Saturday, December 6, 2025

నా విదేశయాత్ర అనుభవాలు - రష్యా - 13 - 13-10-1987

 


 

Click here for - రష్యా 12 - 11 -10-1987

 
కూచిపూడి ఆర్ట్ అకాడెమీ, మద్రాసు, సంస్థతో శ్రీ నాన్నగారి అనుబంధం నాకు గుర్తున్నంత వరకు 1963లో పనగల్ పార్క్ ఎదురుగా ఆ నాట్య పాఠశాల ప్రారంభదినాలనుంచే. అకాడెమీ నాట్య కార్యక్రమాల్లో గాయకుడిగా, వీణావాద్యకళాకారుడిగా, సంగీతదర్శకుడిగా వివిధ అవతారాలలో సహకరించారు నాన్నగారు. 1974లో శ్రీ ఘంటసాలగారి నిర్యాణం తరువాత శాశ్వతంగా కూచిపూడి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 1975 - 2012 మధ్యకాలంలో సంగీత దర్శకుడిగానే కాక వీణావాదకుడుగా కూచిపూడి నాట్య గురువు శ్రీ వెంపటి చినసత్యంగారితో దేశవిదేశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలలో క్రియాశీలంగా పాలుపంచుకున్నారు. 2012 లో శ్రీ మాస్టరుగారి మరణం తరువాత కూడా అకాడెమీతో ఆ ఆత్మీయ అనుబంధం కొనసాగింది. 1987, 1988, 1989 సంవత్సరాలలో భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ICCR ఆధ్వర్యంలో జరిగిన India Festivals లో కూచిపూడి బృందం సభ్యుడిగా పాల్గొన్న కొన్ని విదేశపర్యటనలలో సంగీత కళాకారుడుగానే కాక సాహితీవేత్తగా కూడా నాన్నగారు నిక్షిప్తం చేసిన తన విదేశయాత్ర అనుభవాలను ఈ blog post ల ద్వారా పంచుకుంటున్నాను. నాన్నగారు ఈ పర్యటనలలో దర్శించిన  స్థలాల గురించిన ఆన్ లైన్ లో ఉన్న మరింత సమాచారాన్ని ఫోటోలను కూడా జత చేసేను. 

- పట్రాయని వేణు గోపాలకృష్ణ అనే గోపి 

రష్యా - 13

13-10-87

ఈరోజు ఉదయం బాలల అంతర్జాతీయ సమితిని చూసేం. కొన్ని వందలమంది ఆడపిల్లలు, మగపిల్లలు అతి ఉత్సాహంతో, నవ్వులతో కేరింతలతో చూస్తుంటే రంగురంగుల పువ్వులతో నిండిన పూదోటలో తుమ్మెద ఝూంకారాలతో పక్షుల కలకల  ధ్వనులమధ్య ఉన్నట్టుంది. అది ఒక స్కూలు. నాల్గు పక్కలా భవనం మధ్య విశాలమైన మండువా వాకిలి లా ఉంది. అంతటా తివాచీలు పరిచి ఉన్నాయి. ఈ అంతర్జాతీయ సమితి అధ్యక్షుడు ఒక 16 ఏళ్ల అబ్బాయి. అంతకంటె చిన్న అమ్మాయిలు కార్యదర్శులు. అక్కడ వాళ్ల కార్యాలయంలో ఇందిరాగాంధీ బొమ్మ ఉంది. ఇక్కడ మహాత్మ గాంధీ, జవహరులాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూరు, వీళ్ల పేర్లు చాలమందికి తెలుసును, అంటే మొత్తం రష్యాలో. ఇటీవల రాజీవ్ గాంధీ కూడా తెలుసును.

అందరూ 16 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు. వాళ్లు ప్రదర్శించిన జిమ్నాస్టిక్స్, నాట్యాలు, పాటలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా పిల్లలు ఇండియా, రష్యా స్నేహ సంబంధాలనే ప్రకటన పతాకాలు, ఇండియా, రష్యా జాతీయ పతాకాలు పట్టుకొని స్వాగతం చెప్తారు. ప్రతి విషయంలోనూ ఇక్కడి పిల్లలు స్వేచ్ఛగా పెరుగుతున్నారనిపించింది. మనిషిని ప్రేమించడం సహజమయింది. కార్యక్రమం చివర కొన్ని వందలమంది పిల్లలు వచ్చి వాళ్ల చిట్టి చిట్టి కానుకలు యిచ్చేరు. ఆడపిల్లలకి మంచివి వచ్చేయి. సూర్యారావుగారికి ఒక పుస్తకం. నాకు బొమ్మల కార్డుల ఆల్బం, ఒక badgeలాంటిది వచ్చాయి.

రాత్రి రుక్మిణీకల్యాణం బాగా జరిగింది.

14-10-87

పొరపాటు. రుక్మీణీకల్యాణం బాగుందనుకొన్నాం. కొంతమంది తెలిసినవాళ్లు కూడా చాలా బాగుందనే అన్నారు. శ్రీ మాస్టారుగారు చాలా తీవ్రమయిన అసంతృప్తి ప్రకటించేరు రాత్రి కార్యక్రమం మీద. ...... ఆయన చాలా ఉదారస్వభావం కలవాడు, sentiment ఉన్నవాడు. అయినా ఈ పరిస్థితిని ఆయన దాటలేడు. దురదృష్టం.

నా బొటనవేలు గోరు దగ్గర కొంచెం నొప్పి వచ్చి క్రమంగా చీముకట్టింది. ఎందుకలా అయిందా అని ఆలోచిస్తే ఒకవేళ వీణ తీగ కడుతున్నప్పుడు వేళ్లకి గుచ్చుకోవడం వలన అలాంటిది జరిగిందా అని అనుమానం. దాని గురించి ఆంతర్యంలో బహుశః ఏ tetanus క్రిందికి మారుతుందా అనే పిచ్చి ఆలోచన కూడా వచ్చింది. కమలారెడ్డి ఈ విషయంలో శ్రద్ధ తీసుకొన్నది. నూకుస్ హోటేలులో ఉన్న మెడికల్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఆ గాయాన్ని operate చేసి చీముతీసేసి కట్టు కట్టేరు. మరేం గాభరాలేదు.

15-0-87

హోటేలు మాస్కో – సాయంత్రం 6.40

న్యాయంగా నూకుస్ లో ఉదయం బయలు దేరేం. నూకుస్ టైం 8-40 చూపిస్తుంది. కానీ మాస్కో రెండు గంటలు వెనక ఉంది. Airport నుంచి Hotel రష్యా* రావడానికి గంట పట్టింది.

 

The Russia Hotel, 1980

అసలు airport నుంచి బయటపడడమే లేటు మరే customs లాంఛనాలూ లేవు. అయినా మా అందరినీ కదిలించడానికి బస్సు ఏర్పాటు చేయడం, baggage రావడం లేటు అయింది. వచ్చిన తర్వాత మా అందరి గదులు యివ్వడం లేటు. 

ఈ హోటేలు చాలా పెద్దది. కొన్ని వేల గదులు ఉన్నాయి. 12 గంటలకి కాని ఏవి ఖాళీ అయినవో తెలియదు. తరవాత చాలా హోటేలు లాంఛనాల ప్రకారం మన గదులు కేటాయించడానికి మధ్యాహ్నం 4 గంటలయింది. పోనీ వెంటనే భోజనం ఏర్పాట్లూ కాలేదు. 5 గంటలయిందేమో! అంటే నూకుస్ టైం. అప్పుడు భోజనం. తర్వాత ఎక్కడికీ  కదలాలని అనిపించక పడుక్కొన్నాను. సూర్యారావుగారు తిరగడానికి వెళ్లేరు. విపరీతమైన చలి. ఉదయం విమానం దిగుతుండగా బయట ఉన్న టెంపరేచర్ zero  అని చెప్పింది. ఇక్కడ ప్రదేశం అంతా ఇంకా చూడాలి. పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన రోడ్లు కనిపిస్తున్నాయి. ఈ రాత్రి మా గది అంతస్థునుంచి అవతల వీధిలో నా గదికి ఎదురుగా ఉన్న మరో భవనం   9 అంతస్తుల దీపాలు కనిపిస్తున్నాయి దూరంగా.

 * Hotel Russia

In the old picture we see the building of the former biggest hotel in Europe – the hotel "Russia". It was built in 1964 -1969 by the architect Dmitry Chechulin.  

The Russia hotel boasted 3182 rooms and could accommodate 5300 guests.  In the 70s the Russia Hotel was registered in the Guinness Book of Records as the largest hotel in the world (in 1993 it was surpassed by MGM Grand in Las Vegas). It remained the largest hotel in Europe until its closure in 2006.

During the Soviet times Russia Hotel was extremely popular. The interiors of the hotel were shot in many movies. For all years of work Russia Hotel accommodated more than ten millions people. It even had some famous guests - Mikhail Gorbachev, George Bush senior, Mike Tyson.

No comments: