Saturday, December 13, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 14 - 16-10-1987

 


 

Click here for - రష్యా 13 - 13 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 14

16-0-87

పది గంటలకి యిక్కడికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద బజారుకి వెళ్లేం. ఆ బజారు ఒకే ఆవరణలో మూడు సింహద్వారాలు కలిగి ఉంది. అనేక రకాల వస్తువులు, బట్టలు, ఎలక్ట్రానిక్స్, కెమేరాలు, perfumes, చాలా రకాలు అనేక షాపులలో దొరుకుతాయి. ఎనిమిది అంతస్థులు. ఎవరు ఎక్కడికి వెళ్లినా 12.30 అయేసరికి మూడు ద్వారాలలో ఎక్కడయినా wait చేస్తూ ఉండాలి అనుకొన్నాం. ఏదైనా కొనాలి కదా. చిll చిట్టితల్లి సంగీతకి ఏదైనా బొమ్మ కొనాలి అనుకొన్నాను. పెద్దది కాకూడదు. తీసుకొనివెళ్లడానికి అనుకూలంగా ఉండాలి.

బొమ్మ కొన్నాను. ఆడపిల్ల బొమ్మ. తరవాత లేలా మెడలో ఉన్నలాటి గొలుసు కోసం చాలా ఊళ్లలో చాలా బజార్లలో చూసేను. దొరకలేదు ఇంతవరకు. ఇక్కడ సరీగా అలాంటిది దొరికింది. మొదట రెండు గొలుసులు తీసుకొన్నాను. ఒక గొలుసు 7.10 రూబుల్స్. రెండు చాలవని మరోటి తీసుకొన్నాను. తర్వాత ఏదో perfumes గోవిందరాజన్ కొంటూంటే, నేనూ కొన్నాను. మూడు సీసాలు 9 రూబుల్స్. తర్వాత ఏమి కొనాలి అన్నది తేలలేదు. ఏమి కొన్నా బరువు ఉండ కూడదు. చూదాం తాపీగా. ఇంకా ఉంటాం. మళ్లా 26 కి వస్తాం అని అనుకొన్నాను. అప్పటికే 12.15 అయింది. ఈలోగా bathroom అవసరం అయింది. Toilet ఎక్కడో తెలియలేదు. Gate దగ్గరకి వెళ్లేను. ఎవరూ యింకా రాలేదు. Toilet ఎక్కడా అని అడుగుతున్నాను ఎవరినో. ఇంతలో రత్తయ్యగారు వచ్చేరు. మరెవరో అమ్మాయి వచ్చేరు. నేను కొన్న గొలుసు వాళ్లకి నచ్చింది. రత్తయ్యగారు ఆ షాపు చూపించమన్నారు. నా toilet అవసరం ఆయనకి చెప్పేను. అదృష్టం. ఆ gate దగ్గరే ఉంది కిందుగా. సరే ఆ అవసరం తీర్చుకొని మొత్తానికి ఆ షాపు చూపించేను. తర్వాత ఆయనే కాదు వేలం వెర్రిగా ఆడపిల్లలు అందరూ కొన్నారు. నేను మళ్లా మరోటి కొన్నాను. మా పని అయిపోయింది. ఇంతలో మాస్టరుగారు, కమలారెడ్డి ఎక్కడికో వెళ్లి మేము తిరిగి వెళ్లిపోయే సమయానికి వచ్చేరు. సరే వాళ్లతో మళ్లా లోపలికి బయల్దేరారు పిల్లలు. నేనూ, రత్తయ్యగారు హరి హోటేలుకి వచ్చేశాం. తరవాత ఎవళమానానవాళ్లు వచ్చేరు. మొదట అనుకొన్నట్టుగా గేటు దగ్గర ఎవరూ నిలవలేదు. ఒకరికోసం ఒకరు ఎదురు చూడలేదు.

సరే. భోజన సమయం రెండు గంటలు దాటింది. అందరూ వచ్చేరు. ఐదుగురు ఆడపిల్లలు రాలేదు. మాస్టరుగారికి బ్లడ్ ప్రెషరు ఎక్కువయింది. వచ్చిన వాళ్ల మీద రాని వాళ్ల మీద వడగళ్లు ప్రారంభం అయింది. సూర్యారావుగారు, రాము తిరిగి పరిగెత్తేరు. రామరామ ఆడపిల్లలు అనుకొన్నట్టుగా ఆ గేటు దగ్గర ఏడుపు మొహాలు పెట్టుకొని కూర్చున్నారు. సరే వాళ్ల తప్పు ఏమిటో తెలియదు. అవన్నీ ఆయన ఆలోచించే స్థితిలో లేరు. ఏదో ఆందోళన, కోపం, యిష్టం వచ్చినట్టు తిట్లు. ఆ పిల్లలు తిండి కూడా తినలేకపోయేరు.

మధ్యాహ్నం, అంటే ఐదు గంటలకి బస్సు మీద మాస్కో నగరం అంతా చూపించేరు. ప్రధానమైన అన్ని స్థలాలు చూపించేరు. ఒకామె ఇంగ్లీషులో చారిత్రాత్మక సన్నివేశాలు, కట్టడాలు చాలా చక్కగా వివరించింది.

మాస్కో జనాభా తొమ్మిది మిలియన్లుట. మాస్కో నగరం విశాలంగానూ, గంభీరంగానూ ఉంది. క్రెమ్లిన్ ప్రదేశం అంతా Red Square. అంతా దిక్ భ్రమ గొల్పుతూ ఉంది. మేం ఉంటున్న రష్యా హోటేలు మాస్కా నడిబొడ్డున ఉంది. లెనిన్ భౌతికకాయాన్ని సందర్శించడానికి ఉదయం 10 గంటలనుంచి క్యూలో నిలబడతారు. అధమం 3 గంటలు క్యూలో ఉంటే ఆయన భౌతికకాయం దర్శించడం అవుతుంది. మా అందరికీ చూడాలనే ఆశ ఉంది. చలిలో 3 గంటలు నిలబడితే ఏమవుతుందో అని. మళ్లా మరో కార్యక్రమానికి అందుకోగలమా అని ఆ కార్యక్రమానికి యింతవరకూ ప్రయత్నం చేయలేదు. 26 న తిరిగి వచ్చేక యాత్ర పూర్తిచేదామని సంకల్పించి రాత్రి చక్కగా నిద్రపోయేం,

17-10-87

రాత్రి ట్రంక్ కాల్ వచ్చింది కమలారెడ్డికి. ఆ అమ్మాయి చివరి పరీక్షకి వెళ్లాలి అని, వెంటనే రమ్మని. ఆ అమ్మాయి ఈరోజు 3 గంటల flight లో ఢిల్లీ వెళుతూ ఉంది. సరే, మేం అందరం ఉత్తరాలు రాసి యిచ్చేం ఇండియాలో post చేయమని.

ఉదయం 11 గంటలకి ఒక గొప్ప మ్యూజియం* చూసేం. గ్రీకు శిల్పాలు, రోమన్ శిల్పాలు, సుప్రసిద్ధ చిత్రకారుల చిత్రాలు చూసేం. అద్భుతం అనిపించింది. మైకేల్ ఏంజిలో రెంబ్రాంట్ సుప్రసిద్ధ చిత్రాలు. కొన్ని శిల్పాలు పాలరాతితో, కొన్ని కంచు లోహంతో చేసినవి. ఆ విగ్రాహాలు life size కి మూడు రెట్లు అయినా ఉంటాయి. కొన్ని శిల్పాలు కళాదృష్టితో చూడకుండా ఉంటే ఆడపిల్లలు మొహమాటపడేటట్టు ఉన్నాయి. స్త్రీల నగ్నశిల్పాల కన్నా పురుష శిల్పాలే ఎక్కువగా ఉన్నాయి. వర్తమాన చిత్రకారులు పికాసో మొదలైనవారి చిత్రాలు మూలరచనలు కూడా ఉన్నాయి. ఆ మ్యూజియం చూస్తున్నంతసేపూ మనం మాధ్యమిక యుగంలోనే ఉన్నాము అనే అనుభవం కలుగుతుంది. బాగుంది చాలా.   

PUSHKIN STATE MUSEUM

* The Pushkin State Museum of Fine Arts in Moscow is home to a significant collection of Greek and Roman sculptures, including both original works and casts of famous statues. While the museum houses original artworks from antiquity, it also features an extensive study collection of plaster casts of classical sculpture, which are displayed on the first floor alongside original Greek and Roman works on the ground floor. 

The Pushkin Museum in Moscow has an original painting by Rembrandt and a famous copy of a Michelangelo sculpture, but no original Michelangelo paintings. The majority of Michelangelo's and many of Rembrandt's key works are housed in other major world museums. 


Saturday, December 6, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 13 - 13-10-1987

 


 

Click here for - రష్యా 12 - 11 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 13

13-10-87

ఈరోజు ఉదయం బాలల అంతర్జాతీయ సమితిని చూసేం. కొన్ని వందలమంది ఆడపిల్లలు, మగపిల్లలు అతి ఉత్సాహంతో, నవ్వులతో కేరింతలతో చూస్తుంటే రంగురంగుల పువ్వులతో నిండిన పూదోటలో తుమ్మెద ఝూంకారాలతో పక్షుల కలకల  ధ్వనులమధ్య ఉన్నట్టుంది. అది ఒక స్కూలు. నాల్గు పక్కలా భవనం మధ్య విశాలమైన మండువా వాకిలి లా ఉంది. అంతటా తివాచీలు పరిచి ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సమితి అధ్యక్షుడు ఒక 16 ఏళ్ల అబ్బాయి. అంతకంటె చిన్న అమ్మాయిలు కార్యదర్శులు. అక్కడ వాళ్ల కార్యాలయంలో ఇందిరాగాంధీ బొమ్మ ఉంది. ఇక్కడ మహాత్మ గాంధీ, జవహరులాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూరు, వీళ్ల పేర్లు చాలమందికి తెలుసును, అంటే మొత్తం రష్యాలో. ఇటీవల రాజీవ్ గాంధీ కూడా తెలుసును.

అందరూ 16 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు. వాళ్లు ప్రదర్శించిన జిమ్నాస్టిక్స్, నాట్యాలు, పాటలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఇండియా, రష్యా స్నేహ సంబంధాలనే ప్రకటన పతాకాలు, ఇండియా, రష్యా జాతీయ పతాకాలు పట్టుకొని స్వాగతం చెప్తారు. ప్రతి విషయంలోనూ ఇక్కడి పిల్లలు స్వేచ్ఛగా పెరుగుతున్నారనిపించింది. మనిషిని ప్రేమించడం సహజమయింది. కార్యక్రమం చివర కొన్ని వందలమంది పిల్లలు వచ్చి వాళ్ల చిట్టి చిట్టి కానుకలు యిచ్చేరు. ఆడపిల్లలకి మంచివి వచ్చేయి. సూర్యారావుగారికి ఒక పుస్తకం. నాకు బొమ్మల కార్డుల ఆల్బం, ఒక badgeలాంటిది వచ్చాయి.

రాత్రి రుక్మిణీకల్యాణం బాగా జరిగింది.

14-10-87

పొరపాటు. రుక్మీణీకల్యాణం బాగుందనుకొన్నాం. కొంతమంది తెలిసినవాళ్లు కూడా చాలా బాగుందనే అన్నారు. శ్రీ మాస్టారుగారు చాలా తీవ్రమయిన అసంతృప్తి ప్రకటించేరు రాత్రి కార్యక్రమం మీద. ...... ఆయన చాలా ఉదారస్వభావం కలవాడు, sentiment ఉన్నవాడు. అయినా ఈ పరిస్థితిని ఆయన దాటలేడు. దురదృష్టం.

నా బొటనవేలు గోరు దగ్గర కొంచెం నొప్పి వచ్చి క్రమంగా చీముకట్టింది. ఎందుకలా అయిందా అని ఆలోచిస్తే ఒకవేళ వీణ తీగ కడుతున్నప్పుడు వేళ్లకి గుచ్చుకోవడం వలన అలాంటిది జరిగిందా అని అనుమానం. దాని గురించి ఆంతర్యంలో బహుశః ఏ tetanus క్రిందికి మారుతుందా అనే పిచ్చి ఆలోచన కూడా వచ్చింది. కమలారెడ్డి ఈ విషయంలో శ్రద్ధ తీసుకొన్నది. నూకుస్ హోటేలులో ఉన్న మెడికల్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఆ గాయాన్ని operate చేసి చీముతీసేసి కట్టు కట్టేరు. మరేం గాభరాలేదు.

15-0-87

హోటేలు మాస్కో – సాయంత్రం 6.40

న్యాయంగా నూకుస్ లో ఉదయం బయలు దేరేం. నూకుస్ టైం 8-40 చూపిస్తుంది. కానీ మాస్కో రెండు గంటలు వెనక ఉంది. Airport నుంచి Hotel రష్యా* రావడానికి గంట పట్టింది.

 

The Russia Hotel, 1980

అసలు airport నుంచి బయటపడడమే లేటు మరే customs లాంఛనాలూ లేవు. అయినా మా అందరినీ కదిలించడానికి బస్సు ఏర్పాటు చేయడం, baggage రావడం లేటు అయింది. వచ్చిన తర్వాత మా అందరి గదులు యివ్వడం లేటు. 

ఈ హోటేలు చాలా పెద్దది. కొన్ని వేల గదులు ఉన్నాయి. 12 గంటలకి కాని ఏవి ఖాళీ అయినవో తెలియదు. తరవాత చాలా హోటేలు లాంఛనాల ప్రకారం మన గదులు కేటాయించడానికి మధ్యాహ్నం 4 గంటలయింది. పోనీ వెంటనే భోజనం ఏర్పాట్లూ కాలేదు. 5 గంటలయిందేమో! అంటే నూకుస్ టైం. అప్పుడు భోజనం. తర్వాత ఎక్కడికీ  కదలాలని అనిపించక పడుక్కొన్నాను. సూర్యారావుగారు తిరగడానికి వెళ్లేరు. విపరీతమైన చలి. ఉదయం విమానం దిగుతుండగా బయట ఉన్న టెంపరేచర్ zero  అని చెప్పింది. ఇక్కడ ప్రదేశం అంతా ఇంకా చూడాలి. పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు కనిపిస్తున్నాయి. ఈ రాత్రి మా గది అంతస్థునుంచి అవతల వీధిలో నా గదికి ఎదురుగా ఉన్న మరో భవనం   9 అంతస్తుల దీపాలు కనిపిస్తున్నాయి దూరంగా.

 * Hotel Russia

In the old picture we see the building of the former biggest hotel in Europe – the hotel "Russia". It was built in 1964 -1969 by the architect Dmitry Chechulin.  

The Russia hotel boasted 3182 rooms and could accommodate 5300 guests.  In the 70s the Russia Hotel was registered in the Guinness Book of Records as the largest hotel in the world (in 1993 it was surpassed by MGM Grand in Las Vegas). It remained the largest hotel in Europe until its closure in 2006.

During the Soviet times Russia Hotel was extremely popular. The interiors of the hotel were shot in many movies. For all years of work Russia Hotel accommodated more than ten millions people. It even had some famous guests - Mikhail Gorbachev, George Bush senior, Mike Tyson.

Saturday, November 29, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 12 - 11-10-1987

 

 

Click here for - రష్యా 11 - 08 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 12

11-10-87

అనుకొన్నట్టుగా నాలుగు గంటలకి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగి 5.30 కి బయల్దేరేం బస్సులో. తాష్కెంట్ కి ఏడు గంటలకి చేరేం. ఉదయం తొమ్మిది తర్వాత flight నూకుస్ కి. హరిప్రసాద్ చౌరాసియా బృందం మాతోనే వచ్చేరు. మనిషి సహృదయుడు. నిగర్వి. విమానంలోకి నేను, నా వీణా, వీటికి తోడు bag కూడా. శ్రీ చౌరసియా నా bag  అందుకొని విమానంలో తిరిగి యిచ్చేడు. నూకుస్ లో మళ్లా తుత్తిరీలు, డాన్సులు, రొట్టెల దొంతర స్వాగతం ఉంది.

ఫెర్గానాలోను, యాండిజాన్ లోనూ మాతో ఉండిన స్థానిక సాంస్కృతిక శాఖ ఉద్యోగి మళ్లా యిక్కడికి వచ్చేడు. మనిషి, ఏభైయేళ్లుంటాయి. దృఢంగా, కొంచెం Stalin పోలికతో ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతో, మాతో ఉన్న లేలాని, నీనాని తండ్రిలాంటి చనువుతో పిలుస్తూ ఉంటాడు. అయితే మరో సమయంలో ప్రియుడుగా కూడా మారడానికి అభ్యంతరంలేనట్టుగా ఉంటుంది అతని హావభావప్రకటన. ఇతడు యాండిజాన్ లో ఒక రాత్రి ఫిడేలు వాయించేడు తలకిందులుగా. ఇరానీ సంగీతం. అతడు ఇరాన్ వాడేట.

నూకుస్ లో హోటేలు బాగానే ఉంది. అయితే attached bath rooms లేవు అన్ని గదులకీ. విపరీతమైన చలిగా ఉంది. 11.30 దాటాకే breakfast అయింది. మధ్యాహ్నం మూడు గంటలకి dinner అన్నారు. మధ్యాహ్నం dinnerకి వెళ్లలేదు నేను, సూర్యారావుగారు. ఇక్కడ నుండి తిన్నగా మాస్కో వెళ్లడమే. ఈ ఊళ్లో ఎన్నాళ్లుండాలో, ఎన్ని కార్యక్రమాలో తెలియలేదు. ఇటీవల కార్యక్రమాలు సక్రమంగా లేవు కదా.

రాత్రి మళ్లా హోటేలులో కాలక్షేపానికి ఒక సరదా సంగీత సభ ఏర్పాటు చేసేరు. శ్రీ చౌరాసియా కుమారుడు, శిష్యుడు flute  వాయించేరు. ఒక జానపద రీతిలో పాట. చౌరసియా కొడుకు తంబురా artist మాత్రమే అనుకొన్నాను. కాదు, ఆ అబ్బాయి చక్కగానే వాయించేడు. అసలు ఈ కార్యక్రమానికి ప్రధాన కారణం  ఇరానీ పెద్దమనిషి ప్రతిభ చూపించుకోవడం. శ్రీ రావుగారి violin మళ్లా ఎరువు పుచ్చుకొన్నాడు. మిగిలినవాళ్లు ఆయనకి ఎంతకీ ఛాన్సు యివ్వరూ వాయించడానికి. ఆఖరికి ఆయనే వాయించేడు. అందరం చప్పట్లు కొట్టేం. ఎంత ఆనందించేడనీ. ముఖ్యంగా బ్రిజు మహరాజ్  పార్టీలో ఉన్న అమ్మాయి రక్తిగా పాడింది. అంతకంటే రక్తిగా ఆ అమ్మాయికి హార్మోనియం వాయించిన పెద్దమనిషి ఘజల్స్ పాడేడు.  నాగరాజు, గోవిందరాజన్ వాయించేరు. శృతిలో లేదు అన్న విషయం విన్నవాళ్లకే కాకుండా వాళ్లకీ బోధపడింది. మాస్టరుగారు చాలా నొచ్చుకొన్నారు. ప్రారంభంలో శ్రీ సూర్యారావుగారు flute అయిన తర్వాత ఝంఝూటి జావళి చక్కగా పాడేరు. బాగుంది.

12-10-87

నిన్న ఉదయం పదకొండు గంటలకి నూకుస్ యూనివర్సిటీని సందర్శించేం. కొత్తగా ఏర్పడ్డ యూనివర్సిటీట. ఇంకా భవన నిర్మాణం పూర్తికాలేదు.నూకుస్ రష్యాతో విలీనమైన రిపబ్లిక్ ట.  కారాకల్పాక్స్థాన్  రిపబ్లిక్ కి నూకుస్ capital.


యూనివర్సిటీలో వివిధ శాఖలు, వాటి కార్యకలాపాలు విశదపరిచేరు. తర్వాత తేనీరు సేవనం. తర్వాత యూనివర్సిటీలో auditorium లో సాంస్కృతిక కార్యక్రమం. చాలామంది యూనివర్సిటీ విద్యార్థులే అనుకొంటాను. కార్యక్రమం మహా చురుకుగా సౌహర్ధ ప్రదర్శనతో రక్తిగా నడిపించేరు. నూకుస్ ప్రాంతీయ ఆటపాటలతో రష్యాలోని వివిధ ప్రాంతీయ నృత్యాలను, పాటలను పాడారు. పిల్లలంతా బాగున్నారు. విచిత్రవేషధారణలో హుషారుగా నాట్యం చేసేరు.




Representative Purpose

చివర భారతీయ కళల యడల రష్యాలో ఉన్న ఆసక్తి వ్యక్తం చేస్తు ఒక రెండు పాటలు పాడమన్నారు. యూనివర్సిటీలో బ్రిజుమహరాజ్ పార్టీ, మాదీ, చౌరాసియా పార్టీ అన్నీ కలిసే  ఉన్నాయి. 

బ్రిజుమహరాజ్ పార్టీ నాయకురాలు సాస్వతీ సేన్ తెలివైన పిల్ల. బ్రిజుమహరాజ్ ప్రస్తుతం రష్యాలో లేరు. తిరిగి ఢిల్లీ  వెళ్లిపోయేరుట. తిరిగడానికి ఓపిక లేక.  ప్రస్తుతం బ్రిజుమహరాజు కొడుకు, సాస్వతీ సేన్ వీళ్లే పార్టీ నాయకులు. సాస్వతీ సేన్ చక్కగా మాట్లాడింది యింగ్లీషులో. అంటే ఉచితంగా. తర్వాత వాళ్ల పార్టీ అందరూ కలిసి ఒక భజన్  song తర్వాత రష్యా భాషలో ఉన్నపాట, వీళ్లు ప్రత్యేకం యిక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకొన్న పాట, పాడేరు. కూచిపూడి బృందం కూడా బృందగానంలో చేరేరు. తర్వాత మాస్టరుగారు మన పిల్లలకి కూడ ఇక్కడ డ్యాన్సు చేసిన అమ్మాయిల డ్రస్సు వేసి వాళ్లందరి ఫోటోలు తీయించేరు. బాగా కాలక్షేపం జరిగింది.


Saturday, November 22, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 11 - 08-10-1987

 


 

Click here for - రష్యా 10 - 05 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 11

8-10-87

ఈరోజు ఉదయం breakfast తర్వాత బస్సులో ఛుంకెట్అనే ఊరు వచ్చాం. జంబుల్ నుంచి యిక్కడికి మూడు గంటల ప్రయాణం. చౌరాసియా బృందం కూడా మాతోటే వచ్చేరు. రాగానే భోజనం లేదు. ఆఖరికి bread, పళ్లు, cakes, తిన్నాం. ఆరు గంటలకి lunch. ఇప్పుడే పూర్తిచేసి రాస్తున్నాను. రాత్రి మళ్లా తొమ్మిదికో, పదికో డిన్నరుట. సూర్యారావుగారు, రత్తయ్యగారూ shoppingకి బయల్దేరేరు. సూర్యారావుగారి దగ్గర రూబుల్స్ అయిపోయాయి. పది రూబుల్స్ పుచ్చుకున్నారు, మాలా గణపతి తనకి యివ్వాలని తిరిగి యిచ్చేస్తానని.

ఇవాళ దారిలో జంబుల్ నుంచి చుంకెంట్ వస్తున్నప్పుడు దారిలో మంచు బాగా పడింది. మంచు బంతులు చేసి విసురుకున్నారు చరుకైనవాళ్లు. అక్కడా యిక్కడా కూడా చలి బాగా ఉంది. చిత్రం, చుంకెంట్ లో మంచి ఎండ ఉంటూ మంచి చలిగా ఉంది. రేపూ, ఎల్లుండీ యిక్కడ. తరవాత నూకూన్ వెళ్లాలిట. అక్కడికి వెళ్లాలంటే తాష్కెంట్ వెళ్లి మరో flightలో వెళ్లాలి.

బట్టలు మార్చుకొని కాస్త విశ్రాంతి తీసుకొందామనుకొన్న సమయంలో తలుపు కొడితే వినపడి వెళ్లేను. చౌరాసియా బృందం interpreter. లోపలికి రమ్మాన్నాను. అతనికి ఇండియన్ శాస్త్రీయ సంగీతం యిష్టంట. మొత్తానికి వీణ బురఖా తీసి నఖశిఖ పర్యంతం పరిక్షచేసి తన్మయుడయిపోయేడు. తరవాత దానిని శృతి చేసే పద్ధతి, వాయించే పద్ధతి ఆ వాద్యంలోని విశిష్టత తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలు ప్రకటించేడు. అతనికి వీణ మీద ప్రారంభ శిక్షణ ఎలా యిచ్చేదీ చెప్పేను, వీణ మీటు దగ్గరనుంచి. వీణ పట్టుకొని ఒక రెండు గంటలు వదలలేదు. చిత్రం, అతనికి వీణ అమరింది. సరళీస్వరాలు ఒక మూడు ఖచ్చితంగా సునాదంగా వాయించడం వచ్చింది. వీలు చూసుకొని వచ్చి మళ్లీ సాధన చేస్తానన్నాడు. ఇంతకీ అతని పేరు అడగడం మర్చిపోయేను. ఎనటోవ్ అని అంటున్నారు సూర్యారావుగారు. అతడు తన గదికి వెళ్లిపోయిన తర్వాత సూర్యారావుగారు చంపాగ్నితెచ్చేరు. ఆ అగ్నిని అర్చించేం, కొంతసేపు. దక్షిణ – మనిషికి నాలుగు రూబుల్సు.

9-10-87

యథాప్రకారం స్థానిక దృశ్యపర్యవేక్షణ జరిగింది. సరే, ఒకాయన వచ్చేడు, మాకు విషయాలు వివరించడానికి. ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. దాని మీదకి పోవడానికి మెట్లు. అక్కడ ఒక ఫైటరు విమానం ఉంచేరు. రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన వీరుల స్మృత్యర్థంగా. సరే, మా వ్యాఖ్యాత స్థానిక చరిత్ర అంటే చుంకెంట్ పుట్టిన దగ్గర నుంచి చెప్పేడు. 1218లో ఛెంగిస్ ఖాన్ ఈ ఊరిని జయించేడట. తర్వాత అలా అలా చెప్తూ 1923 కావోలు అప్పటికి రష్యా యూనియన్ లో చేరినంత వరకు ఒక గంట సేపు హిస్టరీ పాఠం చెప్పి వదిలేడు. రామరామ, నీనా ముఖం ఎర్రపడిపోయింది అనువాదం చెయ్యలేక. పాఠం ఎగవేసిన కుర్రాళ్లలా మేం తిరుగుడు ప్రారంభించేం. తర్వాత హిస్టరీ మాస్టారు ఏది కనబడితే దాన్నివిశదపరిచేరు. ఇది రైలు స్టేషన్, ఇది పోస్టాఫీసు, ఇది మార్కెట్, ఇది ఫలానా, ఇది ఫలానా అంటూ. ఆఖరికి విమానంలా ఉన్న రెస్టేరంట్ కి వెళ్లేం. విమానంలాంటిది కాదు. విమానమే. దానిలోకి ఎక్కి విమానయంత్రం అంతా పరిశీలించవచ్చును. సరదా ఉన్నవాళ్లు విమానం నడుపుతున్నట్టు ఫోటోతీయించుకున్నారు కూడా. తర్వాత ఒక ఆడ shopping centre అనగా అన్ని ఆడవాళ్లకి ఉపయోగపడే వస్తువులున్న మాట. అప్పటికే టైము అయిపోయింది. షాపింగ్ మీద దృష్టిపడలేదు. శ్రీ BVS మణిగారి అమ్మాయి, లక్ష్మి మాత్రం మంచి బొమ్మ, ఈ దేశం అలంకారంతో ఉన్న ఆడపిల్ల బొమ్మ కొంది. కొంచెం పెద్దది. తీసుకొని వెళ్లడం శ్రమ. బొమ్మ చాలా బాగుంది. కల్పలత కొంది బొమ్మ బొచ్చుకుక్క. దానికి మొహం, కళ్లు కనిపించలేదు. అంతా బొచ్చే.

రాత్రి చండాలిక సార్థకమయింది. ఎందుకలా అయింది? _______ అన్నట్టుగా అయింది. మైక్సు సరిగా లేకపోవడం. ఒకరికొకరు సంబంధం లేకుండా దూరంగా కూర్చోడం. పాడేపాటకి వాయించే వాద్యానికి పొంతన లేకపోవడం, యింకా ఎన్నో.

నిన్న రాత్రి లేలా పుట్టినరోజు. 20 నిండి 21 వచ్చిందిట. హోటేలులో రాత్రి భోజన సమయంలో ఆ అమ్మాయి cake cut చేయడం, హరిప్రసాద్ చౌరాసియా, గురు వెంపటి చిన్న సత్యంగార్ల ఆ ఆశీస్సులు పొందడం, తక్కుంగల కళాకారుల శుభాకాంక్షలు కూడా తోడై రావడం ఆ అమ్మాయి సంతోషాన్ని యినుమడించాయి.

10-10-87

ఈవాళ రాత్రి రుక్మిణీకల్యాణం అన్నారు. కాదు, items అంటున్నారు. ఏదో అది అయేక తిండి, నిద్ర పూర్తి చేసి తెల్లవారు జామున ఐదు గంటలకు బస్సు మీద తాష్కెంట్. అక్కడి నుంచి నూమస్. అదీ కార్యక్రమం. లేదు, రుక్మిణీకల్యాణం లేదు, గిరిజాకల్యాణం లేదు, ఏ కార్యక్రమం లేదు. రోజంతా రెస్టే.

మధ్యాహ్నం lunch తర్వాత మోటారు కారుతో acrobats చూసే కార్యక్రమం ఉందన్నారు. నేను వెళ్లలేదు. మళ్లా నిద్రలేచీసరికి మధ్యాహ్నం నాలుగు దాటింది. చౌరాసియాగారి interpreter వచ్చేడు. మరో రెండు గంటలు వీణ సాధన చేసి వెళ్లేడు. ఈ రష్యా సంచారం పూర్తి అయేసరికి అధమం అలంకారాల వరకైనా వస్తుందేమో అతనికి. సూర్యారావుగారు తిరిగి వచ్చేరు. కారు ఫీట్సు బాగున్నాయిట. మగవాళ్లు motorcycle తో చేయడం తప్ప కారు feats చేయడం అలవాటులేదు. తెల్లవారు జామున నాలుగు గంటలకి లేచి తాష్కెంట్ వెళ్లి అక్కడ నుంచి నూమాస్ వెళ్లాలి.


Saturday, November 15, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 10 - 05-10-1987

 


 

Click here for - రష్యా 9 - 03 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 10

5-10-1987         

ఇవాళ breakfast తర్వాత పదకొండు గంటలకి sight seeing అని బయల్దేరేం. తీరా లెనిన్ మ్యూజియంకి వెళితే అది మూసేసి ఉంది. ఆఖరికి అక్కడి పార్క్ లో కొంతసేపు అటూ ఇటూ పచార్లు, కొన్ని ఫోటోలు తీసుకోవడాలు తర్వాత అక్కడనుంచి ఎక్కడికి వెళ్లడం అన్న విషయంలో వ్లాడిమరు ఏదో చెప్తే సరీ అని అనుకొన్నాం. మళ్లా నీనా ఏం చెయ్యడం అని అడిగీసరికి మాస్టారుగారికి కోపం వచ్చి తిన్నగా హోటేలుకి పోదాం అన్నారు. మళ్లా ఏదో రిహార్సలు చేయవలసి ఉందన్నారు. ఈ బాధలేమీ లేకుండా నాగరాజు, గోవిందరాజన్ ఈ వేళ రావడమే మానీశారు. ఏమంటే బట్టలు ఉతుక్కోవాలన్నారు.

ఈ సాయంత్రం ఐదు గంటలకి బయల్దేరాలిట. Makeupలు యిక్కడే హోటేలులో. కార్యక్రమం యిక్కడికి ముప్ఫై కిలోమీటర్ల దూరంలోని సాముదాయక వ్యవసాయ క్షేత్రంలో. సాయంత్రం అయింది. కార్యక్రమం రక్తిగానే వచ్చింది. చిన్న హాలు, చిన్న స్టేజీ. అయితే ప్రధానమైన విషయం కిర్గీజియా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మాతోటే ఉండి అన్ని ఏర్పాట్లు చేసేరు. అంతా మామూలే. ప్రత్యేకంగా రాయడానికి లేదు.

6-10-1987

పది గంటలకి (కిర్గీజియా) సాంస్కృతిక శాఖ డైరెక్టరు వాళ్ల ఆఫీసు, అంటే, మొన్న చండాలిక వేసేమే అదే థియేటరు, ఆ భవనంలో ఈ auditorium రెండో అంతస్థులో ఉంది, అంతా మార్బులుతో కట్టారు, చాలా పెద్ద భవనంలో వీడ్కోలు కార్యక్రమం. సాంస్కృతిక శాఖా డైరెక్టరు గంభీరుడు, సరదా అయినవాడు, సహృదయుడు. మాకు ఆ భవనంలో ఉన్న వివిధ ప్రదేశాలు, వాటి ప్రాముఖ్యత వివరించేరు. ఒక ఆడిటోరియంలో మైక్స్ లేకుండా చక్కటి acoustics ఉన్న auditoriumకి తీసుకొని వెళ్లేరు. అక్కడ ఒకాయన ఒక ఎలక్ట్రిక్ ఆర్గన్ మీద కొన్ని రచనలు వాయించేరు. తరవాత మరో హాలులో టీ ఏర్పాటు. అదే సమయంలో  డైరెక్టరు యథాలాపంగా అంటూ సీరియస్ గానే చెప్పేడు రష్యా, ఇండియా స్నేహ సంబంధాలు, వాటి ప్రత్యేకత. కళలు, కళాకారుల సాంఘిక బాధ్యత వీటి గురించి చక్కగా చెప్పేడు రష్యన్ భాషలో. నీనా చెప్పింది ఇంగ్లీషులో. చివర మా అందరికీ జ్ఞాపికలు యిచ్చేరు. మాస్టరుగారికి చదరంగ బలం, ఆడపిల్లలకి మంచి రంగుల రుమాళ్లు పెద్దవి, మిగిలిన వాళ్లకి కిర్గీజియాలో చేసిన జాతీయ దుస్తులతో ఉన్న కర్ర బొమ్మలు యిచ్చేరు. 

కిర్గీజియా చీనా సరిహద్దులలో ఉంది. ఈ సాంస్కృతిక డైరెక్టరు యిచ్చిన వీడ్కోలు ఉపన్యాసంలో ఏదో రాజకీయపు వాసన వచ్చింది. ట్రైన్ బయల్దేరినప్పుడు చెప్పిన మాటలు కాస్త కవిత్వంగా ఉన్నాయి. మానవుల మధ్య యోగ వియోగాలగురించి కాస్త ఆర్ద్రంగా మాట్లాడేడు.

సాయంత్రం నాలుగు గంటలకి బయల్దేరేం. జంబుల్ (Dzhambul)అనే పట్టణానికి ట్రైను మీద. ట్రైను బాగానే ఉంది. Toilet ట్రైనులో కూడా అధ్వాన్నంగానే ఉంది. Frunze నుంచి జంబుల్ వెళ్లడానికి రాత్రి ఒంటిగంట అనుకొన్నాం. కాదు, రాత్రి 10.30కి చేరుకొన్నాం. హోటేలులో ప్రవేశించాం. సంసారపక్షంగా అన్ని సదుపాయాలతో ఉంది మా గది. ఉదయాన్ని నూతన గృహంలో పాలు పొంగించి కాఫీ తాగేం.  7.10కి  breakfast కూడా అయింది. శ్రీ హరిప్రసాద్ చౌరాసియా మళ్లా ఇక్కడ కలిసేరు. Breakfast సమయంలో ఆయన పరివారంతో ఉన్నాడు అక్కడ.

ఈ సాయంత్రం ఏదో collective farmలో ప్రోగ్రాం. యిక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంట. నగర పర్యవేక్షణకి వెళ్లాం. ఈ ఊళ్లో ఉదయం అంటే పగలు కూడా చలిగానే ఉంది. ఊరికి కొంత దూరంలో ఒక 12వ శతాబ్ది సమాధి అంటే మసీదు అంత ఉంది. 2వ ప్రపంచ యుద్ధంలో దాని మీద విమానం పడి కొంత శిధిలమయింది. ఈ శిధిలాలను కాపాడుతూ దాని చట్టూ గాజు గోడలు ఏర్పాటు చేసి యాత్రికులకు దర్శనయోగ్యంగా చేసేరు. ఆ సమాధి – ప్రియురాలు పాము కాటుతో మరణించింది. ప్రియుడు ఆమె స్మృతి చిహ్నంగా కట్టించేడట. *

తర్వాత ఏదో మ్యూజియం సందర్శనం. అన్ని మ్యూజియంలు ఒకటే. మానవ చరిత్రలో పరిణామం అన్ని ప్రాంతాలలోను ఒకే విధంగా వచ్చినట్టు అనిపిస్తుంది, ఏ మ్యూజియం చూసినా. తర్వాత ఒక, మన సంతలాంటి, బజారు. అంటే, మార్కెట్ లాంటిది. పళ్లు, కూరగాయలు, జోళ్లు, రెడీమేడ్ బట్టలు ప్లాట్ ఫారం మీద అమ్మినట్టు, కిస్ మిస్, లవంగాలు, ఈ రకపు మసాలా సామాను, ఇవన్నీ అమ్ముతున్నారు. కాలక్షేపానికి నేను అక్రూట్ పప్పు కొన్నాను. చాలామంది మనవాళ్లు కూడా కొన్నారు. ఒక గాజుగ్లాసు 1.50 రూబుల్సు. తర్వాత మరో మ్యూజియం చూసి యిక ఓపిక లేక బుద్ధిగా హోటేలుకి వచ్చేశాం. 

సాయంత్రం నాలుగు గంటలకి బస్సుమీద ఒక వ్యవసాయ క్షేత్రంా ఆడిటోరియంకి తీసుకొని వెళ్లేరు. స్టేజీ, హాలు బాగున్నాయి. మన ప్రదర్శనకి అనుకూలమయిన లైట్లు, spotlights యిత్యాదులు లేవు. దానికోసం ప్రయత్నం. చివరికి ఎలాగైతేనేం ఒక రెండు spots  తెచ్చేరు.

మరో విశేషం ఏమిటంటే మళ్లా ఈరోజున మా ప్రోగ్రాం ముందు శ్రీ హరిప్రసాద్ చౌరాసియా కచేరీ. చౌరసియా, ఆయన కొడుకు పక్క వాద్యం, ఒకాయన తబలా, మరో యిద్దరు భక్తులు తంబురా. మొత్తం ఒక ముప్పావుగంట ఆయన కచేరీ. మొత్తం ఒక ముప్పావు గంట ఆయన కచేరీ. ప్రధానంగా మన హంసధ్వని ఆలాపన. దానిలో flute పద్ధతిలో తానం అనుకోవచ్చును. తరవాత మన వాతాపిపల్లవి ఆధారంగా మనోధర్మంగా రాగ, స్వరసంచారములు. మంచి నాదం, పట్టువిరుపులు, రసదృష్టి, భావుకత, లోకజ్ఞత అన్నీ ఉన్నాయి ఆయనలో. ప్రధాన శ్రోతలం మేమే. తర్వాత మిశ్ర ఖమాస్ లో ఏదో భజన్ అనుకొంటాను, మన్నాడే కూడా పాడాడు, ఆపాటరికార్డ్. కచేరీ బాగుంది. ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ సంగీతం విని ఆనందించాలంటే రాగభావం తెలియాలి. ఆ రాగస్వరూపాన్ని అందివ్వడంలో ఆ ప్రత్యేక కళాకారుని ప్రతిభ గ్రహించడానికి తులనాత్మక పరిశీలన కావాలి. ఇవన్నీ ఉజ్బెకిస్థాన్ లోనూ, కజక్ స్థాన్ లోనూ ఎలా కుదురుతాయి. అయితే ఒకటి, పసిపిల్లలు జోలపాట ఆనందించినట్టు సుశ్రావ్యమయిన మురళీనాదం చక్కటి తబలా అనుసరణ ఆనందిచబడతాయి.

తర్వాత మా కార్యక్రమం ప్రోత్సాహకరంగా నడిచింది. చాలామంది ప్రేక్షకులు, కళాకారులకి పుష్పగుచ్ఛాలందించేరు. ఈ జంబుల్ తో రుణానుబంధం ఈరోజుతో సరి. 

* జంబుల్ (Dzhambul) కజకిస్థాన్ లోఉన్న 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన  ఒక పురాతన నగరం. తరాజ్ పేరుతో నిర్మించబడిన ఈ నగరం అనేక పేర్లు మార్చుకొని 1993లో తిరిగి  Taraz అనే పేరుతోనే ఇప్పుడు  పిలువబడుతోంది. https://central-asia.guide/kazakhstan/destinations-kz/taraz/

* Aisha bibi Mouseleum

Aisha Bibi Mausoleum is an exquisite architectural gem located in Taraz, Kazakhstan, and attributed with romantic legends. The mausoleum was constructed in the 11th or 12th century and is dedicated to a young woman named Aisha, the beloved of Karakhan, a local ruler. According to lore, Aisha died after being bitten by a snake, and the mausoleum was built as a monument to their love. Its facade is adorned with intricately carved terracotta tiles, featuring floral and geometric designs that showcase the sophistication of Karakhanid-era architecture. It has been preserved over the centuries and stands as an important cultural and historical heritage site. Enclosed by a small park, it offers a serene atmosphere for visitors. This monument is also significant for its contribution to Islamic architecture in Central Asia and is a revered place for locals and tourists alike. It was listed as a UNESCO World Heritage Tentative list since 1996 reflecting its importance. Its preservation and restoration efforts continue to maintain its historical integrity and beauty.


  Aisha bibi Mousoleum (ఆయెషా బీబి సమాధి)