచేత మంచి pant బట్టలు నాలుగు తీసుకొన్నాను. ఇక Smolensk sight seeing కి వెళ్లలేదు కదా, ఒక షాపులో Smolensk Guide దొరికింది. అందుచేత Smolensk స్థానిక విశేషాలు ప్రత్యేకించి రాసుకోవలసిన అవసరం లేదు. ఉదయాన్నే అంటే 11 గంటల సమయంలో చక్కటి చలిలో ఒంటి నిండా బట్టలు వేసుకొని ఆ పరిశుభ్రమయిన వీధులుగుండా వెళుతూ ఆరోగ్యంగా, అందంగా, ప్రసన్నంగా ఉండే యువకులను, యువతులను, వృద్ధులను, బాలబాలికలను చూస్తూ వెళుతూ ఉండడమే గొప్ప అనుభూతిని కలిగించింది. విశేషాలుగా తెలుసుకొన్నది ఆలోచించినదీ అంతా వట్టిది. పోనీ  సాధించేం అనుకుకొన్నవన్నీ అన్నీ వట్టి గుల్లలు. సజీవంగా ఉండడం అంటే సజీవంగా ఉన్న సకల సేంద్రియ, నిరీంద్రియ ప్రకృతితో తాదాత్మ్యం పొందగలగడం. జీవించడం అంటే అదే. కొద్ది క్షణాలే. అది అనుకొన్నప్పుడల్లా సాధ్యంకాదు. ఈ ఉదయం ఆ మహత్తరానందానుభూతి కలిగింది. బయట ఎవరికీ, పక్కనున్న సూర్యారావుగారికి కూడా నా అవస్థ తెలియదు.

24-10-87

సందె చీకటిలో Smolensk వీధులగుండా మంచు తెరల మధ్య నుంచి బస్సు కిటికీ అద్దాల వెలుగులోంచి ఇక్కడికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడిటోరియంకి వెళ్లేం. ఎంతో బాగుంది అలా వెళ్లడం. ఈరాత్రి చౌరసియా శిష్యబృందం మాస్కో వెళ్లిపోయేరు, కచేరీ అయిన తరవాత. వాళ్ల గురువుగారు ఇండియా నుంచి మాస్కో వచ్చీశేరట. మళ్లా మేము కలుస్తాం మాస్కోలో. మాకు కూడా ప్రోగ్రాం ఉంది యిక్కడ. 26 రాత్రి వెళతాం మాస్కో. మా interpreters గా వచ్చినవారు చౌరసియా శిష్యులతో చనువుగా తిరుగుతూండేవారు. సహజమే కదా. నిన్న నీనా మొహం కళావిహీనంగా ఉంది. ఎక్కడ రష్యా, ఎక్కడ ఇండియా. సన్నిహితుల్ని చేసేది సంస్కృతి, విద్యా, అభిరుచి, ఏదో, ఏవో అంటారే అవేమీకాదు. యవ్వనం. అందుచేత నిత్య యవ్వనం సాధించడం ఎలాగ?

25-10-87

ఏదో విధంగా నిత్యకృత్యాలతో నడపవలసిన రోజు ఈరోజు, రేపు రాత్రి వరకూ. సరి, breakfast అయింది. కాళ్లకి, చేతులకీ, వంటికీ తీరికగా వెన్న వంటిది మర్దనా చేసుకొని స్నానం చేసేను. బనియను, లోపలవేసుకొనే ఉన్ని షరాయి, సూర్యారావుగారి Rin సబ్బుతో ఉతికేను. సూర్యారావుగారు కొంచెం చరలగ్న జాతకుడు. అలా తిరిగి రావడానికి వెళ్లేరు. బాజీ, రావుగారు కూడా వెళ్లేరనుకొంటాను. అందరి దగ్గరా రూబుల్సు అయిపోయాయి. మరెందుకు వెళ్లేరో ఏమో.

ఈరోజు మాస్టరుగారి పుట్టిన రోజుట. వాళ్లమ్మగారు చెప్పిన పుట్టినరోజు వేరే ఉందిట. ఆయన అనుభవాలను బట్టి ఒక గొప్ప జ్యోతిష్కుడు తిథి, వార, నక్షత్ర, లగ్నాలు స్వయంపాకం చేసి జాతకం రాసేడుట. అందుచేత ఈరోజు కూడా మా అందరికీ పండగ. ఆడపిల్లలు పోటీపడి గురుభక్తి వెల్లడించేరు. ఆయనకి నగిషీ చేసిన ఆవుకొమ్ములవంటి ఆర్చీలో మధ్య మరేదో ఉంది, అది కానుకగా యిచ్చేరు. నేను వాగ్రూపంగా సర్వేశ్వరుడు సకల శుభాలు ఆయనకి కలిగించాలని కోరుతూ నా శుభాకాక్షలు తెలియజేసేను. రామరామ, పిల్లలు వాళ్లు యిచ్చే బహుమతి నా చేతిమీదుగా యిచ్చేరు.

సాయంత్రం ప్రోగ్రాం ఉంది. గంటన్నర ప్రయాణం బస్సుమీద. 4 గంటలకి బయల్దేరాలి. మరోమాట, స్మొలెన్స్క్  యూరీ గెగరిన్, అంతరిక్షయాత్రికుడికిది స్వస్థలం. అంతేకాదు, సుప్రసిద్ధ చిత్రకారుడు, నటీమణి దేవికారాణి రష్యన్ భర్త, నికొలోయ్ రోరిక్ దీ ఈ ఊరే. అతని తండ్రి, తల్లీ కూడా చాలా ప్రసిద్ధులు. 

Nikoloi Roerich

His Paintings

 
     Himalayas                             Mother of World

Yuri Gagarin


*Smolensk is a city and the administrative centre of Smolensk Oblast, Russia, located on the Dnieper River, 360 kilometres (220 miles) West-Southwest of Moscow. Its location makes it significance crossroads between Russia and Europe. Its is known for Lopatinsky Garden, with amusement rides, paths and a pond. Also in the park is the cast-iron Monument to Defenders of Smolensk in 1812, commemorating a key battle against Napoleonic Army. Strctches of the city's 16th Century fortifications still stand, inclduing a preserved wall in Pioneer Park. The hilltop turquoise Assumption Cathedral dates from the 1600s.  


No comments: